Share News

మూడున్నరేళ్ల క్రితం రాహుల్‌గాంధీకి ఇచ్చిన మాటను నేటికీ నిలబెట్టుకుంటున్న

ABN , Publish Date - Jul 30 , 2026 | 07:59 AM

రాష్ట్రంలోని కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ, ప్రభుత్వ వ్యవహారాల గురించి బహిరంగంగా, మీడియాతో మాట్లాడబోనని మూడున్నరేళ్ల క్రితం రాహుల్‌గాంధీకి మాటిచ్చానని..

మూడున్నరేళ్ల క్రితం రాహుల్‌గాంధీకి ఇచ్చిన మాటను నేటికీ నిలబెట్టుకుంటున్న

  • రాహుల్‌కు మాటిచ్చినందునే మా పార్టీ, ప్రభుత్వ, రాజకీయ వ్యవహారాల గురించి ఓపెన్‌గా మాట్లాడట్లేదు

  • ఎవరిమీదనైనా కోపం ఉంటే ఢిల్లీకి వచ్చి తనతో చెప్పాలని రాహుల్‌ ఆరోజు అన్నారు

  • నేనేదైనా మాట్లాడాలనుకుంటే రాహుల్‌తో మాట్లాడాకే బయటకొచ్చి మాట్లాడతా

  • మనసులో ఒకటి, బయటకు మరొకటి మాట్లాడే వ్యక్తి జగ్గారెడ్డి కాదు

  • పీఏసీలో మాట్లాడే విషయాలు లీక్‌ అవుతున్నాయని భేటీకి పోవడమే మానేశా

  • ఒకవేళ వెళ్లి ఉంటే పార్టీలో జరుగుతున్న వ్యవహారాలను ఏఐసీసీ ఇన్‌చార్జి, సీఎం దృష్టికి తీసుకెళ్లేవాడిని

  • నాకో పొలిటికల్‌ డిజైన్‌ ఉంది.. అది నవంబరులో చెబుతా.. అప్పటికి క్లారిటీ వస్తుంది

  • టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి

సంగారెడ్డి (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ, ప్రభుత్వ వ్యవహారాల గురించి బహిరంగంగా, మీడియాతో మాట్లాడబోనని మూడున్నరేళ్ల క్రితం రాహుల్‌గాంధీకి మాటిచ్చానని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి వెల్లడించారు. తాను ఇప్పటికీ ఆ మాట నిలబెట్టుకుంటున్నానని వివరించారు. నియోజకవర్గ కాంగ్రెస్‌ బూత్‌లెవల్‌ ఏజెంట్లతో సర్‌ ప్రక్రియపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. మూడున్నరేళ్ల క్రితం ఢిల్లీలో ఓ మీటింగ్‌కు తెలంగాణ నుంచి 40మంది సీనియర్‌ నాయకులను ఆహ్వానించి రాహుల్‌ మాట్లాడారని గుర్తుచేశారు. తాను కూడా ఆ సమావేశంలో 15 నిమిషాలు మాట్లాడానని తెలిపారు. ఆ సందర్భంలో రాహుల్‌ తనను ప్రత్యేకంగా పిలిచి ఎవరి మీదనైనా కోపం ఉంటే ముందు ఢిల్లీకి వచ్చి తనతో మాట్లాడాలని సూచించారని, ఆ మేరకు తాను ఆయనకు మాట ఇచ్చినట్లు చెప్పారు.

తాను ఏదైనా మాట్లాడాలనుకుంటే ఢిల్లీ ట్రైన్‌ ఎక్కి వెళ్లి, రాహుల్‌ గాంధీతో మాట్లాడిన తర్వాతనే బయటకొచ్చి మాట్లాడతానన్నారు. ఇటీవల పార్టీ పీఏసీ మీటింగ్‌లో అంతర్గతంగా తాను మాట్లాడిన విషయాలు బయటకు వచ్చాయని, అందుకే ఆ సమావేశానికి పోవడం కూడా మానేశానని చెప్పారు. ఒకవేళ వెళ్లిఉంటే అంతర్గత వ్యవహారాలను ఏఐసీసీ ఇన్‌చార్జి, సీఎం దృష్టికి తీసుకెళ్లేవాడినని పేర్కొన్నారు. తనకు రాజకీయంగా మనసులో కోరిక ఉందని, అది నవంబర్‌లో చెబుతానని, అప్పటివరకు క్లారిటీ వస్తుందని వివరించారు. తాను 24గంటలపాటు పబ్లిక్‌, పాలిటిక్స్‌ గురించే ఆలోచిస్తానని.. ఫ్యామిలీ గురించి కాదన్నారు.

Updated Date - Jul 30 , 2026 | 07:59 AM