Share News

తెలంగాణ పోరాట స్ఫూర్తితో ఉత్తేజం పొందాం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ABN , Publish Date - Jun 02 , 2026 | 04:43 PM

తెలంగాణ పోరాట స్ఫూర్తితో ఉత్తేజం పొందామని జనసేన పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తెలంగాణపై తనకున్న ప్రేమ రాజకీయాలకు అతీతమైనదన్నారు.

తెలంగాణ పోరాట స్ఫూర్తితో ఉత్తేజం పొందాం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

హైదరాబాద్, జూన్ 02: తెలంగాణ పోరాట స్ఫూర్తితో ఉత్తేజం పొందామని జనసేన పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తెలంగాణపై తనకున్న ప్రేమ రాజకీయాలకు అతీతమైనదన్నారు. తెలంగాణపై తనకు కొత్తగా వచ్చిన ప్రేమ కాదని పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. 13వ ఏట అడుగుపెడుతున్న తెలంగాణకు శుభాకాంక్షలు తెలిపారు. లక్ష మందికిపైగా జనసేన నాయకులు, సైనికులు ఉన్న.. తెలంగాణలో కేడర్ తరఫున ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణలో జనసేన పార్టీ పుట్టిందని గుర్తు చేశారు. ఇక్కడి నాయకులంతా 2007-08 నుంచి.. అప్పటి యువరాజ్యంలో సభ్యులని వివరించారు.


తెలంగాణ నలుమూలలా పెరిగిన వాడిని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణ బాగుండాలనే ఎప్పుడూ కోరుకున్నానని తెలిపారు. తన సినిమాల్లో తెలంగాణ స్ఫూర్తి కనిపిస్తుందని చెప్పారు. ఆదిలాబాద్‌ తాండాల్లో గడిపిన వాడిని.. ఆ తాండాల్లో దాహార్తి తీర్చిన వాడినని ఏపీ డిప్యూటీ సీఎం వివరించారు.


తెలంగాణ విభజన తీరుకు తాము వ్యతిరేకమన్నారు. పార్లమెంట్‌ తలుపులు మూసి రాష్ట్ర విభజించిన తీరును ప్రశ్నించామని చెప్పారు. తనకు వారాహి యాత్రకు అనుమతి ఇచ్చింది తెలంగాణ అని వ్యాఖ్యానించారు. వైసీపీ తనను ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టనివ్వనంటే ఈ ప్రాంతం ఆదరించిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వివరించారు.


ఆంధ్రప్రదేశ్‌లోనే తాను అధికారం కోరుకోలేదన్నారు. అలాంటిది తెలంగాణలో ఎందుకు కోరుకుంటానని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌పై తెలంగాణ ప్రజలు, నాయకులకు విద్వేషం లేదన్నారు. విద్వేషం చూపించి ఉంటే ఆ రాష్ట్ర ప్రజలు ఇక్కడ తిరిగేవారు కాదని పేర్కొన్నారు.


హైదరాబాద్‌లో తనకేం పని కొందరు ప్రశ్నిస్తున్నారన్నారు. మీరు ఎవరు తనను బెదిరించడానికి అని ప్రశ్నించారు. తెలంగాణ మీ అయ్య జాగీరా అని వారిని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ నిలదీశారు. తనపై దాడులు చేస్తామంటున్నారన్నారు. తనకు తెలంగాణలో కంటే ఏపీలోనే బెదిరింపులు అధికంగా ఉన్నాయని చెప్పారు. 2019 తాను ఓడిపోయినప్పుడు.. తెలంగాణ వాసులే.. ఇక్కడ ఆ పరిస్థితి రాదన్నారని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ గుర్తు చేసుకున్నారు.


మీ ఇష్టానికి మాట్లాడితే మేం భయపడాలా? అని ప్రశ్నించారు. తెలంగాణలో జనసేన ఎదగాలని ఎంతగానో ఎదురుచూస్తున్నారని తెలిపారు. మీరు ఎన్ని తిట్లు తిట్టినా.. తన గుండెలో తెలంగాణ ఉంటుందని స్పష్టం చేశారు. వైసీపీ గూండాల బెదిరింపుల ముందు ఈ బెదిరింపులు ఓ లెక్కా? అని అన్నారు.


ఓ విశ్లేషకుడు ఇక్కడ తన గురించి తప్పుగా మాట్లాడారని తెలిపారు. ఆ విశ్లేషకుడి వల్లే ఈ గొడవ మొదలైందన్నారు. ఆ వ్యాఖ్యలపైనే జనసేన సైనికులు స్పందించారని వివరించారు. కొన్ని చోట్ల కేసులు పెట్టారు.. అందులో తన ప్రమేయం లేదని స్పష్టం చేశారు. పార్టీ స్థాపించి 13 ఏళ్లు గడుస్తున్నా ఇంకా మేం నోరు మూసుకుని కూర్చోవాలా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణలో మార్పు తప్ప మేం అధికారం కోరుకోవడం లేదని పేర్కొన్నారు. దేశంలో చాలా చోట్ల తెలుగువారు ఉన్నారని గుర్తు చేశారు. వాళ్లను అక్కడి నుంచి వెళ్లిపోమనడం కరెక్టేనా? అని ప్రశ్నించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది: పవన్ కల్యాణ్

యూఎస్‌లో 30 మంది భారతీయుల అరెస్ట్

Read Latest TG News And Telugu News

Updated Date - Jun 02 , 2026 | 06:05 PM