Share News

స్పీకర్‌ నిర్ణయం తీసుకున్నారుగా.. విచారణ ముగిస్తున్నాం

ABN , Publish Date - Mar 13 , 2026 | 05:07 AM

తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఎమ్మెల్యేల అనర్హత అంశంపై విచారణను సుప్రీం కోర్టు ముగించింది. అయితే, అనర్హత పిటిషన్లపై స్పీకర్‌ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన ఆర్డర్‌ కాపీలను 24 గంటల్లోగా.....

స్పీకర్‌ నిర్ణయం తీసుకున్నారుగా.. విచారణ ముగిస్తున్నాం

  • ఎమ్మెల్యేల అనర్హత అంశంపై సుప్రీం కోర్టు

  • బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్లను పరిష్కరించినట్లు ప్రకటన

  • స్పీకర్‌ తీర్పు కాపీలను పిటిషనర్లకు ఇవ్వకపోవడంపై విస్మయం

  • 24 గంటల్లో ఆర్డర్‌ కాపీలు, 4 రోజుల్లో అన్ని పత్రాలు అందజేయండి

  • తెలంగాణ స్పీకర్‌ కార్యాలయానికి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశం

న్యూఢిల్లీ, మార్చి 12 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఎమ్మెల్యేల అనర్హత అంశంపై విచారణను సుప్రీం కోర్టు ముగించింది. అయితే, అనర్హత పిటిషన్లపై స్పీకర్‌ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన ఆర్డర్‌ కాపీలను 24 గంటల్లోగా తమకు అందజేయాలని తెలంగాణ స్పీకర్‌ కార్యాలయాన్ని ఆదేశించింది. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ బీ ఫామ్‌పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలోకి ఫిరాయించారని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కేటీఆర్‌, పాడి కౌశిక్‌ రెడ్డి సహా మరికొందరు, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై సుధీర్ఘంగా విచారించిన జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మాసిహ్‌ ద్విసభ్య ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. స్పీకర్‌ కార్యాలయం, తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాదులు అభిషేక్‌ మను సింఘ్వీ, ముకుల్‌ రోహిత్గీ, నిరంజన్‌ రెడ్డి వాదనలు వినిపించారు. అనర్హత పిటిషన్ల అంశంలో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలన్నింటినీ పాటించామని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. 10 మంది ఎమ్మెల్యేల అనర్హత అంశానికి సంబంధించి స్పీకర్‌ సమగ్ర విచారణ నిర్వహించారని, అన్ని పిటిషన్లపైనా తుది తీర్పు వెలువరించారని తెలిపారు. ఈ పిటిషన్లకు సంబంధించి ఇక విచారించడానికి ఏమీ లేదని వెల్లడించారు. ఈ వాదనలపై పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్‌ పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరించారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. స్పీకర్‌ తీర్పు కాపీలు, విచారణ సమయంలో నమోదు చేసిన వాంగ్మూలాలు, ఇతర పత్రాలను తమకు ఇవ్వలేదని వివరించారు. తాము మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని సంబంధిత పత్రాలు ఇవ్వడం లేదని తెలిపారు. కనీస పత్రాలు కూడా లేకుండా తాము హైకోర్టుకు ఎలా వెళతామని, కావాలనే కాలయాపన చేస్తున్నారని విన్నవించారు. అసలు ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుని స్పీకర్‌ తీర్పులు ఇచ్చారో తెలుసుకోవాల్సిన అవసరం తమకు ఉందన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. చట్టప్రకారం పిటిషనర్లకు ఇవ్వాల్సిన పత్రాలను ఎందుకు ఇవ్వడం లేదని స్పీకర్‌ కార్యాలయాన్ని ప్రశ్నించింది. ఇది సరైన పద్ధతి కాదని హెచ్చరించింది. స్పీకర్‌ కార్యాలయం ఆయా పత్రాలను పిటిషనర్లకు అందజేయాలని ఆదేశించింది. అలాగే, శుక్రవారంలోగా ఆర్డర్‌ కాపీలను, నాలుగు రోజుల్లో వాంగ్మూలాలు, ఇతర డాక్యుమెంట్లను తమకు అందజేయాలని స్పీకర్‌ కార్యాలయానికి స్పష్టం చేసింది. అలాగే, కోర్టు ధిక్కరణ, అనర్హత వేటు తదితర అంశాలకు సంబంధించిన నాలుగు పిటిషన్లపై విచారణను ముగిస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.

Updated Date - Mar 13 , 2026 | 05:07 AM