Share News

‘కాళేశ్వరం’తో కొల్లగొట్టారు

ABN , Publish Date - Jun 29 , 2026 | 04:59 AM

రాష్ట్రంలో గత (కేసీఆర్‌) సర్కారు కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుందని.. మేడిగడ్డ పేరుతో ప్రజల సొమ్ము నీళ్లపాలు చేసిందని..

‘కాళేశ్వరం’తో కొల్లగొట్టారు

  • గత సర్కారు దాన్ని ఏటీఎంలా వాడుకుంది

  • ప్రస్తుత సర్కారు కప్పిపుచ్చే యత్నం చేస్తోంది

  • అవినీతిపరుల నల్లముఖాల్ని బయటకు తెస్తాం

  • రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ

  • బీజేపీ బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌

  • ప్రధాని మోదీ పాలనపై రెండు గ్రంథాల ఆవిష్కరణ

  • శంషాబాద్‌ ఊట్‌పల్లిలో పార్టీ ఆఫీసు ప్రారంభం

  • 3 కార్పొరేషన్లలో కాషాయ జెండా ఎగురుతుంది

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

  • రాష్ట్రంలోనూ బెంగాల్‌ ఫలితాలు: ఈటల రాజేందర్‌

హైదరాబాద్‌, రంగారెడ్డి అర్బన్‌, జూన్‌ 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గత (కేసీఆర్‌) సర్కారు కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుందని.. మేడిగడ్డ పేరుతో ప్రజల సొమ్ము నీళ్లపాలు చేసిందని.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ ఆరోపించారు. ప్రజల కష్టార్జితాన్ని భారీగా దుర్వినియోగం చేసిందని దుయ్యబట్టారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా కాళేశ్వరం అవినీతిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. అవినీతిపరుల నల్ల ముఖాన్ని తాము బయటికి తెస్తామని.. కాళేశ్వరం దోషులకు శిక్ష పడేంతవరకూ తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన నితిన్‌ నబీన్‌.. ఆదివారం ఎగ్జిబిషన్‌ మైదానంలో నిర్వహించిన బీజేపీ బూత్‌ స్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రజల మద్దతుతో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదుగుతోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపీని గెలిపించేందుకు సిద్ధమవుతున్నారని ధీమా వ్యక్తం చేశారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతిని మొదటి నుంచి చివరి వరకు ఎదిరించి పోరాడింది భారతీయ జనతా పార్టీయేనని.. కానీ కొన్ని పొరపాట్ల వలన ప్రజలు కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. రాష్ట్ర యువతను మోసం చేసిందని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ చేసిన ఈ మోసాన్ని.. బీజేపీ యువ కార్యకర్తలు ప్రజలకు బలంగా వివరించాలన్నారు. రాష్ట్రంలో ప్రతి బీజేపీ కార్యకర్తా 2028 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా సన్నద్ధం కావాలని నితిన్‌ నబీన్‌ పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికీ వెళ్లాలని.. ప్రతి కుటుంబాన్నీ చేరుకోవాలని.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పార్టీ విధానాలను వివరించాలని సూచించారు. అలాగే.. ప్రతి ఓటరునూ సంప్రదించాలని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరూ ఓటరు జాబితాలో నమోదయ్యేలా కృషి చేయాలని చెప్పారు. కేంద్ర పథకాల లబ్థిదారులందరినీ కలుసుకుని వారి సమస్యలు తెలుసుకోవాలన్నారు. సమాజంలోని ప్రతి వర్గంతో అనుబంధం పెంచుకోవాలని.. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని సూచించారు. ‘‘త్వరలో జీహెచ్‌ఎంసీతో పాటు ఇతర స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. భాగ్యనగరాన్ని సరైన దిశలో నడిపించగలిగేది, ప్రజల ఆశలను నెరవేర్చగలిగేది బీజేపీ మాత్రమే. భాగ్యనగర భవిష్యత్తును మార్చాలంటే మనం ప్రజల మధ్యకు మరింత బలంగా వెళ్లాలి’’ అన్నారు. రాబోయే ఎన్నికల్లో కమలం గుర్తుతో పోటీ చేసే ప్రతి అభ్యర్థినీ గెలిపించాలన్నారు.

5.jpg


అక్కడిలాగానే ఇక్కడా..

రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్‌ మండలం ఊట్‌పల్లిలో బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన నితిన్‌ నబీన్‌.. పశ్చిమబెంగాల్‌ తరహాలోనే ఈసారి తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా వర్చువల్‌ విధానంలో తొమ్మిది జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను ఆయన ప్రారంభించారు. బీజేపీ ఆవిర్భావ సమయంలో దేశవ్యాప్తంగా గెలుచుకున్న రెండు సీట్లలో ఒకటి తెలంగాణ నుంచి ఉండటం ఎంతో గర్వకారణమన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో డబుల్‌ ఇంజిన్‌ సర్కారు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పలు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషిస్తున్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్‌ బన్సల్‌ తెలంగాణలోనూ వ్యూహాలు రచిస్తారని వెల్లడించారు. కాగా.. రాష్ట్ర బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌, సీనియర్‌ బీజేపీ నాయకుడు వకుళాభరణం కృష్ణ మోహన్‌ రావు రచించిన రెండు గ్రంథాలను నితిన్‌ నబీన్‌ ఆవిష్కరించారు. వాటిలో ఒకటి.. ‘‘శ్రీ నరేంద్ర మోదీ: భారత్‌ను విశ్వవేదికపై నిలిపిన మహానాయకుడు’’ అనే 600 పేజీల త్రిభాషా (తెలుగు-హిందీ-ఆంగ్లం) గ్రంథం కాగా.. మరొకటి ‘‘అంత్యోదయం నుంచి వికసిత భారత్‌’’ పేరుతో విడుదలైన 500 పేజీల గ్రంథం. విద్యార్థులు, పరిశోధకులు, ప్రజాప్రతినిధులు, విధాన రూపకర్తలు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు, సాధారణ పాఠకులకు ఇవి విలువైన ప్రామాణిక సమాచార గ్రంథాలుగా ఉపయోగపడతాయని నబీన్‌ కొనియాడారు. కాగా మోదీ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాల గురించి.. సమగ్ర సమాచారం, విశ్లేషణతో ప్రజలకు అందించాలనే లక్ష్యంతోనే ఈ గ్రంథాలను రచించినట్లు వకుళాభరణం కృష్ణ మోహన్‌ రావు తెలిపారు.

4.jpg


ఇది బీజేపీ అడ్డానే..

జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్‌, మల్కాజ్‌గిరి మున్సిపల్‌ కార్పొరేషన్లలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని.. బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు అన్నారు. ‘‘బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, మజ్లిస్‌ కలిసి వచ్చినా.. ఎవరు అడ్డుకున్నా హైదరాబాద్‌ మాత్రం బీజేపీ అడ్డానే. ఈ మూడు కార్పొరేషన్లలో కూడా కమలం వికసించడం ఖాయం. ఎందుకంటే ప్రజలు మార్పును కోరుకుంటున్నారు, ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపే చూస్తున్నారు’’ అని ధీమా వెలిబుచ్చారు. జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్‌, మల్కాజ్‌గిరి ప్రాంతాలను సీఎం రేవంత్‌ రియల్‌ ఎస్టేట్‌ అడ్డాలుగా మార్చేశారని దుయ్యబట్టారు. ‘సర్‌’ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీలు బీజేపీపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని రాంచందర్‌రావు ఆరోపించారు. ఇక.. తెలంగాణాపై కేంద్ర పార్టీ నాయకత్వం దృష్టి సారించిందని, అందులో భాగంగానే నితిన్‌ నబీన్‌ పర్యటకు వస్తున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ అన్నారు. మూడు కార్పొరేషన్లలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారరు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే.. ముస్లింలకు ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్‌ను రద్దు చేస్తుందన్నారు. కాగా.. వచ్చే ఎన్నికల్లో బెంగాల్‌ ఫలితాలు తెలంగాణాలోనూ పునరావృతం కావడం ఖాయమని ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. అహంకారానికి, దోపిడీకి బెంగాల్‌ ప్రజలు ఎలా చరమగీతం పాడారో రేపు తెలంగాణ ప్రజలు కూడా అలాంటి తీర్పే ఇవ్వబోతున్నారన్నారు. ‘‘హైడ్రా పేరుతో, మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లను కూలగొడుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఓటమి అంచున ఉంది. రేవంత్‌ సర్కార్‌ను చాలెంజ్‌ చేస్తున్నా.. బీఎల్వోగా పనిచేసేది మీ ప్రభుత్వ అధికారులే కదా? మరి బీజేపీ ఎలా ఓట్లు తొలగిస్తుంది? అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలి’’ అని ఈటల డిమాండ్‌ చేశారు. ‘సర్‌’ ద్వారా దొంగ ఓటుకు చరమగీతం పాడబోతున్నామని స్పష్టం చేశారు.

‘కేంద్ర మంత్రి డీకే అరుణ’

  • కిషన్‌ రెడ్డి వ్యాఖ్యలు వైరల్‌

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణను ‘కేంద్ర మంత్రి డీకే అరుణ’ అని సంబోధించారు. హైదరాబాద్‌, ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో ఆదివారం జరిగిన బీజేపీ పోలింగ్‌ బూత్‌ కార్యకర్తల సమ్మేళనంలో కిషన్‌రెడ్డి ఈ మాట అన్నారు. కిషన్‌ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌, ఎంపీ డీకే అరుణ ఒకేసారి వేదిక వద్దకు చేరుకున్నారు. వారిని ఆహ్వానించే క్రమంలో కేంద్ర మంత్రి సంజయ్‌ బదులు కేంద్ర మంత్రి డీకే అరుణ అని కిషన్‌రెడ్డి అన్నారు. అయితే, కేంద్రమంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో అరుణకు చోటు దక్కనుందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కిషన్‌రెడ్డి నోటి వెంట కేంద్ర మంత్రి డీకే అరుణ అనే మాట రావడం ఆ ప్రచారానికి మరింత ఆజ్యం పోసింది. కిషన్‌రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలయింది.


