ఆర్మీ ఆయుధాల చోరీ వెనుక మరో ఇద్దరు!
ABN , Publish Date - Sep 30 , 2026 | 06:32 AM
ఆర్మీ ఆయుధాల దొంగతనం కేసులో మరో మలుపు. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఆర్మీ మాజీ హవల్దార్ మల్లే్‌షకు.. బెటాలియన్‌లోని ఇద్దరు ఇన్‌చార్జి స్థాయి అధికారులు సహకరించినట్లుగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
ప్రధాన నిందితుడు మల్లే్‌షతో ఆర్థిక లావాదేవీలు
వారిని ప్రశ్నిస్తున్న పోలీసులు..
అరెస్టు చేసే అవకాశం
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): ఆర్మీ ఆయుధాల దొంగతనం కేసులో మరో మలుపు. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఆర్మీ మాజీ హవల్దార్ మల్లే్‌షకు.. బెటాలియన్‌లోని ఇద్దరు ఇన్‌చార్జి స్థాయి అధికారులు సహకరించినట్లుగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. మల్లే్‌షను పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్న విషయం తెలిసిందే. దీంట్లో భాగంగా దొంగతనం ఎలా జరిగిందన్న దానిపై ‘సీన్ రీ కన్‌స్ట్రక్షన్’ జరిపి, ఇతర నిందితుల పాత్రను గుర్తించారు.
ఆయుధాలు నిల్వ ఉంచే కేంద్రం(కోటె) ఇన్‌చార్జితో పాటు, మరో ఇన్‌చార్జి మల్లే్‌షకు సహకరించినట్లుగా ప్రాథమికంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. సదరు ఇన్‌చార్జిలకు మల్లే్‌షకు మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయని, వాటిపై లోతుగా విచారించిన పోలీసులు.. ఆయుధాల చోరీకి, ఈ లావాదేవీలకు మధ్య సంబంధం ఉందని అనుమానిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితునికి సహకరించినట్లు పూర్తి ఆధారాలు లభ్యమైతే వారినీ అరెస్టు చేసే అవకాశం ఉంది.