సాంకేతికతలకు అనుగుణంగా విద్యాప్రణాళిక మారాలి
ABN , Publish Date - Oct 04 , 2026 | 07:36 AM
వేగంగా మారుతున్న సాంకేతికతలకు అనుగుణంగా వర్సిటీల్లో విద్యాప్రణాళిక (కరిక్యులమ్)ను మార్చాల్సిన అవశ్యకత ఉందని ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.
గ్రాడ్యుయేట్లు నైపుణ్యాలను కలిగి ఉండాలి: దుద్దిళ్ల
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): వేగంగా మారుతున్న సాంకేతికతలకు అనుగుణంగా వర్సిటీల్లో విద్యాప్రణాళిక (కరిక్యులమ్)ను మార్చాల్సిన అవశ్యకత ఉందని ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో జేఎన్‌టీయూలో ఏర్పాటు చేసిన ‘రీసెర్చ్ ఎడ్యుకేషన్ అడ్వాన్స్‌మెంట్ కాన్‌క్లేవ్ (రీచ్)’ను శనివారం ఆయన ప్రారంభించారు. సదస్సుకు హాజరైన సుమారు 25 యూనివర్సిటీల వైస్‌చాన్స్‌లర్లు, వివిధ రంగాలకు చెందిన పారిశ్రామిక ప్రతినిధులను ఉద్దేశించి మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలు డిగ్రీ కేంద్రీకృత విద్య నుంచి నైపుణ్య-కేంద్రీకృత విద్య వైపు సిలబ్‌సను మార్చడానికి ఇదే సరైన సమయమని చెప్పారు.
నేటితరం గ్రాడ్యుయేట్లు కేవలం డిగ్రీని కలిగి ఉండటమే కాకుండా, ఉపాధి పొందేందుకు ఇండస్ట్రీ అనుభవంతో కూడిన నైపుణ్యాలను కలిగి ఉండాలని ఆయన అన్నారు. అనంతరం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి రాసిన ‘హైదరాబాద్-ఎ హబ్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్, ఇన్నోవేషన్, అండ్ కల్చరల్ హెరిటేజ్’ పుస్తకాన్ని మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. చారిత్రక నగరం నుంచి ప్రపంచ ఆవిష్కరణలకు కేంద్రంగా హైదరాబాద్ ఎదుగుదల ప్రయాణాన్ని ఈ పుస్తకం ప్రతిబింబిస్తుందని కొనియాడారు. కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, సైయెంట్ వ్యవస్థాపక చైర్మన్ బి.వి.మోహన్ రెడ్డి, జేఎన్‌టీయూ వీసీ టి.కిషన్ కుమార్ రెడ్డి, ఓయూ వీసీ కుమార్ మొలుగరం తదితరులు పాల్గొన్నారు.