Share News

ప్రతిపక్షాలను తొక్కేస్తే.. ఉద్యమాలే శరణ్యం

ABN , Publish Date - Aug 11 , 2026 | 05:29 AM

ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలను వాటి పనిని అవి చేయనిస్తే.. ప్రజలు ఇలా రోడ్లెక్కి ఆందోళనలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడవని కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) జాతీయ మీడియా ప్రధాన...

ప్రతిపక్షాలను తొక్కేస్తే.. ఉద్యమాలే శరణ్యం

  • నీట్‌ లీక్‌పై సీజేపీ ఉద్యమం సక్సె్‌సకు భారీ ప్రజా మద్దతే కారణం

  • గత 12 ఏళ్లలో ప్రతిపక్షాలను కేంద్రం నిర్వీర్యం చేసింది

  • ప్రశ్నించడాన్ని నేరంగా చూస్తూ నిరంకుశంగా పాలించారు

  • ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’తో సీజేపీ మీడియా సమన్వయకర్త విజయ్‌రెడ్డి

  • మోదీ, అమిత్‌షాలకు భాగవత్‌ హితబోధ చేయాలని సూచన

  • ఝార్ఖండ్‌లో నిరుద్యోగుల నిరసనకు సీజేపీ బాసట

హైదరాబాద్‌, ఆగస్ట్‌ 10: ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలను వాటి పనిని అవి చేయనిస్తే.. ప్రజలు ఇలా రోడ్లెక్కి ఆందోళనలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడవని కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) జాతీయ మీడియా ప్రధాన సమన్వయకర్త, దక్షిణాది ఇన్‌ఛార్జ్‌ విజయ్‌రెడ్డి మల్లంగి అన్నారు. నీట్‌ పేపర్‌ లీక్‌కు వ్యతిరేకంగా సీజేపీ చేపట్టిన ఉద్యమానికి అంత భారీ స్పందన రావడం వెనుక.. కేంద్ర సర్కారు ప్రతిపక్షాలను అణచివేయడమేనని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’ టీవీ ఛానల్‌ చర్చలో పాల్గొన్న సందర్భంగా పలు అంశాలపై విజయ్‌రెడ్డి తన అభిప్రాయాలను పంచుకున్నారు. గడిచిన 12 ఏళ్లలో ప్రశ్నించడాన్ని, ప్రజా వ్యతిరేకతను కేంద్రంలోని బీజేపీ సర్కారు అణచివేసింది. ప్రతిపక్షం అన్నదే లేకుండా చేసింది. విపక్షం కనుమరుగై లేదా విపక్షం ప్రజల గళాన్ని వినిపించలేకపోతే.. అప్పుడు ప్రజల్లో ఆగ్రహం పెరిగిపోతుంది. నిన్నగాకమొన్న పశ్చిమబెంగాల్‌లో 20 మంది ఎంపీలను తీసుకెళ్లిపోయారు. మహారాష్ట్రలో ఏకంగా పార్టీలను కూల్చేశారు. ప్రభుత్వ ఏజెన్సీలను వాడుకుని ప్రతిపక్షాల్లేకుండా చేద్దామని చూస్తే.. ప్రజాస్వామ్యంలో ఏక్కడో ఒక చోట ఉద్యమం (ప్రజాగ్రహం పెల్లుబికుతుంది/నీట్‌పై సీజేపీ ఉద్యమానికి భారీ మద్దతు తోడవడం) మొదలవుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలను వాటి పనిని అవి చేయనివ్వాలి. విపక్షాలను సజావుగా ఉండనిస్తే ఈ విధంగా ప్రెజర్‌ పెరిగి ఉండదు.

విద్యార్థుల సమస్య పరిష్కరించే తీరిక లేదా?

