Share News

22ఏకు పరిష్కారం?

ABN , Publish Date - Sep 16 , 2026 | 04:04 AM

రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన 22ఏ వివాదానికి శాశ్వతంగా చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. నిషేధిత జాబితాలో పొరపాటున చేర్చిన భూములతోపాటు.. సాంకేతికంగా కొన్ని కారణాల వల్ల గత ప్రభుత్వ హయాం నుంచీ కొన్ని భూములు ఆ జాబితాలో ఉన్నాయి

22ఏకు పరిష్కారం?
CM Revanth Reddy and family

  • యూఎల్‌సీ భూముల విషయంలో పేద,

  • మధ్యతరగతి వర్గాలకు ఊరటనిచ్చేలా ప్రకటన

  • అవసరమైతే ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు

  • వాస్తవాలను ప్రజల ముందు పెడదామన్న సీఎం

  • డిప్యూటీ సీఎం, సీనియర్‌ మంత్రులతో భేటీ

  • లింకు డాక్యుమెంట్ల ఆధారంగా

రిజిస్ట్రేషన్లకు అనుమతించడంపై చర్చ

  • ఏ ఒక్క అధికారికీ విచక్షణాధికారం లేకుండా

పక్కా విధివిధానాలపై ప్రభుత్వం కసరత్తు

  • తప్పు చేసిన అధికారులపై చర్యలు కూడా!

  • వివాదానికి ముగింపు పలికేలా అసెంబ్లీలో ప్రకటన

హైదరాబాద్‌, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన 22ఏ వివాదానికి శాశ్వతంగా చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. నిషేధిత జాబితాలో పొరపాటున చేర్చిన భూములతోపాటు.. సాంకేతికంగా కొన్ని కారణాల వల్ల గత ప్రభుత్వ హయాం నుంచీ కొన్ని భూములు ఆ జాబితాలో ఉన్నాయి. ఆయా చోట్ల పేదలు, మధ్యతరగతి ప్రజలు దశాబ్దాల క్రితమే ఇళ్లు కట్టుకుని ఉంటే.. వాటి విషయంలోనూ సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అవసరమైతే అలాంటి అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌, ప్రభుత్వ భూములవిషయంలో క్రమబద్ధీకరణ లాంటి ఉపశమనం కల్పించే అంశంపైనా యోచిస్తోంది. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో సీలింగ్‌ చట్టం రద్దయ్యే నాటికి అనేక భూములపై కేసులున్నాయి. చట్టం రద్దయ్యే నాటికి ప్రభుత్వం ఆయా భూములను స్వాధీనం చేసుకుంటే సరే. కానీ, చాలాచోట్ల స్వాధీనం చేసుకోలేదు. కేసులు నడుస్తూనే ఉన్నాయి. అయినా అక్కడ ఇప్పటికే చాలావరకు ఇళ్ల నిర్మాణాలు, కాలనీలు వచ్చేశాయి. వాటిని గతం నుంచే 22ఏ జాబితాలో పెట్టారు. అలాంటి భూముల్లో ఇళ్లు కట్టుకుని ఉన్నవారికి కూడా ఎలాంటి ఉపశమనం కల్పించాలన్న దానిపైనా చర్చ జరిగింది. అవసరమైతే ఈ అంశాలపై ఒక ఉన్నతస్థాయి కమిటీ కూడా వేయాలన్న ఆలోచన చేస్తున్నారు. మొత్తంగా 22ఏ అంశంపై భవిష్యత్తులో ఇక ఎప్పుడూ ఇబ్బంది రాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలపై బుధవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం.


ఏ అధికారికీ విచక్షణాధికారం లేకుండా..

