మండలి భేటీలూ.. ఇక అసెంబ్లీ భవనంలోనే
ABN , Publish Date - Mar 09 , 2026 | 03:58 AM
తెలంగాణ శాసనమండలి సమావేశాలు కూడా ఇకపై అసెంబ్లీ భవనంలోనే జరగనున్నాయి. ఈ నెల 16న ప్రా రంభం కానున్న బడ్జెట్ సమావేశాల నుంచే ఇది అమల్లోకి రానుంది.
పునరుద్ధరించిన శాసనమండలి హాల్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
16 నుంచి బడ్జెట్ సమావేశాలు
హైదరాబాద్, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ శాసనమండలి సమావేశాలు కూడా ఇకపై అసెంబ్లీ భవనంలోనే జరగనున్నాయి. ఈ నెల 16న ప్రా రంభం కానున్న బడ్జెట్ సమావేశాల నుంచే ఇది అమల్లోకి రానుంది. ఈ మేరకు అసెంబ్లీ భవనంలో పునరుద్ధరించిన మండలి సమావేశ మందిరాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఆ మందిరానికి అనుబంధంగా పునరుద్ధరించిన తన చాంబర్‌ను, చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి చాంబర్‌ను, మంత్రులు, మండలి సభ్యుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లాంజ్‌లను సీఎం పరిశీలించారు. తన కోసం ఏర్పాటు చేసిన చాంబర్‌లో ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్, మంత్రులు, ఇతర ఆహ్వానితులతో కొద్దిసేపు సమావేశమయ్యారు. పార్లమెంటు తరహాలో అసెంబ్లీ ప్రాంగణంలోనే కాన్‌స్టిట్యూషన్ క్లబ్ నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. అలాగే అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈ నెల 16న కొత్త గవర్నర్‌తో ఆవిష్కరింపజేసుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ ప్రసాద్‌కుమార్, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రు లు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, జూ పల్లి కృష్ణారావు, అజారుద్దీన్, దామోదర రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
పార్లమెంటు తరహాలో..
లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలు పార్లమెంటు భవనంలో జరుగుతున్నట్లుగానే.. ఇకపై తెలంగాణ అసెంబ్లీ భవనంలోనే శాసనసభ, మండలి సమావేశాలు నిర్వహించనున్నారు. శాసనసభ, మండలి హాళ్లకు మధ్య ఉన్న ప్రాంతంలో అసెంబ్లీ సెంట్రల్ హాల్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ తరహా ఏర్పాట్లతో సీఎం, మంత్రులు, అసెంబ్లీ సిబ్బందికి సమయం ఆదా కానుందని, సమావేశాల వ్యయం కూడా తగ్గనుందని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. కాగా.. శాసనమండలి హాల్‌ను అధునాతన సౌకర్యాలతో పునరుద్ధరించారు.