అమ్మో బుల్లెట్ రైలు!
ABN , Publish Date - Sep 25 , 2026 | 02:46 AM
ఎక్కడైనా ఒక ప్రాంతంలో ‘బుల్లెట్ రైలు’ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు వస్తున్నాయంటే.. ఆ చుట్టు పక్కల భూముల ధరలకు రెక్కలు వచ్చిపడతాయి. కొనుగోలు - విక్రయాలు ఒక్కసారిగా ఊపందుకుంటాయి.
భూ యజమానుల గుండెల్లో గుబులు
కారిడార్ల అలైన్‌మెంట్లపై గందరగోళం
సోషల్ మీడియాలో లేనిపోని ప్రచారం
దడపుట్టిస్తున్న ‘ఎల్లో మార్కింగ్’
క్రయ విక్రయాలపై తీవ్ర ప్రభావం
వెనక్కి తగ్గుతున్న కొనుగోలుదారులు
భూయజమానులు,
రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఆందోళన
ప్రభుత్వం స్పష్టతనిస్తే అయోమయానికి
చెక్ పడుతుందన్న అభిప్రాయం
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఎక్కడైనా ఒక ప్రాంతంలో ‘బుల్లెట్ రైలు’ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు వస్తున్నాయంటే.. ఆ చుట్టు పక్కల భూముల ధరలకు రెక్కలు వచ్చిపడతాయి. కొనుగోలు - విక్రయాలు ఒక్కసారిగా ఊపందుకుంటాయి. ఆ ప్రాంతం సందర్శకులతో సందడిగా మారిపోతుంది. కానీ, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో హైస్పీడ్ బుల్లెట్‌ప్రాజెక్టు గుబులు పుట్టిస్తోంది. రియల్ ఎస్టేట్ డెవలపర్లకే కాదు, భూ యజమానులు, కొనుగోలు దారుల్లోనూ దీనిపై గందరగోళం, అయోమయం, ఆందోళన నెలకొన్నాయి. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా చేసుకుని మూడు హైస్పీడ్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు కారిడార్లను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించడం తెలిసిందే. ఇందులో హైదరాబాద్-చెన్నై ప్రాజెక్టు.. శంషాబాద్ వయా ఫ్యూచర్ సిటీ, అమరావతి మీదుగా చెన్నైకు వెళుతుంది. అలాగే, హైదరాబాద్-బెంగళూరు హైస్పీడ్ రైలు ప్రాజెక్టు సైతం శంషాబాద్ నుంచి వయా ఫ్యూచర్ సిటీ బెంగళూరు వెళ్లేలా ప్రతిపాదించారు. ఇక మూడో ప్రాజెక్టు హైదరాబాద్ ముంబై మధ్య రానుంది. దీనికి పెద్ద ఎత్తున భూసేకరణ అవసరం. దీంతో ఎవరి భూములకు ఎసరు వస్తుందోనన్న ఆందోళన క్రయ విక్రయాలకు ప్రతికూలంగా మారిందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. వీటికి తోడు ఓఆర్‌ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్‌కు మధ్య ప్రతిపాదించిన 2రేడియల్ రోడ్లు, ఇతర ప్రాజెక్టుల కోసం ఈ ప్రాంతాల్లోనే పెద్దమొత్తంలో భూసేకరణ చేయాల్సి ఉంది.
అలాగే, మెట్రో ఫేజ్-2, హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్ల అలైన్‌మెంట్‌లు ఒకే ప్రాంతాల మీదుగా వెళ్తుండడం అయోమయానికి తావిస్తోంది. ప్రతిపాదిత మార్గాలపై ప్రాథమిక సర్వేలు, మార్కింగ్‌లు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మ్యాపులు భూముల క్రయవిక్రయాలపై ప్రభావం చూపిస్తున్నా యి. కారిడార్ ఎక్కడి నుంచి వెళుతోంది? ఎక్కడ భూ సేకరణ ఉంటుంది?అన్న దానిపై స్పష్టమైన సమాచారంలేక కొనుగోలుదారులు వెనకడుగు వేస్తున్నారు.