22ఏ జాబితా తయారీలో ఏ అధికారికీ విచక్షణాధికారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు.. యూఎల్‌సీ భూముల క్రమబద్ధీకరణ విషయంలో పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఊరట కల్పించే విషయంపైనా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 22ఏ వివాదంపై వాస్తవాలను ప్రజల ముందు ఉంచడంతోపాటు సమస్య పరిష్కార మార్గాలపైనా స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం. 22ఏ వివాదంపై సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, వివేక్‌లతో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. 22ఏ సమస్య ఇంతలా చర్చ జరగడానికి దారితీసిన కారణాలపై సీఎం ఆరా తీసినట్లు, ప్రజల్లో నెలకొన్న ఆందోళనలను తొలగించేందుకు ఏం చేద్దామనే చర్చ జరిగినట్లు తెలిసింది. ప్రతిపక్షాల ఆరోపణలను ఎలా తిప్పికొట్టాలనే అంశాలపై మంత్రుల అభిప్రాయాలు సేకరించినట్లు సమాచారం. 22ఏ విషయంలో తప్పులు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్న దానిపైనా చర్చ జరిగింది.

వివాదానికి ముగింపు పలికేలా..

22ఏ వివాదానికి శాశ్వత పరిష్కారం చూపే విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా.. న్యాయబద్ధంగా ఉండేలా అధికారులకు రెవెన్యూ శాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు. గత శనివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అసెంబ్లీలో సమాధానం ఇస్తూ.. ఏయే కారణాలతో గతంలో కూడా 22ఏలో ఉన్న భూములు, కాలనీలు ఉన్నాయో వివరాలు చెప్పారు. హైదర్‌నగర్‌ సర్వే నంబరు 145లో 220 ఎకరాలు ఉండగా దీని పరిధిలో సీబీసీఐడీ, వసంతనగర్‌, భగత్‌సింగ్‌ నగర్‌, పటేల్‌ నగర్‌ కాలనీలు సీఎస్‌-14 పరిధిలో ఉన్నట్లు చెప్పారు. ఇవి పాత రికార్డుల ప్రకారం 22ఏ జాబితాలో ఉన్నాయని వివరించారు. సుప్రీంకోర్టులో సివిల్‌ అప్పీల్‌ నెంబరు 1867/2023 పెండింగ్‌లో ఉన్నందున 2013 నుంచి ఈ భూములు 22ఏ జాబితాలో ఉన్నాయని, కొత్తగా పెట్టింది లేదని వెల్లడించారు. హైదర్‌నగర్‌ సర్వే నంబరు 163 పరిధిలో 175 ఎకరాలు ఉండగా, దుర్గామాత సొసైటీ, డ్రీమ్‌ వ్యాలీ, రామ్‌ నరేష్‌ కాలనీలు సీఎస్‌-14 పరిధిలో ఉన్నాయని, ఇవి కూడా 2013 నుంచి 22ఏ పరిధిలో ఉన్నాయని వివరించారు. శంషాగూడ సర్వే నంబరు 57 పరిధిలో 274 ఎకరాలు ఉండగా, ఈ భూములకు సంబంధించి కూడా సీఎస్‌-7 వివాదం ఉందని తెలిపారు.


కమిటీ వేసే ఆలోచన..

గతంలో ధరణి ముసుగులో జరిగిన అక్రమాలపై విచారణ చేసేందుకు ఇప్పటికే ప్రత్యేక విచారణ బృందానికి ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ధరణి అవకతవకలపై విచారణ బాధ్యతలను కూడా సెట్‌కే అప్పగించే యోచనలో ఉన్నట్లు సమాచారం. అలాగే యూఎల్‌సీ భూముల క్రమబద్ధీకరణ, 22ఏ వివాదం, పరిష్కార మార్గాలు, జాబితా తయారీలో విధివిధానాల తయారీకి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం. కాగా, బీఆర్‌ఎస్‌ నేతలు ఇటీవల నిర్వహించిన మాక్‌ అసెంబీలో అడ్డగోలుగా మాట్లాడారని, దీనిపై మంత్రులు ఘాటుగా స్పందించి ఉండాల్సిందని సీఎం అభిప్రాయపడినట్లు తెలిసింది. 22ఏ విషయంలో ప్రతిపక్షాల విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలని సూచించినట్లు తెలిసింది.

ప్రజల కోణంలో ఆలోచిస్తేనే..