40 రోజులుగా సీజేపీ ఉద్యమం కొనసాగిస్తూ, సోనమ్‌ వాంగ్‌చుక్‌ నిరాహారదీక్ష చేస్తున్నా.. ‘మీ ఆందోళన ఏమిటి?’ అని ప్రభుత్వం వినే ప్రయత్నం చేయలేదు. చర్చలకు పిలవలేదు. ఎంతసేపటికీ నిరసనకారులను భయపెట్టి, ఇబ్బంది పెట్టాలనే చూశారు. జాతి వ్యతిరేకులు, పాకిస్థానీ శక్తులు, సీఐఏ ఏజెంట్లు, జార్జ్‌ సోరోస్‌ అనుకూలురని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినంత మాత్రాన దేశద్రోహులు కారు. తమని ఎవరూ ప్రశ్నించకూడదన్న నిరంకుశ వైఖరితో, ఆత్మరక్షణ ధోరణితో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఉంది. మన ప్రభుత్వం మన మాట ఎందుకు వినడం లేదన్న ఆవేదనతోనే విద్యార్థులు రోడ్లెక్కారు. ప్రజల నుంచి భారీ మద్దతు రావడంతో ప్రభుత్వం దిగొచ్చింది. ఇకనైనా విద్యార్థులు, ప్రజా ఉద్యమాలు మొదలైన వెంటనే చర్చలకు పిలిచి, మాట్లాడేందుకు ప్రభుత్వం తరఫున ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి.


పేపర్‌లీక్‌ కాకుండా పరీక్ష నిర్వహించలేమా?

21 శతాబ్దంలో, కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో దూసుకుపోతున్న తరుణంలో.. పరీక్షలను లీక్‌ కాకుండా సమర్థవంతంగా ఎందుకు నిర్వహించలేకపోతున్నాం. ఏఐ, ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌తో పరీక్ష పత్రం లీక్‌ కాకుండా చూడలేరా?.. నీట్‌ను సైతం జేఈఈ మాదిరే ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామంటూ సుప్రీంకోర్టులో కేంద్రం అఫడవిట్‌ వేసింది. నిజానికి సీజేపీ కేంద్రానికి ఇచ్చిన ఐదు ప్రధాన డిమాండ్లలో ఆన్‌లైన్‌ ఆధారిత పరీక్షల నిర్వహణ కూడా ఒకటి. కానీ, ఇందుకోసం వసతులను పెద్ద ఎత్తున పెంచాల్సి వస్తుంది. బడ్జెట్‌లో ప్రస్తుతం విద్యా రంగానికి కేటాయింపులు 2.5 శాతమే. ఈ నిధులు ఉద్యోగుల వేతనాలు, పింఛనక్లే సరిపోవు. జీడీపీలో కనీసం 6 శాతం అన్నా కేటాయించాలి. రాష్ట్రాలు విద్యా రంగానికి 7 శాతం కేటాయిస్తున్నా.. అందులో 80-90 శాతం వేతనాలకే వెళుతున్నాయి. ఇక స్కూళ్లలో కంప్యూటర్లు, లైబ్రరీలు ఏర్పాటు చేయడానికి నిధులు ఏం సరిపోతాయి?

66-National-11-08.jpg

ప్రభుత్వరంగంలో విద్యావసతులు పెంచాలి

మనం ఎంతకాలం రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూనే ఉంటాం. ‘100 సీట్లలో నీకు ఇన్ని, నాకిన్ని’ అని అనుకునే బదులు.. 500కు ఎందుకు పెంచుకోకూడదు? నీట్‌ను 21 లక్షల మంది రాస్తే, 2 లక్షల మందికే సీటు దక్కేది. మిగిలిన 18 లక్షల మంది పరిస్థితి ఏంటి? ప్రభుత్వ రంగంలో విద్యాసంస్థలను ఏర్పాటు చేయడంలో విఫలమవ్వడమే ఈ సమస్యకు మూలం. ఐఐటీల మాదిరే.. తెలంగాణ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ఏపీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఎందుకు ఏర్పాటు చేసుకోకూడదు? పైవేటు విద్యా సంస్థలపై అంతలా ఆధారపడడం వల్లే.. ఫీజులను రీయింబర్స్‌మెంట్‌ చేయలేకపోతున్నారు? ఏళ్లతరబడి బకాయిలు కట్టలేకపోతున్నారు.

