రైలు ఢీకొని దాదాపు 200 గొర్రెల మృతి
ABN , Publish Date - Sep 30 , 2026 | 06:02 AM
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్-ఘట్కేసర్ రైల్వేస్టేషన్ల మధ్య జరిగిన రైలు ప్రమాదంలో సుమారు 200 గొర్రెలు మృత్యువాతపడ్డాయి.
గొర్రెల కాపరికి 40 లక్షల వరకు నష్టం
కుక్కల దాడితో బెదిరిపోయి పట్టాలపైకి
బీబీనగర్-ఘట్కేసర్ స్టేషన్ల మధ్య ఘటన
మెదక్‌లో 46 గొర్రెల మృత్యువాత
బీబీనగర్/ఘట్‌కేసర్ రూరల్/సికింద్రాబాద్ రైల్వే స్టేషన్/రామాయంపేట, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్-ఘట్కేసర్ రైల్వేస్టేషన్ల మధ్య జరిగిన రైలు ప్రమాదంలో సుమారు 200 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. భూదాన్‌పోచంపల్లి మండలం జూలూరు అలీనగర్ గ్రామానికి చెందిన గొర్రెల కాపరి బాలగోని కిష్టయ్య మరికొందరితో కలిసి 800కు పైగా గొర్రెలను సోమవారం మేత కోసం బీబీనగర్ పరిసర ప్రాంతాలకు తీసుకెళ్లారు.
మంగళవారం తెల్లవారుజాము సమయంలో కుక్కలు, అడవి పందులు మందపై దాడి చేశాయి. దాంతో బెదిరిపోయిన గొర్రెలు చెల్లాచెదురుగా పరుగులు తీస్తూ కొండమడుగు మెట్టు రైల్వే గేటు సమీపంలోని రైల్వే ట్రాక్‌పైకి చేరుకున్నాయి. అదే సమయంలో ఢిల్లీ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్తున్న దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ వాటిని ఢీకొట్టింది. ఈ ఘటనలో దాదాపు 200 జీవాలు మృత్యువాతపడ్డాయి. వాటి విలువ సుమారు రూ.40 లక్షల వరకు ఉంటుందని బాధితుడు కన్నీరు పెట్టాడు. ఘటనపై చర్లపల్లి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మెదక్‌లో 46గొర్రెల మృత్యువాత
మెదక్ జిల్లాలో మంగళవారం రాత్రి జరిగిన మరో రైలు ప్రమాదంలో 46గొర్రెలు మృతిచెందాయి. లక్ష్మాపూర్- తొనిగండ్ల గ్రామాల మధ్య తొనిగండ్లకు చెందిన కోకట్ల రెడ్డయ్య గొర్రెల మంద రైలు పట్టాల పైకి వెళ్లింది. అదే సమయంలో మెదక్ నుంచి కాచిగూడ వైపు వెళ్తున్న రైలు వాటిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 46 జీవాలు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 20 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు.