Share News

హౌసింగ్ మార్కెట్ హై

ABN , Publish Date - Aug 29 , 2026 | 06:52 AM

హైదరాబాద్‌ రియల్టీ మార్కెట్‌లో ఇళ్ల విక్రయాల పరంగా కొంత మందగమనం కనిపించినప్పటికీ.. మార్కెట్‌ మాత్రం వృద్ధి బాటలోనే కొనసాగుతోంది.. 2026 తొలి అర్ధభాగంలో (హెచ్‌1-సీవై26) నగరంలో 26,100 ఇళ్లు అమ్ముడయ్యాయి. వీటి విలువ రూ.52,900 కోట్లు. ప్రధాన నగరాలతో పోలిస్తే విక్రయాల పరంగా హైదరాబాద్‌ నాలుగో స్థానంలో నిలిచింది.

హౌసింగ్ మార్కెట్ హై
Credai meet

  • హైదరాబాద్‌లో ఇళ్ల విక్రయాలకు డిమాండ్‌

  • 2026 తొలి ఆర్నెల్లలో 26,100 ఇళ్ల విక్రయాలు..

  • వీటి విలువ 52,900 కోట్లు

  • ఫలితంగా దేశంలో నాలుగో స్థానం

  • విస్తీర్ణం పరంగా చూస్తే దేశంలో నంబర్‌ 1

  • ‘హైదరాబాద్‌ హౌసింగ్‌ రిపోర్ట్‌-2026’ను ఆవిష్కరించిన సీఎస్‌

  • రేటు ఆగదు.. డిమాండ్‌ తగ్గదు..

  • హైదరాబాద్‌ రియల్టీపై క్రెడాయ్‌ ధీమా

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ రియల్టీ మార్కెట్‌లో ఇళ్ల విక్రయాల పరంగా కొంత మందగమనం కనిపించినప్పటికీ.. మార్కెట్‌ మాత్రం వృద్ధి బాటలోనే కొనసాగుతోంది.. 2026 తొలి అర్ధభాగంలో (హెచ్‌1-సీవై26) నగరంలో 26,100 ఇళ్లు అమ్ముడయ్యాయి. వీటి విలువ రూ.52,900 కోట్లు. ప్రధాన నగరాలతో పోలిస్తే విక్రయాల పరంగా హైదరాబాద్‌ నాలుగో స్థానంలో నిలిచింది. మొత్తం విక్రయించిన విస్తీర్ణాన్ని పరిశీలిస్తే హైదరాబాద్‌ దేశంలోనే అగ్రస్థానంలో ఉండటం విశేషం. ఈ కాలంలో నగరంలో 60 మిలియన్‌ చదరపు అడుగుల సూపర్‌ బిల్ట్‌ అప్‌ ఏరియా అమ్ముడైంది. దీంతో పెద్ద ఇళ్లకు హైదరాబాద్‌ కొనుగోలుదారుల్లో ఉన్న డిమాండ్‌ మరోసారి స్పష్టమైంది. హైటెక్స్‌ వేదికగా జరిగిన క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో భాగంగా ‘హైదరాబాద్‌ హౌసింగ్‌ రిపోర్ట్‌-2026’ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు విడుదల చేశారు. దీని ప్రకారం 2026 జనవరి నుంచి జూన్‌ వరకు హైదరాబాద్‌లో 26,100 ఇళ్ల విక్రయాలు నమోదు కాగా, ఫుణె, బెంగళూరు, థానే నగరాల్లో విక్రయాలు ఎక్కువగా ఉండటంతో హైదరాబాద్‌ దేశంలోని టాప్‌-3 నగరాల జాబితాకు కొద్దిగా దూరమైంది. అయినా నగర రియల్టీ మార్కెట్‌లో ఉద్యోగాల సృష్టి, ఐటీ, కార్పొరేట్‌ రంగాల విస్తరణ, మౌలిక వసతుల అభివృద్ధి కారణంగా డిమాండ్‌ బలపడే అవకాశాలున్నాయని నివేదిక పేర్కొంది. ఇదేసమయంలో 49,656 కొత్త యూనిట్లు ప్రారంభమయ్యాయి. కొత్త సరఫరా గణనీయంగా ఉన్నా.. విక్రయాలు దానికి తగ్గ స్థాయి లో లేకపోవడంతో అమ్ముడుకాని ఇళ్ల నిల్వ కొంత పెరిగింది. హైదరాబాద్‌ హౌసింగ్‌ మార్కెట్‌లో అత్యంత ఆసక్తికరమైన అంశం ఇళ్లవిస్తీర్ణం. హెచ్‌1-సీవై26లో 60 మిలియన్‌ చదరపు అడుగుల సూపర్‌ బిల్టప్‌ ఏరియా అమ్ముడైంది. దేశంలో ఇదే అత్యధికం. యూనిట్ల సంఖ్యలో 4వ స్థానంలో ఉన్న నగరం, మొత్తం అమ్ముడైన విస్తీర్ణంలో మాత్రం నంబర్‌వన్‌ మార్కెట్‌గా నిలిచింది. నగరంలో కొనుగోలుదారులు చిన్న ఇళ్ల కంటే పెద్ద విస్తీర్ణం కలిగిన అపార్టుమెంట్లకు ప్రాధాన్యం ఇస్తున్నారనడానికి ఇదే నిదర్శనం!


