Share News

లొంగిపోతానన్నాడని కొట్టిచంపిన మావోయిస్టులు!

ABN , Publish Date - Feb 27 , 2026 | 12:35 AM

పోలీసులకు లొంగిపోతానన్న సహచరుడిని తోటి మావోయిస్టులు ఆగ్రహంతో కొట్టిచంపారు. ఆ తర్వాత అడవిలోనే పూడ్చిపెట్టారు. ఒడిశాలోని కంధమాల్‌ జిల్లా అడవుల్లో జనవరి 29న ఈ ఘటన జరిగింది.

లొంగిపోతానన్నాడని కొట్టిచంపిన మావోయిస్టులు!

  • తోటి మావోయిస్టును హత్య చేసి అడవిలోనే పూడ్చివేత

  • లొంగిపోయిన ఇతర మావోయిస్టులు ఇచ్చిన సమాచారంతో మృతదేహం వెలికితీత

  • ఒడిశాలోని కంధమాల్‌ జిల్లా ఎస్పీ వెల్లడి

చర్ల, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): పోలీసులకు లొంగిపోతానన్న సహచరుడిని తోటి మావోయిస్టులు ఆగ్రహంతో కొట్టిచంపారు. ఆ తర్వాత అడవిలోనే పూడ్చిపెట్టారు. ఒడిశాలోని కంధమాల్‌ జిల్లా అడవుల్లో జనవరి 29న ఈ ఘటన జరిగింది. లొంగిపోయిన ఇతర మావోయిస్టుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆ మృతదేహాన్ని వెలికితీశారు. కంధమాల్‌ ఎస్పీ బీసీ హరీష ఈ వివరాలు వెల్లడించారు. సుకుమా జిల్లా చెందిన అన్వేష్‌ మావోయిస్టు పార్టీ ఒడిశా రాష్ట్ర కమిటీలో కమాండర్‌గా ఉన్నారు. ఆపరేషన్‌ కగార్‌ ఉధృతమైన నేపథ్యంలో పలువురు తోటి మావోయిస్టులతో కలిసి దరింగిబాడి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలిసిన మావోయిస్టు పార్టీ ఒడిశా రాష్ట్ర జోనల్‌ కమిటీ సభ్యుడు శుక్రు, ఇతర మావోయిస్టులు అన్వే్‌షను అడ్డుకున్నారు. ఈ క్రమంలో గొడవ జరగడంతో అన్వే్‌షను కొట్టిచంపారు. అనంతరం అడవిలో పూడ్చి పెట్టారు. లొంగిపోయిన మావోయిస్టుల ద్వారా ఈ విషయం తెలుసుకుని, అన్వేష్‌ మృతదేహాన్ని వెలికితీసి పంచనామా కోసం తరలించామని ఎస్పీ హరీష చెప్పారు. మావోయిస్టు అన్వే్‌షను హత్య చేసిన వారిలో శుక్రు ప్రధాన నిందితుడు కాగా, మరో ఇద్దరు మావోయిస్టులు శీల, జగేష్‌ సహకరించారని పేర్కొన్నారు. వీరిలో జగేష్‌ ఈనెల 22న జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడని తెలిపారు.

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టుల మృతి

ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా ఇంద్రావతి జాతీయ పార్క్‌ పరిధిలోని అడవిలో గురువారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. వారిని బైరంగఢ్‌ ఏరియా కమిటీ సభ్యులు ముద్దా హిమాచి, పొడియం మనికి (మహిళ)గా నిర్ధారించామని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో మూడు తుపాకులు, మావోయిస్టుల వస్తువులు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. కాగా, నారాయణపూర్‌ జిల్లా కుమురాడి అడవుల్లో కూంబింగ్‌ చేపట్టిన ఐటీబీపీ బలగాలు.. మావోయిస్టుల డంప్‌ను గుర్తించాయి. అందులోని పేలుడు పదార్థాలు, బీజీఎల్‌ లాంచర్లు, టాబ్లెట్లు, తుపాకులు, కత్తులు, గొడ్డళ్లు, రోజువారీ వినియోగించే వస్తువులను స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు కాంకేర్‌ జిల్లాలో మాసే అనే మహిళా మావోయిస్టు లొంగిపోయారు. తాను వాడిన ఏకే-47 తుపాకీని పోలీసులకు అప్పగించారు.

Updated Date - Feb 27 , 2026 | 12:35 AM