అస్పష్టత.. అయోమయం
హైస్పీడ్ రైలు వంటి భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులు వస్తే ఆయా ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయనడంలో సందేహం లేదు. నివాస ప్రాజెక్టులు, కంపెనీలు, వాణిజ్య సముదాయాలు, విద్యా సంస్థల రాకతో.. అన్ని విధాలుగా అభివృద్ధికి నోచుకుంటాయి. కానీ బుల్లెట్ రైలు కారిడార్ల అలైన్‌మెంట్, భూసేకరణ పరిధి, ప్రభావిత సర్వే నంబర్లు వంటి అంశాలపై స్పష్టత లేకపోవడం రియల్ ఎస్టేట్ మార్కెట్ వృద్ధికి ప్రతికూలంగా మారుతోంది. హైస్పీడ్ రైలు అలైన్‌మెంట్‌కు సంబంధించి ప్రచారంలో ఉన్న మ్యాపుల్లో.. రెడ్ లైన్‌తో పాటు ఎల్లో మార్కింగ్‌లు కనిపిస్తున్నాయి. మ్యాప్‌లో ఎల్లో లైన్ కనిపిస్తే చాలు.. బుల్లెట్ రైలు ప్రాజెక్టు పరిధిలోకి తమ భూమి వస్తుందని భూయజమానులు హడలిపోతున్నారు. మరోవైపు ఇదే పరిస్థితిని అనుకూలంగా మలుచుకుని, ధరలను తగ్గించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని కొందరు భూయజమానులు ఆరోపిస్తున్నారు. ఎలివే టెడ్ కారిడార్‌గా (పూర్తిగా పిల్లర్ల మీద) నిర్మించే హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టు కోసం 18 నుంచి 20 మీటర్ల వెడల్పు మేర భూసేకరణ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రతిపాదిత మూడు హైస్పీడ్ రైల్వే కారిడార్‌ల అలైన్‌మెంట్‌లలో ఇంతకుమించి ఎక్కువ వెడల్పుతో ఎల్లో కలర్ మార్కింగ్ చేయడంతోనే సమస్య తలెత్తుతోందనే అభిప్రాయాన్ని ఇంజనీర్లు వ్యక్తం చేస్తున్నారు.
7 మండలాల్లోని భూములపై ప్రభావం..
హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టు పూర్తిగా నగర శివారు ప్రాంతాలు, ఔటర్ రింగు రోడ్డు బయట ఉన్న గ్రామాల మీదుగానే వెళుతోంది. దీంతో.. శంకర్‌పల్లి, మొయినాబాద్, శంషాబాద్, మహేశ్వరం, కందుకూరు, ఇబ్రహీంపట్నం, యాచారం వంటి 7 మండలాల్లో పరిధిలోని భూముల క్రయ విక్రయాలపై ప్రభావం చూపుతోందని రియల్ ఎస్టేట్ వర్గాలు పేర్కొంటున్నారు. హైస్పీడ్ రైలు కారిడార్‌కు సంబంధించిన అధికారిక ప్రాథమిక అలైన్‌మెంట్, సర్వే నంబర్లు, భూసేకరణ పరిధిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని భూయజమానులు, రియల్ ఎస్టేట్ వర్గాలు కోరుతున్నాయి. అప్పుడే క్రయవిక్రయాలపై సరైన నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఒప్పందాలు రద్దు..
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం సురంగల్ రెవెన్యూ పరిధిలో ఎకరాకు రూ.2-2.5 కోట్ల ధరపై అగ్రిమెంట్ దశకు చేరిన కొన్ని లావాదేవీలు చివరి నిమిషంలో నిలిచిపోయినట్లు రియల్ ఎస్టేట్ వర్గాలు వెల్లడించాయి. బుల్లెట్ రైలు అలైన్‌మెంట్ రేపు ప్రాజెక్టు పరిధిలోకి వస్తే పరిస్థితి ఏమిటన్న సందేహంతో కొనుగోలుదారులు వెనక్కి తగ్గుతున్నారని తెలిపాయి. హైస్పీడ్ రైలు ప్రాజెక్టులు వ్యవసాయ భూములతోపాటు తుక్కుగూడ, పెద్ద గోల్కొండ, బహదూర్‌గూడ తదితర ప్రాంతాల్లోని గేటెడ్ కమ్యూనిటీలు, విల్లా ప్రాజెక్టులపైనా కొంతమేర ప్రభావం చూపిస్తున్నట్లు వెల్లడించాయి. మరోవైపు బుల్లెట్ రైలు కారిడార్‌పై స్పష్టత కోరుతూ కొందరు భూ యజమానులు సమాచార హక్కు చట్టం ద్వారా ఆయా శాఖలను సంప్రదించగా.. ప్రస్తుతానికి ప్రాజెక్టు ప్రతిపాదనల దశలోనే ఉందన్న సమాచారం వచ్చింది. అయినా క్షేత్రస్థాయిలో సర్వేలు, మార్కింగ్‌లు జరుగుతున్నాయన్న ప్రచారం భూ యజమానులను ఆందోళనకు గురిచేస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి