Share News

చుక్క రక్తం కారకుండా..

ABN , Publish Date - Feb 25 , 2026 | 01:47 AM

ఎక్కడో శ్రీకాకుళంలో మొదలైన నక్సల్బరీ పోరాటం అనేక మలుపులు తిరిగి.. నక్సలైట్ల నుంచి మావోయిస్టులుగా మారి.. జనతన సర్కార్‌ అంటూ సొంత సామ్రాజ్యాన్ని స్థాపించి..

చుక్క రక్తం కారకుండా..

  • మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటులో తెలంగాణ పోలీసుల అరుదైన వ్యూహం

  • ఒకరి విషయం మరొకరికి తెలియకుండా..

  • గుట్టుగా పావులు కదిపిన నిఘా బృందాలు

  • చివరి వరకూ రహస్యంగానే వ్యవహారం

  • వరుస లొంగుబాట్ల తర్వాత ఒక్కొక్కరితో ఎస్‌ఐబీ కమ్యూనికేషన్‌

  • వారిలో విశ్వాసం కల్పించి లొంగుబాటుకు మార్గం సుగమం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): ఎక్కడో శ్రీకాకుళంలో మొదలైన నక్సల్బరీ పోరాటం అనేక మలుపులు తిరిగి.. నక్సలైట్ల నుంచి మావోయిస్టులుగా మారి.. జనతన సర్కార్‌ అంటూ సొంత సామ్రాజ్యాన్ని స్థాపించి.. రెడ్‌ కారిడార్‌తో హడలెత్తించిన మావోయిస్టు ఉద్యమానికి తెలంగాణ పోలీసులు ముగింపు పలికారు. మావోయిస్టు పార్టీ ప్రస్తుత రథసారథి, కేంద్ర కమిటీ అప్రకటిత కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీతోపాటు మావోయిస్టు కురువృద్ధుడు రాజిరెడ్డి అలియాస్‌ సంగ్రామ్‌, బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్‌, ఆంధ్రాకు చెందిన నూనె నర్సింహారెడ్డిలను లొంగుబాటలోకి తీసుకురావడం వెనుక తెలంగాణ పోలీసులు అరుదైన వ్యూహన్ని అనుసరించారు. ఒకరి లొంగుబాటు సమాచారం మరొకరికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ఇటీవల లొంగిపోయిన వారిలో అడవుల్లో ఉన్న అగ్రనేతల సన్నిహితులను గుర్తించి.. వారి ద్వారా కొంత రాయబారం నడిపారు. గత ఏడాది మే 21న మావోయిస్టు పార్టీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్‌ బస్వరాజ్‌ ఎన్‌కౌంటర్‌లో మరణించిన తర్వాత పార్టీ పగ్గాలను అనధికారికంగా దేవ్‌జీ స్వీకరించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పటికే మావోయిస్టుల సురక్షిత లొంగుబాటుకు అవకాశం ఇవ్వాలని ప్రజా సంఘాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తున్న క్రమంలో నంబాల మరణం తర్వాత పార్టీ సెంట్రల్‌ కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్‌ సోను రాసిన లేఖ సంచలనం సృష్టించింది. పార్టీ సైద్ధాంతిక వైఫల్యాలతోపాటు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో విఫలమైందని సోను పేర్కొన్నారు. లొంగుబాటుకు సంబంధించి నంబాలతోనూ చర్చ జరిగిందన్నారు. అయితే నంబాల మరణం తర్వాత పార్టీ కమ్యూనికేషన్‌ వ్యవస్థ విచ్ఛిన్నమైందని తెలుస్తోంది. అధికార ప్రతినిధిగా అభయ్‌ పేరిట దేవ్‌జీ ప్రకటనలు జారీ చేస్తున్నప్పటికీ.. ఇతర కేంద్ర కమిటీ సభ్యులను కలుసుకుని సోను లేఖపై చర్చించడానికి ఆయన చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని సమాచారం.


ఆశన్నను కలిసేందుకు దేవ్‌జీ విఫలయత్నం..

సోను లేఖ తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో బాధ్యతలు నిర్వహిస్తున్న ఆశన్న అలియాస్‌ రూపే్‌షను కలవడానికి దేవ్‌జీ ప్రయత్నించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. కర్రెగుట్టల నుంచి సోను ఉన్న ప్రాంతానికి వెళ్లేలోపు మూడు చోట్ల జరిగిన ఎన్‌కౌంటర్ల నుంచి దేవ్‌జీ త్రుటిలో తప్పించుకున్నట్లు తెలంగాణ నిఘా వర్గాలు ట్రాక్‌ చేశాయి. దీంతో ఆశన్నను కలవలేక దేవ్‌జీ బృందం అతికష్టంతో కర్రెగుట్టలకు చేరుకున్నట్లు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే సోను గత ఏడాది అక్టోబరులో 50 మందికి పైగా మావోయిస్టులతో ఆయుధాలతో సహా వెళ్లి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎదుట లొంగిపోయారు. ఇది జరిగిన పది రోజులకే ఆశన్న సైతం 200 మందికి పైగా మావోయిస్టులు, 150కి పైగా ఆయుధాలతో ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయారు. ఇంకా మిగిలిన వారిలో కీలకమైన ఆజాద్‌ తదితరులతో టచ్‌లోకి వెళ్లిన నిఘా బృందాలు.. వారిలో నమ్మకం కల్పించి లొంగుబాటుకు ఆయుధాలతో సహా రప్పించగలిగారు. పదుల సంఖ్యలో మావోయిస్టులను సరెండర్‌ చేసుకుంటూ.. ఆ విషయాలు వివిధ మాధ్యమాల ద్వారా అడవుల్లో ఉన్న అగ్రనేతలకు తెలిసేలా చర్యలు తీసుకున్నారు. ఆపరేషన్‌ కగార్‌ ముగింపునకు, మావోయిస్టు రహిత దేశం లక్ష్యానికి ఈ ఏడాది మార్చి 31 డెడ్‌లైన్‌గా కేంద్రం ప్రకటించి కఠినమైన చర్యలు తీసుకుంటున్న క్రమంలో ‘పోరు వద్దు.. ఊరు ముద్దు’ అంటూ అడవుల్లో ఉన్న అన్నల కుటుంబ సభ్యుల చేత మాట్లాడించి.. వాటికి భారీగా పోలీసులు ప్రచారం కల్పించారు.


రాజిరెడ్డికి విశ్వాసం కల్పించడం ద్వారా..

ఈ క్రమంలో తొలుత రాజిరెడ్డితో టచ్‌లోకి వెళ్లిన పోలీసు బృందాలు ఆయనకు విశ్వాసం కల్పించి, తర్వాత దేవ్‌జీని కాంటాక్ట్‌లోకి తీసుకున్నారని సమాచారం. లొంగుబాటు తప్పదని అర్థమైన తర్వాత మధ్యలో జరిగిన హిడ్మా ఎన్‌కౌంటర్‌తో పోలీసులపై కొంత అపనమ్మకాన్ని పెంచుకున్న దేవ్‌జీ.. తెలంగాణ పోలీసుల మాటలను కొన్నాళ్లు విశ్వసించకుండా ఉన్నారని సమాచారం. గత కొద్ది నెలలుగా ఎస్‌ఐబీ బృందాలు దేవ్‌జీ విశ్వాసాన్ని చూరగొనడానికి పలు ప్రయత్నాలు చేసి ఆయనకు తెలంగాణ పోలీసులపై నమ్మకం కలిగేలా చూడగలిగారు. తెలంగాణ రాష్ట్ర కమిటీలో ఫైర్‌ బ్రాండ్‌గా ఉన్న బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్‌ విషయంలోనే పోలీసులు కాస్త ఎక్కువగా కష్టపడినట్లు తెలుస్తోంది. ఆయన నమ్మకాన్ని పొందడం, తమపై నమ్మకం కల్పించడంలో సక్సెస్‌ అయిన తర్వాత దామోదర్‌తో కలిసి తెలంగాణ కమిటీలో పనిచేస్తున్న ఆంధ్రాకు చెందిన నూనె నర్సింహారెడ్డికి సులభంగా నచ్చజెప్పి తమ బాటలోకి తెచ్చుకున్నారని సమాచారం. రాజిరెడ్డి, దేవ్‌జీ, దామోదర్‌లు ఒక్కసారి కలుసుకునే వరకు అంతా కలిసి లొంగిపోనున్నామనే విషయం వారికి తెలియకుండా పోలీసులు జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది.

బుల్లెట్‌కు బుల్లెట్‌తో కాదని..

‘బుల్లెట్‌కు బుల్లెట్‌తో కాదు.. వారికి బతుకు ఇవ్వడానికి ప్రయత్నించండి’ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన విషయాన్ని సీరియ్‌సగా తీసుకుని లొంగిపోయిన మావోయిస్టులకు గౌరవప్రదమైన జీవితాన్ని ఇస్తున్న విషయాన్ని మీడియా ద్వారా గట్టిగా ప్రచారం జరిగేలా పోలీసు ఉన్నతాధికారులు కృషి చేశారు. గతంలో సుదీర్ఘకాలం ఎస్‌ఐబీలో పనిచేసిన ప్రస్తుత డీజీపీ శివధర్‌ రెడ్డి లొంగుబాట వ్యూహాన్ని రచించగా, ఎస్‌ఐబీ ఐజీ సుమతి సమర్థవంతంగా నమ్మకస్తులైన ఎస్‌ఐబీ సిబ్బంది ద్వారా పావులు కదిపి కథ తుది అంకానికి చేరేలా జాగ్రత్తలు తీసుకున్నారు. మంగళవారం జరిగిన అగ్రనేతల లొంగుబాటు సమయంలో మీడియాతో మాట్లాడిన రాజిరెడ్డి.. తమ లొంగుబాటులో అనేక ప్రశ్నలున్నాయన్నారంటే పోలీసు వ్యూహాలేంటో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వం మావోయిస్టుల విషయంలో మృదు వైఖరితో ఉందనే విషయంపై కేంద్రం నుంచి ఒత్తిడి వచ్చినా, కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశాలు వచ్చినా.. తాము అనుసరిస్తున్న వైఖరితోనే ఎండ్‌కార్డ్‌ సాధ్యమవుతుందన్న విషయాన్ని కేంద్ర హోంశాఖ అధికారులకు అర్థమయ్యేలా చేతల ద్వారా తెలంగాణ పోలీసులు చూపించారు.

Updated Date - Feb 25 , 2026 | 01:47 AM