Share News

ఊపందుకున్న ఉపాధి పనులు

ABN , Publish Date - Sep 25 , 2026 | 12:49 AM

గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించడంతోపాటు గ్రామాల్లో శాశ్వత నిర్మాణానికి దోహదపడుతున్న ఉపాధిహామీ పథకం కొత్త రూపు సంతరించుకుంది.

 ఊపందుకున్న ఉపాధి పనులు

పెద్దపల్లి, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించడంతోపాటు గ్రామాల్లో శాశ్వత నిర్మాణానికి దోహదపడుతున్న ఉపాధిహామీ పథకం కొత్త రూపు సంతరించుకుంది. ఇప్పటివరకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంగా కొనసాగిన ఈ కార్యక్రమం 2026 జూలై 1 నుంచి ’వికసిత్‌ భారత్‌ గారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ ఆజీవికా మిషన్‌ (గ్రామీణ్‌) వీబీజీ రామ్‌ జీ పేరుతో అమల్లోకి వచ్చింది. కొత్త చట్టంలో అర్హత కలిగిన గ్రామీణ కుటుంబానికి ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల వరకు ఉపాధి కల్పించే నిబంధన ఉంది.

జిల్లాలో వ్యవసాయ పనులు లేని సమయంలో ఉపాధి పనులు కీలకంగా మారుతున్నాయి. చెరువులు, కుంటలు, కాలువలు, నీటి నిల్వ ప్రాంతాల అభివృద్ధి, భూసంరక్షణ, మొక్కల పెంపకం, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి వంటి పనులు గ్రామాల్లో చేపట్టే అవకాశం ఉంది. కొత్త చట్టం కింద నీటి భద్రత, గ్రామీణ మౌలిక వసతులు, జీవనోపాధికి సంబంధించిన వసతులు, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల ప్రభావాన్ని తగ్గించే పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

ఫ వర్షాలు.. పనుల ఎంపికకు కీలకం

జిల్లాలో వర్షాల పరిస్థితి కూడా ఉపాధి పనుల ఎంపికలో కీలకంగా మారే అవకాశం ఉంది. ఆగస్టులో జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. గత మూడు రోజులుగా జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. వర్షపు నీటిని నిల్వ చేయడం, భూగర్భ జలాలను పెంచడం, చెరువులు, కుంటలను పునరుద్ధరించడం, నీటి ప్రవాహ మార్గాలను మెరుగుపరచడం, మట్టి కోతను అరికట్టడం వంటి పనులకు ప్రాధాన్యం ఇస్తే ఒకవైపు కూలీలకు ఉపాధితో పాటు మరోవైపు గ్రామాలకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.

ఫగ్రామ అవసరాల ఆధారంగానే పనుల ఎంపిక

గ్రామ అవసరాలను గుర్తించి పనుల ప్రణాళిక రూపొందించడంపై దృష్టి సారిస్తోంది. గ్రామపంచాయతీ ప్రణాళికలను జిఐఎస్‌ ఆధారిత సమాచారంతో అనుసంధానం చేసి, వాటిని మండల, జిల్లా స్థాయి ప్రణాళికల్లో భాగం చేసే విధానం తీసుకొస్తున్నారు. దీంతో కేవలం కూలీలకు పనులు కల్పించడమే కాకుండా గ్రామానికి ఉపయోగపడే శాశ్వత ఆస్తులు సృష్టించడం ప్రధాన లక్ష్యంగా మారనుంది. నీటి సమస్య ఉన్న గ్రామంలో నీటి సంరక్షణ పనులు, వ్యవసాయ భూములకు అవసరమైన చోట భూసంరక్షణ పనులు, గ్రామీణ రహదారులు లేదా ఇతర మౌలిక వసతులు అవసరమైన చోట వాటికి సంబంధించిన పనులను ప్రణాళికలో చేర్చే అవకాశం ఉంటుంది.

ఫకూలీలకు పెరిగిన ఉపాధి

గతంలో ఉపాధిహామీ కింద ఒక కుటుంబానికి సంవత్సరానికి 100 రోజుల ఉపాధిహామీ ఉండగా, కొత్త వీబీ జీ రామ్‌ జీ చట్టంలో దానిని 125 రోజులకు పెంచారు. పని కోరిన గ్రామీణ కుటుంబాలకు నిర్దేశిత సమయంలో ఉపాధి కల్పించకపోతే నిరుద్యోగ భృతి కల్పించే నిబంధన కూడా ఉంది. కూలీల వేతనాల ఆలస్యానికి పరిహారం చెల్లించే నిబంధనను కూడా కొత్త చట్టం కల్పిస్తోంది. అన్‌స్కిల్‌ కూలీలకు రోజువారీ వేతనాన్ని రూ.308గా ఉంది.

ఫమహిళలకు కూడా ఉపాధి అవకాశాలు

జిల్లాలో వ్యవసాయ పనులపై ఆధారపడే గ్రామీణ కుటుంబాల్లో మహిళల పాత్ర అధికంగా ఉంటుంది. వ్యవసాయ పనులు లేని సమయంలో మహిళలకు ఆదాయ మార్గం లభిస్తుంది. పాత పథకం అమలులో కూడా మహిళల భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఉండేది. పని కోరే గ్రామీణ కుటుంబాలు గ్రామపంచాయతీ ద్వారా నమోదు చేసుకుని జాబ్‌కార్డు పొందే విధానం ఉంది.

ఫ జిల్లాలో 1,18,953 జాబ్‌కార్డులు

జిల్లాలో ఇప్పటి వరకు లక్షా 18 వేల 953 జాబ్‌ కార్డులు జారీచేశారు. ఇందులో మొత్తం 2 లక్షల 39 వేల777 మంది కూలీలు పేర్లను నమోదు చేసుకున్నారు. జిల్లాలో 263 గ్రామ పంచాయతీలు ఉండగా 148 గ్రామ సభలు పూర్తయ్యాయి. కూలీలకు కల్పించే పనులు, వాటి పై అవగాహన అంశాలను వివరిస్తున్నారు. ముఖ్యంగా వర్షపు నీటిని ఒడిసిపట్టే పనులు, చెరువులు కుంటల పునరుద్ధరణ, వ్యవసాయ భూముల అభివృద్ధి, మొక్కల పెంపకం, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి వంటి పనులకు ప్రాధాన్యం ఇస్తే ఉపాధితోపాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.

Updated Date - Sep 25 , 2026 | 12:49 AM