Share News

నగల దుకాణంలో దోపిడీ

ABN , Publish Date - May 04 , 2026 | 04:14 AM

పట్టపగలు.. నగల దుకాణం తెరిచీతెరవగానే.. అందులోకి చొరబడిన ఐదుగురు దుండగులు తుపాకులతో సిబ్బందిని బెదిరించి, నిర్బంధించి దాదాపు ఒక కిలో ఆభరణాలను దోచుకుపోయారు! తిరగబడిన ...

నగల దుకాణంలో దోపిడీ

  • కరీంనగర్‌ నడిబొడ్డున పట్టపగలే షాపులోకి తుపాకులతో చొరబడ్డ దుండగులు

  • సిబ్బందిని బెదిరించి కిలో బంగారు నగల దోపిడీ

  • తిరగబడ్డ మేనేజర్‌, సిబ్బందిపై కాల్పులు

  • ముగ్గురికి గాయాలు.. 2 బైకులపై దొంగల పరార్‌

  • 1.8 కిలోల ఆభరణాలున్న మరో బ్యాగును నగల దుకాణంలోనే వదిలేసి వెళ్లిపోయిన వైనం

  • అంతర్రాష్ట్ర ముఠా పనేనని పోలీసుల అనుమానం

  • నిందితుల సమాచారమిస్తే రూ.లక్ష బహుమతి!

కరీంనగర్‌, కరీంనగర్‌ క్రైం, మే 3 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పట్టపగలు.. నగల దుకాణం తెరిచీతెరవగానే.. అందులోకి చొరబడిన ఐదుగురు దుండగులు తుపాకులతో సిబ్బందిని బెదిరించి, నిర్బంధించి దాదాపు ఒక కిలో ఆభరణాలను దోచుకుపోయారు! తిరగబడిన షాపు మేనేజర్‌, సిబ్బందిపై కాల్పులు జరపగా.. ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. కరీంనగర్‌ నడిబొడ్డున.. జిల్లా కోర్టుకు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కార్యాలయానికి సమీపంలో.. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కరీంనగర్‌ జ్యోతినగర్‌ ప్రాంతంలోని పీఎంజే జ్యువెలరీ షాపును ఆదివారం తెరవగానే.. 11.01 గంటల సమయంలో ఒక వ్యక్తి దుకాణంలోకి ప్రవేశించాడు. తనకు బంగారం చైన్‌ కావాలని, మోడల్స్‌ చూపించాలని సిబ్బందిని కోరాడు. అప్పుడే లాకర్‌ నుంచి ఆభరణాలు తీసుకువచ్చి సర్దుతున్న షోరూం సిబ్బంది అతడితో మాట్లాడుతుండగానే మరో నలుగురు లోపలికి చొరబడ్డారు. ఐదుగురూ కలిసి.. వారివద్ద ఉన్న తుపాకులు చూపించి సెక్యూరిటీగార్డును, సిబ్బందిని.. మొత్తం ఎనిమిది మందినీ బెదిరించి చేతులు పైకెత్తించి, మోకాళ్ల మీద కూర్చోబెట్టారు. చేతికందిన ఆభరణాలను రెండు బ్యాగుల్లో సర్దుకున్నారు. ఆ సమయంలో.. దుకాణం మార్కెటింగ్‌ మేనేజర్‌ ముస్తాక్‌అలీ వారికి ఎదురు తిరిగి, ఒకరి తుపాకీని పట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో ధైర్యం తెచ్చుకున్న మిగతా సిబ్బంది కూడా దుండగులను ఎదిరించే ప్రయత్నం చేశారు. దీంతో వారు ఒక్కసారిగా సిబ్బందిపై కాల్పులకు తెగబడి నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో.. మేనేజర్‌ ముస్తాక్‌ అలీకి, షాపులో పనిచేస్తున్న రాజేశ్‌, కమలహాసన్‌, బూర్ల మధుకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ హడావుడిలో దుండగులు ఆభరణాలున్న బ్యాగుల్లో ఒకదాన్ని తీసుకుని.. సరిగ్గా 11.12 గంటలకు పరుగుపరుగున బయటకు వెళ్లిపోయారు. మరో బ్యాగును నగలతో సహా దుకాణంలోనే వదిలి పారిపోయారు.