కల్మషం లేకుండా పనిచేయండి

  • నాలుగు కార్పొరేషన్ల ఎన్నికల్లో గెలుపే లక్ష్యం

  • రాష్ట్ర బీజేపీ ముఖ్యులకు నితిన్‌ నబిన్‌ పిలుపు

‘కల్మషం లేకుండా పనిచేయండి. మనసులో ఒకటి.. పైకి మరో అభిప్రాయంతో పనిచేయడం వల్ల ఫలితం ఉండదు. వ్యక్తి కాదు.. వ్యవస్థ (పార్టీ) ముఖ్యమనే భావనతో పనిచేస్తే ఫలితాలు కచ్చితంగా వస్తాయి’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ పార్టీ రాష్ట్ర ముఖ్యులనుద్దేశించి అన్నారు. ఆదివారం రాత్రి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ముఖ్యనేతలతో భేటీ అయిన ఆయన.. రాష్ట్ర పార్టీలో ఎవరేం చేస్తున్నారో తమ వద్ద రిపోర్టు ఉందన్నారు. ‘‘ఇలాగే ఉంటే పార్టీ ముందుకు వెళ్లదు.. ఇకనైనా మారండి. వ్యక్తి కన్నా పార్టీయే ముఖ్యమని గుర్తించండి.. మంచి వాతావరణం ఉన్నా వినియోగించుకోవడంలో విఫలమవుతున్నాం. అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకోండి.. కష్టపడి పనిచేయండి..ఐక్యంగా ముందుకు సాగండి..’ అని పిలుపునిచ్చారు. బెంగాల్‌లో నిర్బంధాన్ని తట్టుకుని అధికారంలోకి వచ్చామని.. అక్కడి కంటే మెరుగైన పరిస్థితులు పార్టీకి ఇక్కడ ఉన్నాయని.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే.. జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్‌, మల్కాజ్‌గిరి, వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌లలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ‘‘గతంలో జీహెచ్‌ఎంసీలో 150 డివిజన్లకుగాను 48 చోట్ల గెలిచాం. ఇప్పుడు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. అందువల్ల, బాధితులకు అండగా నిలబడితే వారు మనవైపు ఉంటారు’’ అని పేర్కొన్నారు. ‘‘పార్లమెంటు ఎన్నికల్లో 75శాతం పార్టీ ప్రభావం, 25శాతం వ్యక్తి ప్రభావం ఉంటాయి. ఎమ్మెల్యే ఎన్నికల్లో పార్టీ, వ్యక్తి ప్రభావం చెరిసగం ఉంటే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో 75శాతం వ్యక్తి ప్రభావం, 25శాతం పార్టీ ప్రభావం ఉంటాయి. అందరూ దీన్ని గుర్తించి అందుకు అనుగుణంగా పనిచేసుకుంటూ వెళ్లాలి’ అని సూచించారు. పోలింగ్‌ బూత్‌ అధ్యక్షులతో, శక్తి కేంద్రాల ఇన్‌చార్జులతో ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్‌ నాయకులు సంప్రదిస్తూ ఉండాలన్నారు. చిత్తశుద్ధితో పనిచేసేవారికి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని, ఆసక్తిలేని వారికి అవకాశాలు ఇవ్వకపోవడం మంచిదని పేర్కొన్నారు. మండల, నియోజకవర్గస్థాయిలో కష్టపడి పనిచేసేవారిని గుర్తించాలని సూచించారు. రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఉందని నితిన్‌ నబీన్‌ అభిప్రాయపడ్డారు. ‘‘పార్టీ కోసం ఇతర రాష్ట్రాలు, ఢిల్లీ నుంచి వచ్చే నాయకులు ఇక్కడ సమన్వయం చేయగలరు గానీ, ఓట్లు వేయించలేరు.. ఆ సత్తా స్థానిక పార్టీ నాయకులకే ఉంటుంది’’ అని వ్యాఖ్యానించారు. ‘‘అధికారంలోకి రావాలంటే పోలింగ్‌ బూత్‌ను కైవసం చేసుకోవడం లక్ష్యం కావాలి. అందుకు క్షేత్రస్థాయిలో స్థానిక సమస్యలపై ఎక్కడికక్కడ పోరాటాలు చేయాలి’’ అన్నారు. భేటీలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు, కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Updated Date - Jun 29 , 2026 | 04:59 AM