Share News

ప్లేస్‌మెంట్లలో ఏటీసీల హవా

ABN , Publish Date - Sep 30 , 2026 | 05:57 AM

పారిశ్రామిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా యువతకు ఆధునిక సాంకేతిక శిక్షణ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌ (ఏటీసీ)లు చక్కటి ఫలితాలనిస్తున్నాయి.

ప్లేస్‌మెంట్లలో ఏటీసీల హవా
Telangana ATC placements

  • 4వేల మంది ఏటీసీ విద్యార్థులకు ఉద్యోగాలు..

  • ఉట్నూర్‌ ఏటీసీలో 117 మందికి ఎంఎన్‌సీలో జాబ్‌

  • యాపిల్‌, ఐటీసీ, టాటా మోటార్స్‌

  • వంటి కంపెనీల్లో అవకాశాలు

  • 4 వేల కోట్లతో 119 ఏటీసీల ఏర్పాటుకు సర్కారు శ్రీకారం

  • ఇప్పటికే 65 అందుబాటులోకి..

హైదరాబాద్‌, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): పారిశ్రామిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా యువతకు ఆధునిక సాంకేతిక శిక్షణ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌ (ఏటీసీ)లు చక్కటి ఫలితాలనిస్తున్నాయి. వీటిలో పలు విభాగాల్లో నైపుణ్యం సాధించిన విద్యార్థులు పెద్దసంఖ్యలో ఉద్యోగాలు సాధిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు 65 ఏటీసీలను ఏర్పాటుచేయగా.. వీటిలో 11 వేల మంది విద్యార్థులు 4.0 స్కిల్స్‌లో నైపుణ్యం సాధించారు. వీరిలో దాదాపు 4వేల మందికి పైగా ఉద్యోగాలు సాధించారు. ఇటీవల ఆదిలాబాద్‌ జిల్లాలోని ఉట్నూర్‌ ఏటీసీలో 117 మంది విద్యార్థులు అగ్రగామి మల్టీ నేషనల్‌ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించడం గమనార్హం.


రానున్న రోజుల్లో చేపట్టే మెగా ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌లలో పాల్గొనే విద్యార్థుల సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటిదాకా ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌లలో పాల్గొన్న విద్యార్థుల సంఖ్యను బేరీజు వేసుకుంటే.. దీని సక్సెస్‌ రేటు 61 శాతంగా ఉంది. ప్రఖ్యాత యాపిల్‌, ఐటీసీ, ఎల్‌ అండ్‌ టీ, భారత్‌ డైనమిక్స్‌, ఐచర్‌, అపోలో, టాటా మోటార్స్‌, స్నీడర్‌ ఎలక్ర్టిక్‌ వంటి సంస్థలు మంచి పారితోషికాలతో విద్యార్థులను ఉద్యోగాల్లో చేర్చుకున్నాయి. ఇప్పటికే ఒక సంవత్సరం కోర్సు పూర్తి చేసిన బ్యాచ్‌లు రెండు ఉత్తీర్ణత సాధించగా.. మరో బ్యాచ్‌ రెండేళ్ల కోర్సు పూర్తి చేసుకుంది. ఈ సంవత్సరం కొత్త బ్యాచ్‌లతో దాదాపు అన్ని ఏటీసీల్లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి.


సీఎన్‌సీ మెషీన్‌, రోబోటిక్స్‌, ఆటోమేషన్‌, ఎలక్ర్టిక్‌ వెహికల్‌ టెక్నాలజీ తదితర రంగాల్లో టాటా టెక్నాలజీస్‌ సంస్థ సహకారంతో అధునాతన సాంకేతిక పరికరాలతో 65 ఏటీసీల్లోని విద్యార్థులు నైపుణ్య శిక్షణ పొందుతున్నారు. కాగా, ప్రస్తుతం ఉన్న 65 ఏటీసీలకు అదనంగా మరో 54 ఏటీసీలు నిర్మాణంలో ఉన్నాయి. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల పరిధిలో దాదాపు రూ.4 వేల కోట్లతో 119 ఏటీసీలతో నైపుణ్య శిక్షణ ద్వారా రాష్ట్ర యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా టాటా టెక్నాలజీస్‌ భాగస్వామ్యంతో రాష్ట్రంలోని 65 ఐటీఐలను ఏటీసీలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించి ఈప్రాజెక్టుకు 2024 జూన్‌లో శంకుస్థాపన చేసింది. కేవలం 15 నెలల్లోనే 65 ఏటీసీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. 2025 సెప్టెంబరులో ఈ కేంద్రాలను ప్రారంభించారు.


చదువుతోపాటు నైపుణ్యాలు

ఇప్పటికే ఏటీసీల్లో ఇండస్ర్టీ 4.0కు సంబంధించిన ఆధునిక సాంకేతిక అంశాలపై శిక్షణ పొందిన విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. రోబోటిక్స్‌, ఆటోమేషన్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఆధునిక తయారీ రంగాలకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం ద్వారా ఉద్యోగ మార్కెట్‌లో యువతకు మెరుగైన అవకాశాలు కల్పించడమే ఈ కేంద్రాల ప్రధాన లక్ష్యంగా ఉంది. ఇండస్ర్టీ 4.0 నైపుణ్యాలు ఉన్న యువతకు జపాన్‌, దక్షిణ కొరియా, జర్మనీ వంటి దేశాల్లో భవిష్యత్తులో భారీగా అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.


ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా దేశాల్లో ఉద్యోగాలకు అవసరమైన భాషా నైపుణ్యాలను కూడా యువతకు అందించేందుకు టామ్‌కామ్‌ ద్వారా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. దేశీయంగా కూడా ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు కలిగిన యువతకు డిమాండ్‌ పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో సంప్రదాయవిద్యతో పాటు పరిశ్రమలకు అవసరమైన స్కిల్స్‌ ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలు, వేతనాలు మెరుగ్గా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.


జాబ్‌ మేళాల్లో ఏటీసీ విద్యార్థుల హవా

ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిర్వహించిన జాబ్‌ మేళాల్లో ఏటీసీ విద్యార్థులు అధికంగా ఉద్యోగాలు దక్కించుకోవడం గమనార్హం. అత్యధికంగా సెప్టెంబరు 19న కోదాడలో నిర్వహించిన జాబ్‌ మేళాలో 725 మంది ఏటీసీ విద్యార్థులు ఉద్యోగాలు దక్కించుకున్నారు. వరంగల్‌, హైదరాబాద్‌లలో టాటా టెక్నాలజీస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో దాదాపు 700మంది ఉద్యోగాలు పొందారు. ఇటీవల హైదరాబాద్‌ శాంతినగర్‌ ఏటీసీలో నిర్వహించిన జాబ్‌ మేళాలో 350మంది ఉద్యోగాలు దక్కించుకున్నారు. సెప్టెంబరు 22న కొడంగల్‌లో నిర్వహించిన జాబ్‌ మేళాలో 80 ఉద్యోగాలు పొందారు. ఇలా మరికొంత మందీ ఉద్యోగాలు సాధించారు.

Updated Date - Sep 30 , 2026 | 05:57 AM