ఉద్యోగ కల్పన అవసరం..

హైడ్రా నియామకాలు 150 పోస్టులకు వేలాది మంది పోటీ పడడం చూశాం. అంతలా నిరుద్యోగులు ఉన్నారు. మన వ్యవస్థలో ప్రభుత్వ ఉద్యోగాలు 2 శాతంలోపే ఉన్నాయి. ప్రైవేటు ఉద్యోగాలను పెంచుకోవాలి. అందుకు పెట్టుబడులను ఆకర్షించాలి. ఆ దిశగా ప్రభుత్వాలు దృషిసారించాలి. పెట్టుబడులు ఎందుకు రావడం లేదన్న దానిపై చర్చ అవసరం.


మోదీ-షాకు భాగవత్‌ హితబోధ చేయాలి

ఆర్‌ఎ్‌సఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ జెన్‌జీ (యువతరం)తో మాట్లాడినట్టే.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాను సైతం కూర్చోబెట్టి హిత బోధ చేయాలి. బీజేపీ-ఆర్‌ఎ్‌సఎస్‌ భావజాలం ఒక్కటైతే.. భాగవత్‌ చెప్పింది నిజమేనని, కేంద్ర సర్కారు తన తప్పుని ఒప్పుకోవాలి.

6-National-11-08.jpg

ఝార్ఖండ్‌ నిరసనకు సీజేపీ మద్దతు

ఝార్ఖండ్‌ నిరుద్యోగుల ఉద్యమానికి కాక్రోచ్‌ జనతా పార్టీ బాసటగా నిలిచింది. సోమవారం రాంచిలో నిర్వహించిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో సీజేపీ ప్రతినిధుల బృందం పాల్గొంది. దీనిపై విజయ్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘నీట్‌ అయినా, జార్ఖండ్‌లో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్ష పేపర్ల లీక్‌ అయినా.. అది వ్యవస్థ వైఫల్యంగా పేర్కొన్నారు. బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టిన సంస్థకు, తిరిగి పరీక్ష నిర్వహించే అవకాశం కల్పించడం.. పోస్టులు అమ్ముకోవడంపై విద్యార్థులు ఆధారసహితంగా ఆరోపణలు చేస్తున్నారు. ముందు జరిగిన పరీక్షలను రద్దు చేసి, తిరిగి నిర్వహించాలని, సీబీఐ దర్యాప్తుతోపాటు, సంస్కరణలకు డిమాండ్‌ చేస్తున్నారు. కేంద్ర సర్కారు మాదిరిగా కాకుండా.. జార్ఖండ్‌ ప్రభుత్వం మొదట్లోనే స్పందించి మంత్రుల కమిటీని వేసి, నిరసనకారుల ప్రతినిధులతో చర్చలు జరిపింది. ఏకపక్షంగా కఠిన వైఖరికి పోతే, అంతకు పది రెట్లు ప్రజావ్యతిరేకత వస్తుందన్న భయం ప్రభుత్వంలో కనిపించింది. 95 శాతం అంశాలపై అంగీకారం కూడా తెలిపింది. కాకపోతే,. ముగిసిన నియామకాల విషయంలో న్యాయపరమైన అంశాల గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు. సీబీఐ దర్యాప్తునకు ఒప్పకోవడం లేదు. దీనిపై నిరసనకారులకు సీజేపీ సంపూర్ణ మద్దతు తెలుపుతోంది. అసెంబ్లీ ముట్టడి సందర్భంగా జార్ఖండ్‌ పోలీసులు నిరసనకారులపై లాఠీచార్జ్‌ చేసినప్పటికీ, ఢిల్లీ పోలీసుల మాదిరి క్రూరంగా వ్యవహరించలేదు’’అని చెప్పారు.

Updated Date - Aug 11 , 2026 | 05:29 AM