రాష్ట్రం వచ్చి 12 ఏళ్లయినా పురోగతిలేదు
ABN, Publish Date - Apr 15 , 2026 | 04:29 AM
సోషలిజం వర్థిల్లాలన్న అంబేడ్కర్ ఆకాంక్ష దురదృష్టవశాత్తు తెలంగాణలో అమలు కావడంలేదని, ప్రత్యేక రాష్ట్రం వచ్చి 12 ఏళ్లు గడిచినా ఎటువంటి పురోగతి సాధించలేదని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.
అంబేడ్కర్ ఆకాంక్ష అమలు కావడం లేదు
ఆర్టికల్ 3 వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది
ఈ భూమిపై అంబేడ్కర్ వ్యతిరేకి రేవంత్‌రెడ్డి
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): సోషలిజం వర్థిల్లాలన్న అంబేడ్కర్ ఆకాంక్ష దురదృష్టవశాత్తు తెలంగాణలో అమలు కావడంలేదని, ప్రత్యేక రాష్ట్రం వచ్చి 12 ఏళ్లు గడిచినా ఎటువంటి పురోగతి సాధించలేదని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ది యునైటెడ్ ఫోరం ఫర్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన జయంతి వేడుకల్లో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటికీ దళితులు, మహిళలపై ఆకృత్యాలు పెరిగిపోవటం ఆందోళన కలిగిస్తోందని, రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ కట్టినా దళితులకు చెందిన అసైన్డ్ భూములనే ప్రభుత్వాలు లాక్కుంటున్నాయని ఆమె విమర్శించారు. బాబాసాహెబ్ అంటేనే ధైర్యమని, ఆయన ఇచ్చిన ధైర్యంతో పేదల పక్షాన ప్రభుత్వంపై పోరాటం చేస్తామని చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అంబేడ్కర్ భిక్ష అని, రాజ్యాంగంలో ఆర్టికల్ 3 వల్లే ఈ రాష్ట్రం ఏర్పాటు సాధ్యమయిందని పేర్కొన్నారు. ఈ భూమ్మీద అంబేద్కర్ వ్యతిరేకి ఎవరైనా ఉన్నారంటే.. అది సీఎం రేవంత్‌రెడ్డి మాత్రమేనన్నారు. బాబాసాహెబ్ జయంతి సందర్భంగానైనా ఈ ముఖ్యమంత్రికి బుద్ధి వచ్చి పేదలకు న్యాయంచేేస పరిస్థితి రావాలని ఆకాంక్షించారు. నల్లమలలోని సహజ సంపదను కొల్లగొట్టేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చెంచులను బలిచేస్తున్నాయని కవిత ఆరోపించారు. నాగర్‌కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలం కడిచింతల, సార్లపల్లి చెంచుపెంటల్లో 200కుపైగా చెంచు కుటుంబాలను బలవంతంగా తరలించేందుకు ఒత్తిడి చేస్తున్నారన్నారు. చెంచులను అడవికి దూరంచేేస ప్రయత్నాలు మానుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గాకు కవిత చాదర్ పంపారు. తెలంగాణలో రాజకీయ శక్తిగా జాగృతి ఆవిర్భవించబోతున్న నేపథ్యంలో ఖ్వాజా గరీబ్ నవాజ్ ఆశీస్సులు తీసుకోవడానికి చాదర్ పంపుతున్నామన్నారు.
Updated at - Apr 15 , 2026 | 04:29 AM