మీ పనితీరే మీకు రక్ష
ABN , Publish Date - Mar 04 , 2026 | 02:43 AM
జిల్లాల్లో మిల్లర్ల అక్రమ వ్యవహారాలు, మైనింగ్ మాఫియాపై కలెక్టర్లుగా మీరు చర్యలు తీసుకోకపోయినా, వారిపై కేసులు పెట్టకపోయినా..
ఎవరో చెప్పారని తప్పులు చేయొద్దు
ఇసుక మాఫియా, అక్రమ మైనింగ్‌పై కఠినంగా వ్యవహరించకపోతే సస్పెండ్ చేస్తా
నెలలో 10 రోజులు క్షేత్రస్థాయిలో తిరగాల్సిందే..
కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలు
వివిధ అంశాలపై అధికారులకు కీలక సూచనలు
హైదరాబాద్, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): ‘జిల్లాల్లో మిల్లర్ల అక్రమ వ్యవహారాలు, మైనింగ్ మాఫియాపై కలెక్టర్లుగా మీరు చర్యలు తీసుకోకపోయినా, వారిపై కేసులు పెట్టకపోయినా.. నేను మీపై చర్యలు తీసుకుంటా. తప్పదనుకుంటే మిమ్మల్ని నేనే సస్పెండ్ చేస్తా. వాళ్లో వీళ్లో చెప్పారని, సిఫారసు చేశారని తప్పులు చేయొద్దు’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కలెక్టర్లను హెచ్చరించారు. ఇటీవల చేసిన కలెక్టర్ల బదిలీల్లోనూ తాను ఎవరి సిఫారసులను పట్టించుకోలేదని, కలెక్టర్ల పనితీరు, క్షేత్రస్థాయి పరిశీలనలకు వెళ్లారా? లేదా? అనేది పరిశీలించి బదిలీ చేశానని స్పష్టం చేశారు. ఇకపైనా ఇదే తీరుతో వ్యవహరిస్తామని, పనితీరే అధికారులకు రక్ష అని తేల్చిచెప్పారు. ‘ప్రభుత్వం మిమ్మల్ని నిశితంగా గమనిస్తుంది. మీరు మంచి పని చేస్తే అభినందిస్తుంది. వార్షిక పర్‌ఫార్మెన్స్ రిపోర్ట్ ఆధారంగా మీ పనితీరు తెలుసుకుంటాం. జూన్‌లో కలెక్టర్ల పనితీరుపై మరోసారి సమావేశం నిర్వహిస్తాం’ అని సీఎం అన్నారు. మంగళవారం సచివాలయంలో కలెక్టర్లతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. క్షేత్రస్థాయిలో పర్యటించకపోతే కలెక్టర్లకు ప్రజా సమస్యలు తెలియవని, నెలలో కనీసం పది రోజులైనా గ్రామాల్లో పర్యటించాల్సిందేనని స్పష్టం చేశారు. ఇక, శాఖల వారీగా పది వారాల పాటు అమలు చేసే ప్రత్యేక కార్యాచరణ అందరినీ ఆకట్టుకోవాలని, ప్రతీ జిల్లాకో సీనియర్ ఐఏఎస్ అధికారిని నోడల్ ఆఫీసర్‌గా నియమించాలని సీఎం ఆదేశించారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్నారు. రాష్ట్రంలో రూ.3900కోట్ల విలువైన బియ్యం మిల్లర్ల దగ్గరే ఉందని, వాటిని రికవరీ చేసే బాధ్యత కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు బాధ్యతను ఓ అధికారికి ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఆ అధికారి విద్యార్థులతోపాటు పాఠశాలలోనే భోజనం చేయాలని, కలెక్టర్ కూడా వారానికోసారి ప్రభుత్వ పాఠశాలలో భోజనం చేయాలని స్పష్టం చేశారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఎక్కడ ఏర్పాటు చేయాలో ఖరారు చేస్తూ నివేదిక ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు. వచ్చే విద్యా ఏడాది తొలి రోజైన జూన్ 12న రాష్ట్రంలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందజేసేందుకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అలాగే, పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నామన్నారు. ఏటా సీఎంఆర్‌ఎఫ్, ఆరోగ్య శ్రీ కోసం దాదాపు రూ.2,500 కోట్లు ఖర్చు పెడుతోందన్నారు. సనత్‌నగర్, అల్వాల్ టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్నారు.
భూసేకరణలో జాప్యంపై ఆగ్రహం..!
రీజినల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీ, మామునూరు, ఆదిలాబాద్ విమానాశ్రయం సహా ప్రభుత్వం చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. అయితే, జాతీయ రహదారులు, ఆర్‌ఆర్‌ఆర్ భూసేకరణలో జాప్యంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ నిర్లక్ష్యం కొనసాగితే జూన్ తర్వాత కలెక్టర్లుగా కొనసాగించేది లేదని తేల్చిచెప్పినట్టు తెలిసింది. రాష్ట్రంలో దాదాపు 1.70 లక్షల మంది ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులుంటే అందులో దాదాపు 25 వేల మంది కనీసం ఆధార్ కార్డు కూడా లేకుండా బోగస్ ఉద్యోగులుగా ఇంతకాలం జీతం తీసుకున్నట్టు గుర్తించారని అన్న సీఎం.. కలెక్టర్లు కళ్లుమూసుకొని ఉన్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ దందాకు పాల్పడ్డ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.