1.jpg


దొంగలు వెళ్లిపోగానే షాపు సిబ్బంది పోలీసులకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. క్లూస్‌టీం మొబైల్‌ వ్యాన్‌ను సంఘటనా స్థలానికి రప్పించి ఆధారాలను సేకరించారు. ఈ దోపిడీకి పాల్పడినవారిని పట్టుకునేందుకు పోలీసులు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కరీంనగర్‌ చుట్టుపక్కల వివిధ మార్గాల్లో సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి.. దొంగలు రెండు ద్విచక్ర వాహనాలపై (నల్ల రంగు పల్సర్‌, తెల్ల రంగు అపాచీ బైక్‌లపై) విద్యానగర్‌ మీదుగా మల్కాపూర్‌ మార్గంలో పారిపోయినట్లు గుర్తించారు. కాగా.. కరీంనగర్‌ పోలీసు కమిషనర్‌ గౌస్‌ ఆలం పీఎంజే జ్యువెలరీ షాప్‌నకు చేరుకుని సిబ్బందితో మాట్లాడి వారి వాంగ్మూలాలను రికార్డు చేశారు. దోపిడీకి పాల్పడ్డ ఐదుగురి వద్దా ఐదు ఆయుధాలు ఉన్నాయని ఆయన తెలిపారు. వారిలో ఒకడు ముఖానికి మాస్కు ధరించగా..మిగతా నలుగురూ మాస్కులు ధరించలేదని చెప్పారు. అలాగే, నిందితుల్లో ఒకడు తెలుగులో మాట్లాడాడని.. మిగతావారు హిందీలో మాట్లాడారని వెల్లడించారు. నగల దుకాణం దోపిడీ సంగతి తెలియగానే కేంద్ర మంత్రి బండి సంజయ్‌, ఎమ్మెల్యేలు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా.. పారిపోయే క్రమంలో దొంగలు నగల దుకాణంలోని ఒక ఉద్యోగి సెల్‌ఫోన్‌ను ఎత్తుకుపోయారు. దాన్ని వారు శాతవాహన విశ్వవిద్యాలయం వద్ద పారేసినట్లు తెలిసింది. దోపిడీ దొంగలు కాల్పులు జరిపిన సమయంలో దుకాణంలో 10 మంది దాకా ఉద్యోగులున్నారు. నలుగురికి తూటాగాయాలు కావడంతో రక్తం చింది.. షోరూంలో ఫ్లోర్‌ నుంచి మెట్లు, బయట వరకు రక్తపుమరకలు కనిపించాయి. వారు కాల్పులు ప్రారంభించగానే.. సిబ్బందిలో ఒక మహిళ బాత్‌రూంలోకి వెళ్లి తలుపులు పెట్టుకుని అరగంటపాటు అందులోనేఉండిపోయారు. నగల దుకాణం ఎదుట కోర్టు ప్రహరీ గోడను ఆనుకుని ఉన్న కాలువ వద్ద ఖాళీ తూటాల మాగజైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది దుండగులదేనని పోలీసులు చెబుతున్నారు.

నిలకడగా సిబ్బంది ఆరోగ్యం

దోపిడీకి పాల్పడుతున్న దుండగులతో తలపడిన జ్యువెలరీ షాపు మేనేజర్‌ ముస్తాక్‌అలీకి తల పై భాగంలో తూటా గాయం అయ్యింది. అయితే, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఇక పెద్దపల్లి జిల్లా ధర్మారానికి చెందిన బూర్ల మధుకర్‌ ఆ దుకాణంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి కడుపులో తూటా గాయం అయ్యింది. కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం ర్యాలపల్లికి చెందిన కమల్‌హాసన్‌కు పక్కటెముకల్లో గాయమైంది. పెద్దపల్లి జిల్లా జూలపల్లికి చెందిన రాజే్‌షకు కుడి చేతికి గాయమైంది.

2.jpg1.jpg


అంతర్రాష్ట్ర ముఠా పనేనా?

పీఎంజే జ్యువెలరీ షాపులో లూటీ.. అంతర్రాష్ట్ర ముఠా పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగుల్ల్లో ఒక్కరే తెలుగులో మాట్లాడడంతో.. మిగతావారు మహారాష్ట్ర నుంచి వచ్చిఉంటారని భావిస్తున్నారు. పూర్తిస్థాయిలో రెక్కీ నిర్వహించిన అనంతరం పక్కా ప్రణాళికతో ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆదివారం కావడంతో షాపులో రద్దీ తక్కువగా ఉండడం.. ఆ దుకాణం జగిత్యాల రోడ్‌కు ఆనుకుని ఉండటం.. ఇలా అన్నింటినీ బేరీజు వేసుకునే దోపిడికి పాల్పడి ఉంటారని భావిస్త్తున్నారు. కాగా.. ఈ లూటీకి పాల్పడిన దుండగులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసు కమిషనర్‌ గౌస్‌ ఆలం తెలిపారు. వారి కోసం కరీంనగర్‌లో హోట ళ్లు, లాడ్జీలు.. అన్నింటినీ తనిఖీ చేస్తున్నామని, ఇటీవల జైలు నుంచి విడుదలైన నిందితుల వివరాలను కూడా సేకరిస్తున్నామని తెలిపారు. ఇక.. ఈ దోపిడీకి పాల్పడినవారిని పోలీసులు పట్టుకుంటారనే నమ్మకం ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. లూటీ గురించి తెలియగానే షాపు వద్దకు వెళ్లిన ఆయన.. సిబ్బందిని పరామర్శించారు. గాయపడ్డవారిని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తామన్నారు.

పట్టిస్తే రూ.లక్ష బహుమతి

పీఎంజే నగల దుకాణంలో దోపిడీకి పాల్పడిన ఐదుగురు నిందితుల ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. వారు ఎక్కడ కనిపించినా వెంటనే సమీప పోలీస్‌ స్టేషన్‌కు లేదా డయల్‌ 100, 8712670744, 8712670745 నంబర్లకు ఫోన్‌ చేసి సమాచారం అందించాలని కోరారు. వారి జాడ తెలిపినవారికి రూ.లక్ష బహుమతిని అందిస్తామని ప్రకటించారు. ఈ మేరకు కరపత్రాలు, వాల్‌పోస్టర్లను రూపొందించి.. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. కాగా.. ఈ దోపిడీకి పాల్పడినవారిని పోలీసులు పట్టుకుంటారనే నమ్మకం ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. దోపిడీ జరగడానికి కొన్ని నిమిషాల ముందు తాను ఆ ప్రాంతంలోనే పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నానని, తన వెంట పోలీసులు ఉన్నారని ఆయన తెలిపారు. దోపిడీ గురించి తెలియగానే షాపు వద్దకు వెళ్లిన ఆయన.. సిబ్బందిని పరామర్శించారు. గాయపడ్డవారిని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తామన్నారు.

3.jpg

Updated Date - May 04 , 2026 | 04:14 AM