Share News

సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా

ABN , Publish Date - Sep 25 , 2026 | 05:18 AM

పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని ఖైరతాబాద్‌ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసినప్పుడే ఈ పరిణామాన్ని ఊహించానని, ఇప్పుడు అదే జరిగిందని చెప్పారు.

 సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా
danamnagendra

  • ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటా

  • ఈ పరిణామాన్ని ముందే ఊహించా

  • ప్రజల ఆశీస్సులు నాకే: దానం నాగేందర్‌

బంజారాహిల్స్‌, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని ఖైరతాబాద్‌ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసినప్పుడే ఈ పరిణామాన్ని ఊహించానని, ఇప్పుడు అదే జరిగిందని చెప్పారు. రాజ్యాంగబద్ధంగా, న్యాయపరంగా పోరాటం చేయడంలో ఎలాంటి తప్పూ లేదని, అందుకే న్యాయస్థానాన్ని ఆశ్రయించానన్నారు. గురువారం సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన అనంతరం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. పదో షెడ్యూల్‌ ప్రకారం ఊరట లభిస్తుందని భావించానని, అయితే న్యాయస్థానం మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసుకోవచ్చని పేర్కొన్న నేపథ్యంలో తీర్పును గౌరవిస్తానని చెప్పారు. ‘నేను ఎప్పుడూ ప్రజల మనిషినే. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉన్నా.. మళ్లీ ప్రజాక్షేత్రంలోకే వెళ్లి తేల్చుకుంటాన’ని అన్నారు. ఇకపై నియోజకవర్గానికే పరిమితమై పనిచేస్తానని చెప్పారు. ఇప్పటి వరకు రాజకీయంగా తానెవర్నీ కలవలేదని, తీర్పు కోసమే ఇన్నాళ్లూ వేచి చూశానన్నారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యాక ఏ పార్టీ నుంచి బరిలోకి దిగాలనే దానిపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ప్రజల్లో ఉండే నాయకులకు పార్టీలతో సంబంధం లేకుండా విజయం దక్కుతుందన్న నమ్మకం తనకుందని, ఈసారి కూడా ఖైరతాబాద్‌ ప్రజల ఆశీసులు తనకే ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నికలొస్తే నియోజకవర్గంలో మిగిలిపోయిన అభివృద్ధి పనులన్నీ శరవేగంగా పూర్తవుతాయని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని ప్రజా సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

ఎల్‌నినోపై ‘ఉపాధి’ అస్త్రం

ఊపందుకున్న ఉపాధి పనులు

Updated Date - Sep 25 , 2026 | 05:18 AM