సిట్ కస్టడీకి ఇన్‌స్పెక్టర్ నాగరాజు
ABN , Publish Date - Jul 03 , 2026 | 07:02 AM
విజయవాడలోని కృష్ణలంక రాజీవ్‌నగర్‌కు చెందిన రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ఇన్‌స్పెక్టర్ ఎస్‌ఎ్‌సవీవీ నాగరాజును శుక్రవారం నుంచి పదో తేదీ వరకు సిట్ కస్టడీకి ఇచ్చారు...
నేటి నుంచి 8 రోజుల పాటు విచారణ
విజయవాడ కోర్టు అనుమతి
రాజమహేంద్రవరం జైలులో విచారణ
ఇద్దరు న్యాయవాదులకు అనుమతి
విజయవాడ, జూలై 2 (ఆంధ్రజ్యోతి): విజయవాడలోని కృష్ణలంక రాజీవ్‌నగర్‌కు చెందిన రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ఇన్‌స్పెక్టర్ ఎస్‌ఎ్‌సవీవీ నాగరాజును శుక్రవారం నుంచి పదో తేదీ వరకు సిట్ కస్టడీకి ఇచ్చారు. విజయవాడ రెండో అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయాధికారి ఎస్.శ్రీకాంత్ ఈ మేరకు అనుమతి ఇచ్చారు. ఈ కేసులో నాగరాజును 12 రోజుల కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఆయన గురువారం తీర్పును వెలువరించారు. ఎనిమిది రోజుల పాటు సిట్ కస్టడీకి ఇచ్చారు. నాగరాజును రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారంలోనే విచారించాలని స్పష్టం చేశారు.
ఆయన తరఫున ఇద్దరు న్యాయవాదులకు అనుమతి ఇచ్చారు. విచారణ సమయంలో నిందితుడికి కనిపించేలా ఒక న్యాయవాది మాత్రమే ఉండాలని తీర్పులో పేర్కొన్నారు. విచారణ జరుగుతున్నప్పుడు న్యాయవాది ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోరాదని షరతు విధించారు. కోర్టు ఆదేశాల మేరకు విచారణను ఆడియో, వీడియో, సీసీ కెమెరాల రికార్డింగ్ చేయాలి. ఈ రికార్డింగ్‌ను సీల్డ్‌కవర్‌లో న్యాయస్థానంలో సమర్పించాలి. దీన్ని జైలు అధికారులు కోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు భద్రంగా ఉంచాలి. నాగరాజును విచారించేందుకు ఒక గదిని జైలు అధికారులు కేటాయించాలి. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే విచారణ చేయాలి. దర్యాప్తు అధికారులు, న్యాయవాదులు జైల్లోకి ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు వెళ్లారన్న వివరాలతో ఏరోజుకారోజు విచారణ పూర్తయిన తర్వాత నివేదికను జైలు సూపరింటెండెంట్ కోర్టుకు పంపాలి.
ఇవి కూడా చదవండి
టీ తాగడం మంచిదే.. కానీ ఈ 6 పొరపాట్లు చేస్తే సమస్యలు తప్పవు
కోళ్లు అరుస్తున్నాయని వెళ్లి చూస్తే.. మృత్యువు వెంటాడింది