22ఏ వివాదంపై ప్రజల కోణంలో ఆలోచిస్తేనే కొంత పరిష్కారం దొరుకుతుందని భూచట్టాల నిఫుణుడు భూమి సునీల్‌ చెబుతున్నారు. అధికారుల పరిధి దాటి సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని, ప్రస్తుతం ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రకటనలను ప్రజలు విశ్వసించడం లేదని తెలిపారు. 22ఏ సమస్య ఉన్న ప్రజలే దరఖాస్తు పెట్టుకోవాలనే ధోరణితో ఉపయోగం లేదని, సమస్యకు ప్రభుత్వం తనకు తానుగా పరిష్కార మార్గాలు చూపితేనే ప్రజలు విశ్వసించే అవకాశం ఉంటుందని ‘ఆంధ్రజ్యోతి’తో అన్నారు. ఏపీలో ఆర్డీవో స్థాయిలో 22ఏ పై నిర్ణయం తీసుకునే అవకాశం కల్పించారని, అలాగే ఐజీఆర్‌ఎ్‌సలో ఉన్న జాబితా ప్రకారమేనంటూ స్పష్టత ఇచ్చారని చెప్పారు. తెలంగాణలో ఆ పరిస్థితి ఉందా? అని ప్రశ్నించారు.


సీసీఎల్‌ఏ, కలెక్టర్లతో పొంగులేటి సమావేశం..

సీఎం సమావేశం ముగిశాక.. రాత్రి 9 గంటల తరువాత రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి.. కోర్‌ అర్బన్‌ పరిధిలోని కలెక్టర్లు, సీసీఎల్‌ఏ, రిజిస్ర్టేషన్‌ శాఖ ఐజీ, సీఎంవో అధికారులతో భేటీ అయ్యారు. బుధవారం ఉదయం 9:30 గంటలకు మరోసారి మంత్రులతో సీఎం సమావేశమై.. పరిష్కార మార్గాలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. మరోవైపు 22ఏ వివాదాన్ని పరిష్కరించే బాధ్యతను కలెక్టర్లకు అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. జిల్లాల వారీగా గత పదేళ్ల కాలంలో 22ఏలో ఉన్న భూముల వివరాలు, కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక ఈ జాబితాలో చేర్చిన వివరాలను ప్రభుత్వానికి పంపారు. ఈ నేపథ్యంలో 2023 డిసెంబరు 7 తరువాత 22ఏ జాబితాలో చేర్చిన భూములను తొలగించడంతోపాటు గతంలో 22ఏలో పెట్టిన భూములపైనా విధానపరమైన నిర్ణయం తీసుకునే దిశగా రెవెన్యూ అధికారులకు మార్గదర్శకాలు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. అలాగే లింకు డాక్యుమెంట్ల ఆధారంగా రిజిస్ర్టేషన్లను అనుమతించాలనే ప్రతిపాదనలను కూడా రెవెన్యూ శాఖ పరిశీలిస్తోంది. వీటితోపాటు కోర్‌ అర్బన్‌ పరిధిలో సీఎస్‌7, సీఎస్‌ 14 భూ సమస్యల మీద కూడా కండీషనల్‌ రిజిస్ర్టేషన్లు అనుమతించాలని ఇది వరకే సూత్రప్రాయంగా మంత్రి పొంగులేటి ప్రకటన చేశారు. దీనిపై విధివిధానాలు ఖరారు చేశాక తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక యూఎల్‌సీ భూముల విషయంలో క్రమబద్ధీకరణకు నిర్ణయం తీసుకుంటే ఇందుకు ఫీజులను గతంలో ఉన్న జీవోల ప్రకారమే వసూలు చేద్దామా? మార్పులు చేయాలా? అనే అంశంపైనా స్పష్టత ఇవ్వవచ్చని తెలిసింది. ఇప్పటికే ఉన్న పాత దరఖాస్తులను పరిష్కరించడంంతోపాటు కొత్త దరఖాస్తులను ఆహ్వానించే విషయంపైనా స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం. మరోవైపు 22ఏ, ఎల్‌నినో రెండింటిపైనా అసెంబ్లీలో చర్చ జరగనుంది.

Updated Date - Sep 16 , 2026 | 04:04 AM