Share News

వినాయకా.. సెలవిక...!

ABN , Publish Date - Sep 25 , 2026 | 04:49 AM

కోట్లాది మంది భక్తులతో ఘనంగా పూజలందుకున్న విగ్నమూర్తి వినాయకుడు నేడు సెలవంటూ గంగమ్మ ఒడికి చేరనున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా గణపతి విగ్రహాల నిమజ్జనోత్సవం శుక్రవారం జరగనుంది.

వినాయకా.. సెలవిక...!
ganesh Nimajjanam

  • నేడు గణపతి నిమజ్జనోత్సవం

  • హైదరాబాద్‌లో శోభాయాత్రకు

విస్తృత ఏర్పాట్లు

  • మధ్యాహ్నంలోపు ఖైరతాబాద్‌

మహాగణపతి నిమజ్జనం

  • సోషల్‌ మీడియాలో రెచ్చగొట్టే

పోస్టులు పెడితే చర్యలు: సజ్జనార్‌

  • నేడు గణపతి మహా నిమజ్జనోత్సవం.. హైదరాబాద్‌లో శోభాయాత్రకు విస్తృత ఏర్పాట్లు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

కోట్లాది మంది భక్తులతో ఘనంగా పూజలందుకున్న విగ్నమూర్తి వినాయకుడు నేడు సెలవంటూ గంగమ్మ ఒడికి చేరనున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా గణపతి విగ్రహాల నిమజ్జనోత్సవం శుక్రవారం జరగనుంది. హైదరాబాద్‌లో గణేశ్‌ మహానిమజ్జనానికి, అంగరంగవైభంగా సాగే శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే హుస్సేన్‌సాగర్‌ తీరం జనసంద్రంగా మారింది. నగరంలోని ప్రధాన నిమజ్జన కేంద్రాల వద్ద కూడా పరిస్థితి అలాగే ఉంది. ఎన్టీఆర్‌ మార్గ్‌, ట్యాంక్‌బండ్‌, పీపుల్స్‌ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన క్రేన్ల వద్ద ఏకదంతుడి విగ్రహాలు బారులు తీరుతున్నాయి. హుస్సేన్‌సాగర్‌తోపాటు హైదరాబాద్‌లో 140 చోట్ల విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. ఇందులో 20 వరకు ప్రధాన నిమజ్జన కేంద్రాలు ఉంటాయని అధికారులు తెలిపారు. ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇక్కడ ఉదయం 7 గంటలకే శోభాయాత్రను ప్రారంభించాలని భావిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల్లోపు మహాగణపతి నిమజ్జనం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బాలాపూర్‌ గణపతి శోభాయాత్రను ఉదయమే ప్రారంభించేలా ఏర్పాట్లు చేసుకోవాలని పోలీసులు నిర్వాహకులకు సమాచారమిచ్చారు. నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో 45 చోట్ల ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటుచేశారు. మరో 25 ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులలో అత్యవసర వైద్య సేవలకు ఏర్పాట్లు చేశారు. ఎవరైనా భక్తులు అస్వస్థతకు గురైతే వెంటనే ఆస్పత్రికి తరలించడానికి 20 అంబులెన్సులను ప్రధాన ప్రాంతాల్లో అందుబాటులో ఉంచారు. ప్రధాన నిమజ్జన కేంద్రాల వద్ద హైడ్రా గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచింది. మెట్రోరైలు, ఎంఎంటీఎస్‌ సర్వీసులు శుక్రవారం అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉండనున్నాయి.


పరీక్షలు వాయిదా..

గణేశ్‌ నిమజ్జనం నేపథ్యంలో ప్రభుత్వం శుక్రవారం సెలవు ప్రకటించడంతో ఉస్మానియా, జేఎన్టీ యూనివర్సిటీల పరిధిలో నేడు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేశారు. వాయిదా పడిన పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహించే అంశంపై త్వరలోనే ప్రకటన చేస్తామని ఓయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్‌ బి.సుధాకర్‌ రెడ్డి, జేఎన్టీయూ పరీక్షల విభాగం డైరెక్టర్‌ కృష్ణమోహనరావు గురువారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు.

సోషల్‌ మీడియా ఖాతాలపై నిఘా

నిమజ్జన వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ భక్తులకు సూచించారు. సమాజంలో విద్వేషాలు, ఉద్రిక్తతలు సృష్టించేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టొద్దని కోరారు. పోలీసులు సైతం ప్రజలతో మర్యాదగా నడుచుకోవాలని ఆదేశించారు. సోషల్‌ మీడియాను ఐటీ సెల్‌, స్థానిక పోలీసులు 24/7 పర్యవేక్షిస్తారని, రెచ్చగొట్టే కంటెంట్‌ వ్యాప్తిచేేస వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెచ్చగొట్టే పోస్టులతో పాటు అక్రమ బెట్టింగ్‌, మోసపూరిత పెట్టుబడుల ప్రమోషన్‌, అశ్లీల కంటెంట్‌ వెబ్‌సైట్లను ప్రచారం చేస్తున్న 1,317 సోషల్‌ మీడియా ప్రొఫైల్స్‌ను ఇప్పటికే తొలగించామని, 9ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి

ఎల్‌నినోపై ‘ఉపాధి’ అస్త్రం

ఊపందుకున్న ఉపాధి పనులు

Updated Date - Sep 25 , 2026 | 04:49 AM