Share News

వైద్యం వికటించి పదినెలల శిశువు మృతి

ABN , Publish Date - Sep 30 , 2026 | 06:24 AM

పది నెలల శిశువుకు జ్వరం వస్తే చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లడమే ఆ తల్లిదండ్రులు చేసిన తప్పయింది! ఆస్పత్రి వైద్యుల వైద్యం వికటించడతో క్షణాల్లోనే శిశువు ప్రాణాలు కోల్పోయాడు.

వైద్యం వికటించి పదినెలల శిశువు మృతి
Hyderabad infant death

  • పోలీసులకు తండ్రి ఫిర్యాదు.. ప్రైవేటు ఆస్పత్రిపై కేసు

చాంద్రాయణగుట్ట, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): పది నెలల శిశువుకు జ్వరం వస్తే చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లడమే ఆ తల్లిదండ్రులు చేసిన తప్పయింది! ఆస్పత్రి వైద్యుల వైద్యం వికటించడతో క్షణాల్లోనే శిశువు ప్రాణాలు కోల్పోయాడు. శాలిబండలో ఈ విషాద ఘటన జరిగింది. సీఐ మహేశ్‌ గౌడ్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. కాలాపత్తర్‌ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ ఇస్మాయిల్‌ తన కుమారుడు మహ్మద్‌ హమ్జా (10 నెలలు)కు జ్వరం రావడంతో చికిత్స నిమిత్తం సోమవారం ఉదయం 11 గంటలకు శాలిబండలోని ఫాతిమా ఆస్పత్రికి తీసుకెళ్ళాడు.


జ్వరం తీవ్రంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో అడ్మిట్‌ చేశారు. మర్నాడు డాక్టర్‌ ఆవేజ్‌ మీర్జా అనే వైద్యుడు, బాధిత శిశువుకు ఓ ఇంజెక్షన్‌ ఇచ్చాడు. ఆ వెంటనే శిశువు నోట్లో నుంచి నురగలు రావడాన్ని గమనించిన వైద్యులు రాత్రి 9 గంటలకు మెరుగైన వైద్యం కోసం నిలోఫర్‌కు తీసుకెళ్ళాలని సూచించారు. హుటాహుటిన వారు నిలోఫర్‌కు తరలించగా పరీక్షించిన అక్కడి వైద్యులు శిశువు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. వైద్యుల తప్పుడు చికిత్స కారణంగానే తన కుమారుడు ప్రాణాలు కోల్పోయాడని, ఇందుకు కారణమైన ఫాతిమా ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు బాలుడి తండ్రి ఫిర్యాదు చేశారు.

Updated Date - Sep 30 , 2026 | 06:24 AM