Share News

మస్కట్‌లో చిక్కుకున్న మహిళను భారత్‌కు రప్పించేందుకు కృషి

ABN , Publish Date - Sep 30 , 2026 | 06:38 AM

‘మస్కట్‌లోని ఓ ఇంట్లో పనిచేసేందుకు ఆ దేశానికి వెళ్లి.. అక్కడే చిక్కుకున్న మీ తల్లిని.. భారత్‌కు రప్పించే ఏర్పాటు చేస్తా’ అని వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌కు చెందిన ఓ యువకుడికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హామీ ఇచ్చారు.

మస్కట్‌లో చిక్కుకున్న మహిళను భారత్‌కు రప్పించేందుకు కృషి
KTR

  • కొడంగల్‌ యువకుడికి కేటీఆర్‌ భరోసా

హైదరాబాద్‌, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ‘మస్కట్‌లోని ఓ ఇంట్లో పనిచేసేందుకు ఆ దేశానికి వెళ్లి.. అక్కడే చిక్కుకున్న మీ తల్లిని.. భారత్‌కు రప్పించే ఏర్పాటు చేస్తా’ అని వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌కు చెందిన ఓ యువకుడికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హామీ ఇచ్చారు. కొడంగల్‌ నియోజకవర్గం దౌల్తాబాద్‌ మండలం గోకఫస్లాబాద్‌ గ్రామానికి చెందిన తుప్పుడు రాజు మంగళవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిశారు. తన తల్లి లక్ష్మి ఏడాది కిందట ఇంట్లో పనిమనిషిగా చేరి డబ్బు సంపాదించేందుకు మస్కట్‌ వెళ్లి అక్కడే చిక్కుకుపోయిందని తెలిపాడు. ఇంటి యజమాని ఆరునెలల తర్వాత జీతం ఇవ్వకుండా వేధించారని, తన తల్లి మొబైల్‌ఫోన్‌ గుంజుకొని వెళ్లగొట్టారని చెప్పాడు.


తమ స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ.. తన సమస్య పరిష్కారం కావడంలేదని, అందుకే తెలంగాణ భవన్‌కు వచ్చినట్లు తెలిపాడు. దీనిపై స్పందించిన కేటీఆర్‌ ఒమాన్‌ ఎన్‌ఆర్‌ఐ విభాగం వారితో మాట్లాడి లక్ష్మిని భారత్‌కు రప్పించేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. లక్ష్మిని ఇక్కడికి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటానని, అధైర్యపడొద్దని ఈ సందర్బంగా రాజుకు కేటీఆర్‌ భరోసా ఇచ్చారు. కేటీఆర్‌ బుధవారం కేరళలోని కొచ్చి వెళ్లనున్నారు. ఇండియా టుడే ఆధ్వర్యంలో నిర్వహించే ‘ఇండియా టుడే కాంక్లేవ్‌ సౌత్‌-2026’లో పాల్గొంటారు. ‘తెలంగాణ స్టేట్‌- ఫార్మేషన్‌ టూ ట్రాన్స్‌ఫర్మేషన్‌’ అనే అంశంపై కేటీఆర్‌ మాట్లాడనున్నారు.

Updated Date - Sep 30 , 2026 | 06:38 AM