రైతులను దృష్టిలో పెట్టుకొని పనులు చేయండి
ABN , Publish Date - Oct 30 , 2026 | 05:54 AM
రైతులను దృష్టిలో పెట్టుకొని గంగకత్వ కాలువ పనులు పూర్తి చేయాలని, కాంట్రాక్టర్లను దృష్టిలో పెట్టుకుని పనులు చేయవద్దని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు.
37 కోట్లతో ఆధునీకరించనున్న గంగకత్వ కాలువ పనులపై ఇరిగేషన్ అధికారులకు జగ్గారెడ్డి సూచన
సదాశివపేట మండలంలో నిజాం కాలంనాటి గంగకత్వకు పూర్వ వైభవం వచ్చేలా పనులు పూర్తి చేయాలి
11 గ్రామాల్లోని రైతులకు ప్రయోజనం దక్కడమే లక్ష్యంగా ముందుకు వెళ్లండి: జగ్గారెడ్డి
సదాశివపేట, ఆక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): రైతులను దృష్టిలో పెట్టుకొని గంగకత్వ కాలువ పనులు పూర్తి చేయాలని, కాంట్రాక్టర్లను దృష్టిలో పెట్టుకుని పనులు చేయవద్దని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు. రూ.37 కోట్లతో గంగకత్వ కాలువ ఆధునీకరణ పనులు మొదలు పెట్టనున్న నేపథ్యంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులతో కలిసి సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని గంగకత్వ కాలువను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. రైతులకు మేలు చేయటమే లక్ష్యంగా పనులు చేపట్టాలని సూచించారు. ఈ పనులన్నీ పూర్తయితే 3,300 ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం దక్కుతుందని తెలిపారు. ఏడో నిజాం రాజు కాలంలో ఈ కాలువను నిర్మించారని, వందేళ్ల చరిత్ర ఉన్న కాలువ పునరుజ్జీవం కోసం ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువచ్చినట్లు తెలిపారు. కాలువ ఆధునీకరణ పనులు పూర్తయితే సాగునీటితోపాటు ఈ ప్రాంత ప్రజలకు తాగునీరు కూడా అందుతుందని చెప్పారు. ఆధునీకరణ పనుల్లో భాగంగా ఏడు కొత్త చెక్ డ్యామ్‌ల నిర్మాణం... 14 కిలోమీటర్ల మేర కొత్త లైనింగ్ ఏర్పాటు చేయనున్నట్టు జగ్గారెడ్డి వివరించారు. వచ్చే నెలలోనే పనులు ప్రారంభించి.. 2028 జూన్ నెలోగా పూర్తిచేసేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలిపారు. పనులు నాణ్యంగా సాగేలా నీటిపారుదల శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. తాను కూడా వారానికి ఒకసారి పనులను పరిశీలిస్తానని చెప్పారు.