ముగిసిన ఉపసంహరణ
ABN , Publish Date - Feb 04 , 2026 | 02:04 AM
మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. బరిలో అభ్యర్థుల జాబితాను, వారి గుర్తులను ప్రకటించారు.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. బరిలో అభ్యర్థుల జాబితాను, వారి గుర్తులను ప్రకటించారు. ఇప్పటికే వివిధ పార్టీలు ప్రచారాన్ని ప్రారంభించాయి. బుధవారం నుంచి ప్ర చారం ముమ్మరం కానున్నది. చివరి క్షణం వరకు అభ్యర్థుల జాబితాను ప్రకటించకుండా, బీ-ఫా రాలను చేతికి ఇవ్వకుం డా రాజకీయ పక్షాలు జా గ్రత్త వహించడంతో అభ్యర్థులు గందరగోళం లో పడ్డారు. ఆశించిన వారికి టికెట్లు రాకపో వడం అన్ని పార్టీల్లోనూ అసంతృప్తిని రేకెత్తించింది.
కరీంనగర్ కార్పొరేషనలో 66వ డివిజన్లలో 698 మంది 1,257 నామినేషన్లు వేశారు. ఉపసంహరణ అనంతరం 398 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. 300 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. బీజేపీకి చెందిన 126, బీఎస్పీ 2, కాంగ్రెస్ 84, ఎంఐ ఎం 9, బీఆర్‌ఎస్ 48, ఏఐఎఫ్‌బీ 2, సీపీఐ 1, జనసేన 2, ఇతరపార్టీలకు చెందిన ఒకరు, స్వతంత్ర అభ్యర్థులు 25 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.
చొప్పదండి మున్సిపాలిటీలో 14వార్డులకుగాను 64 మంది పోటీలో ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీల నుంచి 14 మంది చొప్పున, జనసేన పార్టీకి చెందిన ఇద్దరు, బీఎస్పీకి చెందిన ఒకరు, మరో 16 మంది ఇండిపెండెంట్లు ఉన్నారు.
జమ్మికుంట మున్సిపాలిటీలో 30 వార్డులకు గాను 159 మంది పోటీలో మిగిలారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ అన్ని వార్డులకు అభ్యర్థులను పో టీలో దింపాయి. ఒక్కో పార్టీ నుంచి 30 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు 13, జనసేన అభ్యర్థులు 12 మంది, బీఎస్పీకి చెందిన నలుగురు, సీపీఎంకు చెందిన ఒకరు, ఇతర గుర్తింపు పొందిన పార్టీల నుంచి ఇద్దరు, 37 మంది ఇండి పెండెంట్లు బరిలో ఉన్నారు.
హుజూరాబాద్ మున్సిపాలిటీలో ఉపసంహరణ అనంతరం 143 మంది పోటీలో ఉన్నారు. వీరిలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీకి చెందిన అభ్యర్థుల్లో అన్ని వార్డుల్లో పోటీలో ఉన్నారు. 30 వార్డులకుగాను ఆయా పార్టీలు 30 మంది చొప్పున అభ్యర్థులను బరిలో దింపాయి. ఫార్వర్డ్‌బ్లాక్ పార్టీకి చెందిన ఏడుగురు, జనసేనకు చెందిన ఇద్దరు, బీఎస్పీకి చెందిన ఇద్దరు, ఇతర గుర్తింపు పొందిన పార్టీలకు చెందిన ముగ్గురు, ఇండిపెండెంట్లు 39 మంది పోటీలో ఉన్నారు.
భగ్గుమన్న అసంతృప్తి.. దిష్టిబొమ్మల దహనం
టికెట్ల కేటాయింపులో తమకు అన్యాయం చేశా రంటూ పలువురు ఆశావహులు అసం తృప్తి వ్యక్తం చేస్తూ పార్టీ నేతలపై నిప్పులు చెరిగారు. కార్పొ రేషనలోని వివిధ డివిజన్లలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల టికెట్లను ఆశిస్తూ ఒక్కో డివిజనలో ముగ్గురు, నలుగురు అభ్యర్థులు నామినేషన్లను దా ఖలు చేశారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల గడువు ఉండగా చివరి నిమిషం వరకు ఆయా పార్టీలు బీ-ఫారాలను అభ్య ర్థులకు ఇవ్వకుండా నేరుగా మున్సిపల్ కార్యాల యానికి చేరు కొని ఎన్నికల రిటర్నింగ్ అధికా రులకు అందజేశారు. ఆయా పార్టీ అభ్య ర్థులుగా పోటీ చేసేందుకు నామినేషన వేసిన వారంతా ఆందోళనకు గురయ్యారు. బీ-ఫారాలు అందని అభ్యర్థులు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పార్టీ టికెట్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని రెండు, మూడు డివిజన్లలో బీఆర్‌ఎస్ టికెట్‌ను ఆశించిన దాసరి సాగర్ , దాసరి ప్రభాకర్, సునిత వారి మద్దతుదారులతో కలిసి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసం ఎదుట ధర్నా చేశారు. 20 ఏళ్లుగా గంగుల కమలాకర్‌తో ఉంటున్నామని, తమకు చివరి వరకు టికెట్ ఇస్తా మని చెప్పి డబ్బులకు వేరొకరి అమ్ముకున్నారని విమర్శించారు. రెండో డివిజనలో టికెట్ ఇచ్చిన అభ్యర్థి స్థానికేతరుడని, డివిజనలో ఎవ రికీ తెలియదని, అలాంటి వారికి టికెట్లు ఇచ్చి మోసం చేశారన్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇంట్లోకి చెప్పులు, పార్టీ జెండాలను విసరారు. మట్టిపోస్తూ శాపనార్థాలతో దూషించారు. అనంతరం ఇంటి ఎదుట పార్టీ జెండాలు, కండువాలు, కరప త్రాలను తగలబెట్టారు.
వివిధ డివిజన్లలో కాంగ్రెస్ టికెట్లను ఆశించిన ఖమ్రొద్దీన, కుర్ర పోచయ్య, షబానా టికెట్లు అమ్ము కున్నారని ఆరోపిస్తూ బీ-ఫారం అందజేసేందుకు మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన కాంగ్రెస్ కార్పొరేషన అధ్యక్షుడు వైద్యుల అంజనకుమార్‌ను తీవ్ర పదజా లంతో దూషించారు. మెండి శ్రీలత చంద్రశేఖర్‌కు టికెట్ ఇవ్వక పోవడాన్ని నిరసిస్తూ మాల మహానాడు రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గంటల రేణుక ఆధ్వర్యంలో మహిళలు కోర్టు చౌరస్తాలో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇనచార్జి వెలిచాల రాజేందర్‌రావు దిష్టిబొమ్మను దహనం చేశారు. రాజేందర్‌రావు వారికి టికెట్ ఇవ్వకుండా అడ్డుకోవడమే కాకుండా మహిళ అని చూడకుండా అమర్యాదగా మాట్లాడారని, దీనిపై పోలీసులు కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. టికెట్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మాజీ కార్పొరేటర్లు మెండి శ్రీలత, చంద్రశేఖర్ ప్రకటించారు. చొప్పదండి మున్సిపాలిటీలోని కల్లెపల్లి కోమలతకు బీ-ఫామ్ ఇస్తానని చెప్పి మోసం చేశారని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్వగ్రామమైన బూరుగుపల్లిలోని ఆయన ఇంటి ఎదుట పురుగుల మందు డబ్బాతో ఆందోళన చేశారు.
కాంగ్రెస్‌లో గందరగోళం... ఒకే డివిజనలో ఇద్దరికి బీ-ఫారాలు
కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక నుంచి బీ-ఫారాల అందజేత వరకు తీవ్ర గందరగోళం నెలకొన్నది. సమన్వయంతో పనిచేసి కార్పొరేషన ను కైవసం చేసుకోవాలని టీపీసీసీ ఆదేశిస్తూ జిల్లా ఇనచార్జిగా మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుకు బాధ్యతలను అప్పగించింది. ఆరెపల్లి మోహన సమన్వయకర్తగా సుడా చైర్మన కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి వెలిచాల రాజేందర్‌రావు, అర్బన కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజనకుమార్, అల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి సభ్యులుగా రూపొందించిన స్ర్కీనింగ్ కమిటీ సభ్యులతో రెండుసార్లు చర్చించిన అనంతరం అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. అసెంబ్లీ నియోజకవర్గ ఇనచార్జి వెలిచాల రాజేందర్‌రావు, కార్పొరేషన అధ్యక్షుడు వి అంజనకుమార్‌కు బీ-ఫారాల అందజేత, రెబల్స్ లేకుండా చేసే బాధ్యతలను అప్పగించారు. కార్పొరేషన పరిధిలోని 50వ డివిజన అభ్యర్థిగా కొత్త అనిల్ పేరును మంగళవారం రాత్రి ప్రకటించారు. నామినేషన్ల గడువు ముగిసే సమయానికి 50వ డివిజన అభ్యర్థిగా రాచకొండ చక్రధర్‌రావు పేరిట అంజనకుమార్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి బీ-ఫారం అందజేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికి కొత్త అనిల్‌కుమార్ పేరిట మరో బీ-ఫారంను వెలిచాల రాజేందర్‌రావు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేయడంతో గందరగోళం నెలకొన్నది. ఎన్నికల నిబంధనల మేరకు ముందుగా నామినేషనను దాఖలుచేసిన వారి అభ్యర్థిత్వాన్నే ఖరారు చేయాల్సి ఉండగా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇద్దరి బీ-ఫారాలను పరిశీలనకు పంపించారు. వారిలో ఎవరు అభ్యర్థి అనేది ఇంకా అధికారులు ప్రకటించలేదు.
కరీంనగర్ బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలు
ఆప్ 1, బీజేపీ 66, బీఎస్పీ 7, కాంగ్రెస్ 65, సీపీఐ 1, ఎంఐఎం 15, బీఆర్‌ఎస్ 66, ఏఐఎఫ్‌బీ 31, జనసేన 14, ఇతర గుర్తింపు పొందిన పార్టీలు 9, స్వతంత్రులు 123, మొత్తం 398 మంది అభ్యర్థులు కరీంనగర్‌లో పోటీలో ఉన్నారు.
- అత్యల్పంగా 4, 47, 49 డివిజన్లలో ముగ్గురు చొప్పున అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
- అత్యధికంగా 43వ డివిజనలో 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
- 13, 27, 39 డివిజన్లలో 11 మంది చొప్పున అభ్యర్థులు పోటీ పడుతున్నారు.