సౌర, పవన విద్యుత్ ప్లాంట్లకు బ్యాటరీ నిల్వ తప్పనిసరి
ABN , Publish Date - Sep 05 , 2026 | 06:58 AM
సౌర, పవన విద్యుత్ ప్లాంట్లు ఇక నుంచి కేవలం విద్యుత్ ఉత్పత్తికే పరిమితం కాబోవు. ఉత్పత్తి చేసిన కరెంటులో కొంత భాగాన్ని నిల్వ చేసుకొనే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్(బీఈఎ్‌సఎస్) విధిగా ఏర్పాటు చేసుకోవాల్సిందేనని కేంద్ర విద్యుత్ సంస్థ(సీఈఏ) స్పష్టం చేసింది.
ప్లాంట్ సామర్థ్యంలో కనీసం
10శాతం స్టోరేజీ ఉండాల్సిందే
వచ్చే జూలై నుంచి 2 గంటలు,
2029 నుంచి 4 గంటలు
15శాతం ఇన్వర్టర్లకు గ్రిడ్‌ను
కాపాడే టెక్నాలజీ ఉండాలి
ముసాయిదా నిబంధనలు
విడుదల చేసిన సీఈఏ
హైదరాబాద్, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): సౌర, పవన విద్యుత్ ప్లాంట్లు ఇక నుంచి కేవలం విద్యుత్ ఉత్పత్తికే పరిమితం కాబోవు. ఉత్పత్తి చేసిన కరెంటులో కొంత భాగాన్ని నిల్వ చేసుకొనే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్(బీఈఎ్‌సఎస్) విధిగా ఏర్పాటు చేసుకోవాల్సిందేనని కేంద్ర విద్యుత్ సంస్థ(సీఈఏ) స్పష్టం చేసింది. ఈ మేరకు విద్యుత్ ప్లాంట్లు, విద్యుత్ లైన్ల నిర్మాణ సాంకేతిక ప్రమాణాల రెండో సవరణసోలార్, పవన విద్యుత్‌ప్లాంట్లకు నిబంధనలు-2026 ముసాయిదాను విడుదల చేసింది. వాటాదారులు, సామాన్య ప్రజల నుంచి అభ్యంతరాలను, సూచనలను అక్టోబరు 4లోగా పంపాలని కోరింది. గ్రిడ్‌లో రోజురోజుకూ పునరుత్పాదక విద్యుత్ వాటా పెరుగుతున్న నేపథ్యంలో ఎండ ఉన్నపుడు, గాలి వీచినపుడు మాత్రమే వచ్చే విద్యుత్ వల్ల గ్రిడ్‌లో ఏర్పడుతున్న అస్థిరతను అరికట్టడమే ఈ ప్రతిపాదన లక్ష్యం. ముసాయిదా రెండు దశల్లో నిబంధనలను అమలు చేయాలని ప్రతిపాదిస్తోంది.. 2027 జూలై 1 తర్వాత ఏర్పాటయ్యే నేలమీది సోలార్, పవన విద్యుత్ ప్లాంట్లు పూర్తి సామర్థ్యంతో పని చేసినపుడు కనీసం రెండు గంటల వ్యవధిలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో పది శాతాన్ని నిల్వ చేయగలిగిన కోలొకేటెడ్ స్టోరేజీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. అంటే, వంద మెగావాట్ల సోలార్ ప్లాంట్ పెట్టాలి అనుకుంటే రెండు గంటల్లో గంటకు పది మెగావాట్ల చొప్పున 20 మెగావాట్ అవర్ బ్యాటరీ ఏర్పాటు చేసుకోవాలి. ఆ ప్రాంగణంలోనే ఏర్పాటు చేసుకోవాలి. రెండో దశలో నిబంధన మరింత కఠినతరం అవుతుంది.
2029 జూలై 1 నుంచి 2031 జూన్ 30 మధ్య కాలంలో నిర్మితమయ్యే సోలార్, పవన విద్యుత్ ప్లాంట్లకు పదిశాతం నిబంధనను అంతే ఉంచి నాలుగు గంటలకు పెంచారు. అంటే, ఆ ప్లాంటు నాలుగు గంటలపాటు పూర్తి సామర్థ్యంతో పని చేసినపుడు ఉత్పత్తయ్యే విద్యుత్‌లో పదిశాతాన్ని నిల్వ చేయగలిగిన బ్యాటరీలను ఏర్పాటు చేసుకోవాలి. భవిష్యత్తులో బ్యాటరీల కనీస సామర్థ్యాన్ని కేంద్ర విద్యుత్ సంస్థ పెంచే అవకాశం ఉంది.
ఇన్వర్టర్లపైనా కొత్త షరతు
స్టోరేజీతో పాటు ఇన్వర్టర్ల విషయంలోనూ కీలక మార్పును ప్రతిపాదించారు. జూలై 1 నుంచి ప్రారంభించే ప్లాంట్లలో కనీసం 15ు ఇన్వర్టర్లకు గ్రిడ్ ఫార్మింగ్ కంట్రోల్ ఉండాలి. బ్యాటరీ స్టోరేజీ వ్యవస్థల్లోని అన్ని పవర్ కన్వర్షన్ సిస్టమ్‌లకు నిబంధన వర్తిస్తుంది. సాధారణ ఇన్వర్టర్లు గ్రిడ్‌ను అనుసరిస్తే గ్రిడ్ ఫార్మింగ్ కంట్రోల్ ఇన్వర్టర్లు ఫ్రీక్వెన్సీ, వోల్టేజీలను తామే నియంత్రించి అవాంతరాల సమయంలో గ్రిడ్‌ను నిలబెట్టగలవు. పీఎం సూర్యఘర్ ప్లాంట్లకు ఇది వర్తించదు. జాతీయ విద్యుత్ ప్రణాళిక ప్రకారం 2030 నాటికి విద్యుత్ డిమాండ్‌ను 4ు స్టోరేజీ ద్వారా తీర్చాలని లక్ష్యం పెట్టుకున్నారు. అంటే 250 గిగావాట్ అవర్ స్టోరేజీ అవసరం. ప్రస్తుతం ఉన్నది 6 గిగావాట్ అవర్ సామర్థ్యం మాత్రమే. అదీ పంప్‌డ్ స్టోరేజే. ఇప్పుడు ఆ బాధ్యతను ప్రయివేటు సోలార్, పవన విద్యుత్ ప్లాంట్ల మీద వేయనున్నారు. ప్రభుత్వం తాజాగా తెస్తున్న ఈ నిబంధనతో ప్రాజెక్టుల వ్యయం 40 శాతానికి పైగా పెరుగుతుందని ఇన్వెస్టర్లు భయపడుతున్నారు. బ్యాటరీల కోసం భారత్ ప్రస్తుతం చైనా మీద ఆధారపడుతోంది. ఇప్పటికే అప్పుల్లో మునిగిపోయిన డిస్కమ్‌ల మీదా ఈ నిబంధన భారం పెంచుతుందని అంచనా వేస్తున్నారు. సాధారణ ఇన్వర్టర్ల కన్నా గ్రిడ్ ఫార్మింగ్ ఇన్వర్టర్లు ఖరీదైనవి కావడంతో వాటిని కనీసం 15శాతం ఉంచాలన్న నిబంధనా భారం పెంచేదేనని అంటున్నారు