Share News

నెట్‌ఫ్లిక్స్‌ వచ్చిందంటే హాలీవుడ్‌ వచ్చినట్లే!

ABN , Publish Date - Mar 13 , 2026 | 04:55 AM

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ హైదరాబాద్‌కు వచ్చిందంటే హాలీవుడ్‌ వచ్చినట్లేనని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వ దృష్టి మొత్తం హాలీవుడ్‌పైనే అని గతంలో ఎన్నోసార్లు చెప్పానని..

నెట్‌ఫ్లిక్స్‌ వచ్చిందంటే హాలీవుడ్‌ వచ్చినట్లే!

  • నెట్‌ఫ్లిక్స్‌ ఐలైన్‌ స్టూడియో ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ హైదరాబాద్‌కు వచ్చిందంటే హాలీవుడ్‌ వచ్చినట్లేనని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వ దృష్టి మొత్తం హాలీవుడ్‌పైనే అని గతంలో ఎన్నోసార్లు చెప్పానని.. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌ రాకతో ఆ కల నెరవేరబోతోందని తెలిపారు. వినోద రంగంలో హైదరాబాద్‌ దూసుకెళ్తోందని, హాలీవుడ్‌ స్థాయికి చేరుతుందని చెప్పారు. గురువారం హైటెక్‌ సిటీలో మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి నెట్‌ఫ్లిక్స్‌కు చెందిన ఐలైన్‌ స్టూడియోను రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తనకు సినిమాలంటే చాలా ఇష్టమన్నారు. బాల్యం నుంచి ఇప్పటి వరకు సినిమా రంగంలో అనేక మార్చులు వచ్చాయని చెప్పారు. అత్యున్నత సాంకేతికతతో కూడిన బాహుబలి, కల్కి, ఆర్‌ఆర్‌ఆర్‌, అరుంధతి వంటి సినిమాలు వచ్చాయని తెలిపారు. చెన్నైలో ఉన్న సినిమా పరిశ్రమను ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌, రామానాయుడు హైదరాబాద్‌కు తీసుకొచ్చి, స్టూడియోలు నిర్మించారని గుర్తుచేశారు. వినోద రంగంలో ప్రసిద్ధి చెందిన నెట్‌ఫ్లిక్స్‌ ఐలైన్‌ స్టూడియో హైదరాబాద్‌కు రావడం హర్షణీయమన్నారు. డీవీడీ అద్దెకిచ్చే సంస్థ నుంచి ప్రపంచ నంబర్‌ వన్‌ ఓటీటీ లీడర్‌గా, మీడియా స్టూడియోగా నెట్‌ఫ్లిక్స్‌ ఎదిగిందని చెప్పారు. ఈ విషయంలో నె ట్‌ఫ్లిక్స్‌కు, హైదరాబాద్‌కు సారూప్యత ఉందన్నారు. నెట్‌ఫ్లిక్స్‌ లాగానే హైదరాబాద్‌ కూడా దినదిన ప్రవర్థమానంగా ఎదుగుతోందని తెలిపారు. నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ రాకతో ప్రపంచ ప్రేక్షకులకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేసే గొప్ప అవకాశం లభించినట్లయిందని అన్నారు.


ఫోర్త్‌ సిటీలో నెట్‌ఫ్లిక్స్‌కు భూమి కేటాయిస్తాం

నెట్‌ఫ్లిక్స్‌ ఇటీవల క్రీడలపై చాలా దృష్టి పెట్టినట్లు తెలిసిందని సీఎం రేవంత్‌ అన్నారు. రాబోయే రోజుల్లో అది క్రీడా ప్రసార సంస్థగా మారుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడలపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించిందన్నారు. అందులో భాగంగానే క్రీడా మౌలిక సదుపాయాల కల్పన, క్రీడా వర్సిటీ ఏర్పాటుతో పాటు క్రీడలకు సంబంధించి అన్ని స్థాయుల్లో ప్రతిభను ప్రోత్సహి స్తున్నామని చెప్పారు. ఇందుకు నెట్‌ఫ్లిక్స్‌ సహకారం కూడా కావాలన్నారు. ప్రపంచ వినోద రంగంలో భారత్‌, తెలంగాణ ఎలాంటి పాత్రను పోషించబోతున్నాయో తెలిపేందుకు ఈ రోజు జరిగిన కార్యక్రమమే గొప్ప ఉదాహరణ అని సీఎం పేర్కొన్నారు. రానున్న రోజుల్లో నెట్‌ఫ్లిక్స్‌ కార్పొరేట్‌ ఆఫీసును తాము నిర్మిస్తున్న ఫోర్త్‌ సిటీకి తీసుకురావాలని, వారి ఆఫీసు విస్తరణకు కావాల్సిన భూమిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రపంచంలోని ఫార్చ్యూన్‌ 500 కంపెనీలను తెలంగాణకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ అంటేనే వ్యాపారానికి అనుకూలమైన ప్రాంతమని, ఇక్కడ పారిశ్రామికవేత్తల పెట్టుబడులకు పూర్తి రక్షణ ఉంటుందని తెలిపారు.

ఏవీజీ గ్లోబల్‌ లీడర్‌గా హైదరాబాద్‌: దుద్దిళ్ల

యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, గేమింగ్‌, కామిక్స్‌ (ఏవీజీ) రంగంలో హైదరాబాద్‌ను గ్లోబల్‌ లీడర్‌గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. హైదరాబాద్‌కు నెట్‌ఫ్లిక్స్‌ రాకతో సినిమా స్టోరీ టెల్లింగ్‌లో ‘తెలంగాణ’ బ్రాండ్‌ ప్రపంచవ్యాప్తంగా మరింత పెరుగుతుందన్నారు. పరిశ్రమల భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీలో భాగస్వామ్యం కావాలని నెట్‌ఫ్లిక్స్‌ ప్రతినిధులను కోరారు. ‘భారత్‌ ఫ్యూచర్‌ సిటీ’లో స్టూడియోను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని ఆహ్వానించారు. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, గేమింగ్‌ (ఏవీజీ) రంగంలో 10 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని సినీ నటుడు రానా దగ్గుపాటి చెప్పారు. నవకల్పనలను ప్రోత్సహిస్తూ సినిమా రంగాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. తెలుగు సినీ రంగం ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతోందన్నారు. నెట్‌ఫ్లిక్స్‌ రాక కంటెంట్‌ సృష్టికర్తలకు చాలా ఉపయోగకరం కానుందని చెప్పారు.

Updated Date - Mar 13 , 2026 | 04:55 AM