సచివాలయంలో సీఎం భద్రత డొల్ల!
ABN , Publish Date - Aug 26 , 2026 | 05:54 AM
రాష్ట్ర సచివాలయంలో సీఎం భద్రత విషయంలో డొల్లతనం కనబడుతోందా అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. సోమవారం సచివాలయం గ్రౌండ్‌ఫ్లోర్‌లోని 29వ నంబరు గదిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశానికి సీఎం రేవంత్..
ముఖ్యమంత్రి ఎక్కిన లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్‌కు బదులు నేరుగా ఫస్ట్ ఫ్లోర్‌కు వెళ్లిన వైనం
అక్కడ దిగి నడుచుకుంటూ వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సచివాలయంలో సీఎం భద్రత విషయంలో డొల్లతనం కనబడుతోందా అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. సోమవారం సచివాలయం గ్రౌండ్‌ఫ్లోర్‌లోని 29వ నంబరు గదిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశానికి సీఎం రేవంత్.. లోయర్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి లిఫ్టులో రావాలి. కానీ ఆయన ఉన్న లిఫ్ట్ నేరుగా మొదటి అంతస్తుకు వెళ్లి ఆగింది. అక్కడే ప్రెస్‌మీట్ ఏర్పాటుచేశారనుకున్న సీఎం.. లిఫ్ట్ నుంచి బయటకు వచ్చి ప్రెస్‌మీట్ రూమ్ అనుకుని ఒక గది దగ్గరికి వెళ్లారు. కానీ, అది విద్యాశాఖలోని ఓ అధికారికి కేటాయించిన చాంబర్ అని.. సమావేశం అక్కడ కాదని గ్రహించి, అక్కణ్నుంచీ గ్రౌండ్ ఫ్లోర్‌కు నడుచుకుంటూ వచ్చారు. వాస్తవానికి సీఎం రావడానికి ముందుగానే ఆయన ఏ ఫ్లోర్‌లో, ఎక్కడికి వెళ్లాలన్నది ఖరారై ఉంటుంది. ఆ షెడ్యూలు ప్రకారం.. లిఫ్ట్‌లో ముందుగానే గ్రౌండ్ ఫ్లోర్ ఆప్షన్‌ను పెట్టి ఉంచాలి. కానీ దానికి భిన్నంగా జరగడంపై సీఎం సెక్యూరిటీ విభాగం ఆగ్రహం వ్యక్తం చేసిందని, దీన్ని తీవ్రంగా పరిగణిస్తోందని సమాచారం. సీఎం సచివాలయానికి వస్తున్న ప్రతిసారీ సీఎం సెక్యూరిటీ విభాగం చేయాల్సిన పనుల్లోనూ సచివాలయ భద్రతాధికారులే జోక్యం చేసుకుంటున్నారని, సోమవారం కూడా వారి తీరు అలాగే ఉందని, ఆ నేపథ్యంలోనే సీఎం లిఫ్ట్‌లో వెళ్లాల్సిన ఫ్లోర్ నంబరు మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై సచివాలయ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌పై ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, వివరణ అడిగినట్టు తెలిసింది.