కవల చిన్నారుల హత్య కేసు.. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్..
ABN , Publish Date - Apr 06 , 2026 | 12:48 PM
కరీంనగర్ కవల చిన్నారుల హత్య కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రధాన నిందితుడు శ్రీశైలంకు సహకరించిన అతడి తల్లిదండ్రులు, సోదరుడిని అరెస్ట్ చేశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 6: కరీంనగర్ కవల చిన్నారుల హత్య కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. కరీంనగర్ రూరల్ పోలీసులు తాజాగా చిన్నారుల హత్యతో సంబంధం ఉన్న మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు శ్రీశైలంకు సహకరించిన అతడి తల్లిదండ్రులు, సోదరుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు చిన్నారులను బావిలో తోసేముందు వారికి గడ్డి మందు తాగించాడా లేదా అన్నది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చాక తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు. ఆడపిల్లల పట్ల వివక్షపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు.
కేసు వివరాలు ఇవి..
పోలీసులు, చిన్నారుల తల్లి తెలిపిన వివరాల మేరకు.. జూబ్లీనగర్‌కు చెందిన కచ్చు శ్రీశైలం, మౌనిక భార్యాభర్తలు. నాలుగేళ్ల క్రితం ఈ దంపతులకు కవల ఆడపిల్లలు పుట్టారు. ఆడపిల్లలు పుట్టినప్పటినుంచి మౌనికకు వేధింపులు మొదలయ్యాయి. ఆడపిల్లలను ఎందుకు కన్నావంటూ భర్త శ్రీశైలంతో పాటు అత్తామామలు లావణ్య, అశోక్.. మరిది రాకేష్‌లు నరకం చూపించేవారు. అంతేకాదు.. కవల పిల్లలను కూడా శ్రీశైలం హింసించే వాడు. తండ్రి ఇంటికి వస్తే.. కవలలు భయంతో దాక్కునే వారు. ఆడపిల్లలు ఇష్టం లేని శ్రీశైలం తల్లిదండ్రుల సాయంతో వారిని చంపడానికి నిశ్చయించుకున్నాడు.
ఈ నెల 3వ తేదీన చిన్నారులను పొలం దగ్గరకు తీసుకెళ్లాడు. అక్కడ ఉన్న బావిలో ఇద్దరినీ తోసేశాడు. ఓ చిన్నారి నీట మునిగిపోయింది. మరో చిన్నారి ఈదుకుంటూ బయటకు రావడానికి ప్రయత్నించింది. ఇది గమనించిన శ్రీశైలం నీటిలోకి దూకాడు. చిన్నారిని అతి దారుణంగా నీటిలో ముంచి చంపేశాడు. చనిపోయిన కూతుర్ని రక్షిస్తున్నట్టుగా నాటకమాడాడు. అయితే, భార్య ఇచ్చిన ఫిర్యాదుతో అసలు విషయం బయటపడింది.
ఇవి కూడా చదవండి
బిగ్ అలర్ట్.. ఏపీలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు..
నన్ను వాళ్లు మాత్రం గుర్తించక పోవచ్చు: షమీ