ఐబొమ్మ రవికి షరతులతో కూడిన బెయిల్..
ABN , Publish Date - Feb 17 , 2026 | 05:23 PM
మూవీ పైరసీ కేసులో ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమంది రవికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రోజూ సీసీఎస్ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 17: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మూవీ పైరసీ కేసులో ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమంది రవికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రోజూ సీసీఎస్ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. కోర్టులో పాస్‌పోర్ట్ సరెండర్ చేయాలని, దేశం విడిచి వెళ్లొద్దని ఆంక్షలు విధించింది. రవి ఇంటర్‌నెట్ వినియోగంపై కోర్టు పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించింది. అతడు ఎలాంటి ఇంటర్‌నెట్ సౌకర్యాన్ని సొంతంగా వాడకూడదని, ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో వాడాల్సి వస్తే ముందుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది.
కాగా, రవి సినిమా పైరసీ, కాపీ రైట్, ఐటీ యాక్ట్‌తో పాటు మనీ లాండరింగ్ సహా.. మొత్తం ఐదు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అతడు రెండు రకాలుగా సినిమా ప్రింట్‌లను కొనుగోలు చేసేవాడు. నార్మల్ ప్రింట్‌కు 100 డాలర్లు, హెచ్‌డీ ప్రింట్‌కు 200 డాలర్లు చెల్లించేవాడు. అతడికి సంబంధించిన ఏడు ఖాతాలను పోలీసులు గుర్తించారు. వాటిలో రూ.13.40 కోట్ల నగదు ఉన్నట్లు కనుగొన్నారు. బెట్టింగ్ యాడ్‌ల ద్వారా రూ.1.78 కోట్లు కూడబెట్టినట్లు గుర్తించారు. ఇక ఐబొమ్మ రవి సోదరి చంద్రికకు రూ. 90 లక్షల నగదు పంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ నగదు లావాదేవీలన్నీ ఐబొమ్మ రవి డాలర్ల రూపంలోనే చేసినట్లు గుర్తించారు.
ఇవి కూడా చదవండి
బంగ్లాదేశ్ ప్రధానిగా తారిఖ్ రెహమాన్ ప్రమాణస్వీకారం
మీ వీసాలను లాగేసుకుంటాం.. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి వార్నింగ్