270 మిలియన్‌ చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌

హైదరాబాద్‌ రియల్టీ మార్కెట్‌కు ప్రధాన బలం నగరంలోని ఆఫీస్‌ రంగమే. ప్రస్తుతం నగరంలో సుమారు 170 మిలియన్‌ చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌ పూర్తయి అందుబాటులో ఉండగా.. మరో 103 మిలియన్‌ చదరపు అడుగులు నిర్మాణంలో ఉన్నాయి. దీంతో పూర్తయిన, నిర్మాణంలో ఉన్న కార్యాలయ స్థలం కలిపి దాదాపు 270 మిలియన్‌ చదరపు అడుగులకు చేరుతోంది. 2026 తొలి అర్ధభాగంలోనే సుమారు 7 మిలియన్‌ చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ నమోదైంది. కొత్త కార్యాలయాలు, ఐటీ-టెక్‌ కంపెనీల విస్తరణ, ఉద్యోగావకాశాలు పెరగడం.. వీటి ప్రభావం వచ్చే ఐదేళ్లలో నివాస మార్కెట్‌పై కనిపించే అవకాశం ఉంది.

రేటు ఆగదు. డిమాండ్‌ తగ్గదు

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ నిరంతర వృద్ధి పథంలో కొనసాగుతోందని.. రేట్లు పెరుగుతు న్నా డిమాండ్‌లో మాత్రం తగ్గుదల లేదని క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రతినిధులు ధీమా వ్యక్తం చేశారు. ‘రేట్‌ ఆగదు.. డిమాండ్‌ తగ్గదు’ అనే థీమ్‌తో నిర్వహిస్తున్న క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రాపర్టీ షో-2026 శుక్రవారం హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో ప్రారంభమైంది. ఈ నెల 28 నుంచి 30 వరకు మూడు రోజులపాటు జరిగే ప్రదర్శనలో 60కి పైగా డెవలపర్లు 300కు పైగా రైరా ఆమోదిత ప్రాజెక్టులను ప్రదర్శిస్తున్నారు. ఒకే వేదికపై వివిధ ప్రాజెక్టులను పరిశీలించి, ధరలు, ప్రాంతం, సౌకర్యాలు తదితర అంశాలను పోల్చుకునే అవకాశం గృహ కొనుగోలుదారులకు కల్పించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు ప్రాపర్టీ షోను ప్రారంభించగా.. భువనగిరి ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ రెడ్డి గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంజయ్‌ జాజు మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో వ్యాపార వాతావరణం బలమైన వృద్ధిని, వేగాన్ని కనబరుస్తోందన్నారు. క్రెడాయ్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు ఎన్‌. జైదీప్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం, రియల్టీ పరిశ్రమ మధ్య గత ఏడాది కాలంగా జరుగుతున్న నిర్మాణాత్మక చర్చలు సానుకూలంగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఉన్న 10శాతం బిల్డింగ్‌ పర్మిట్‌ మార్టిగేజ్‌ను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. రేరా అమల్లో ఉన్న నేపథ్యంలో కనీసం దాన్ని 5శాతానికి తగ్గించినా బిల్డర్ల మూలధనం కొంత మేర విడుదలవుతుందని తెలిపారు.


ఉద్యోగాలే రియల్టీకి ఇంధనం

హైదరాబాద్‌లో ఐటీ, గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు, టెక్నాలజీ, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రంగాల విస్తరణ కొనసాగితే నగరంలో ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. కొత్తగా నగరానికి వచ్చే ఉద్యోగులు, ఇప్పటికే పనిచేస్తున్న వారి కుటుంబాల గృహ అవసరాలు పెరగడం ద్వారా నివాస మార్కెట్‌కు దీర్ఘకాలిక డిమాండ్‌ ఏర్పడుతోంది. ప్రస్తుతం కనిపిస్తున్న అధిక ఇన్వెంటరీని ఈ ఉద్యోగ ఆధారిత డిమాండ్‌ క్రమంగా శోషించే అవకాశం ఉందని నివేదిక వెల్లడించింది. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌ హౌసింగ్‌ మార్కెట్‌లో పెద్ద ఇళ్లకు ఉన్న ప్రాధాన్యం మరోసారి ఈ గణాంకాలతో బయటపడింది. సగటున 2300 చదరపు అడుగుల ఇంటి విస్తీర్ణం నమోదు కావడం.. నగరంలో ప్రీమియం, లగ్జరీ హౌసింగ్‌ విభాగానికి ఉన్న డిమాండ్‌ను సూచిస్తోంది. యూనిట్ల సంఖ్యలో నాలుగో స్థానం.. అమ్ముడైన విస్తీర్ణంలో మాత్రం మొదటి స్థానం సాధించడం హైదరాబాద్‌ రియల్టీ మార్కెట్‌లో కొనసాగుతున్న ’బిగ్‌ హోమ్‌‘ ట్రెండ్‌కు అద్దం పడుతోంది.

Updated Date - Aug 29 , 2026 | 06:53 AM