ఆటో కనీస చార్జీ 30
ABN , Publish Date - Oct 03 , 2026 | 04:17 AM
రాష్ట్రంలో ఆటోరిక్షా చార్జీలను ప్రభుత్వం సవరించింది. మోటారు వాహనాల చట్టం-1988లోని సెక్షన్ 67(1)(డీ)(ఐ) కింద ప్రభుత్వం కొత్త చార్జీలను నిర్ణయించింది
ఆటో కనీస చార్జీ 30
ఆ తరువాత ప్రతి కిలోమీటరుకు రూ.14
రాత్రి వేళల్లో సాధారణ చార్జీకి 50 శాతం అదనం
సామానుకు ప్యాకేజీల వారీగా అదనపు చార్జీ
రవాణా, రోడ్లు-భవనాల శాఖ ఉత్తర్వులు జారీ
డిజిటల్ మీటర్ల మార్పునకు మూడు నెలల గడువు
1.6 కిలోమీటర్లకు కనీస చార్జీ రూ.30కి పెంపు
రవాణా, రోడ్లు-భవనాల శాఖ ఉత్తర్వులు
హైదరాబాద్, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆటోరిక్షా చార్జీలను ప్రభుత్వం సవరించింది. మోటారు వాహనాల చట్టం-1988లోని సెక్షన్ 67(1)(డీ)(ఐ) కింద ప్రభుత్వం కొత్త చార్జీలను నిర్ణయించింది. ఈ మేరకు రవాణా, రోడ్లు-భవనాల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వికా్‌సరాజ్ శుక్రవారం ఉత్తర్వులు (జీవోఎంఎస్ నంబరు 46) జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నమోదై నడుస్తున్న ఆటోరిక్షాలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. దీని ప్రకారం.. మొదటి 1.6 కిలోమీటర్లకు కనీస చార్జ్జీ రూ.30గా నిర్ణయించారు. ఆ తర్వాత ప్రతి కిలోమీటరుకు రూ.14 చొప్పున వసూలు చేయాలి. ఆటో నిలిపి ఉంచినప్పుడు ప్రతి నిమిషానికీ 75 పైసల చొప్పున డిటెన్షన్ చార్జీగా తీసుకోవచ్చు. ప్రయాణికుడితోపాటు తీసుకెళ్లే సామానులో బ్రీఫ్‌కేస్, హ్యాండ్‌బ్యాగ్, తక్కువ పరిమాణంలో ఉన్న బ్యాగ్ మినహా ప్రతి ప్యాకేజీకి 50 పైసల చొప్పున చార్జీ విధించవచ్చు. ప్రయాణికుడు తీసుకెళ్లే సామాను గరిష్ఠంగా 100 కిలోల వరకు మాత్రమే ఉండాలి. ఇక రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ప్రయాణిస్తే.. సాధారణ చార్జ్జీకి అదనంగా 50 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు 1.6 కిలోమీటర్లకు కనీస చార్జీ రూ.20 ఉండగా, ఆ తర్వాత ప్రతి కిలోమీటరుకు రూ.11 ఉంది. వెయిటింగ్ చార్జి ప్రతి నిమిషానికి 50 పైసలు కాగా, రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు సాధారణ చార్జీకి 50 శాతం అదనంగా తీసుకునేవారు.
మూడు నెలల గడువు...
ఆటోల్లో అమర్చిన డిజిటల్ మీటర్లను.. సవరించిన టారి్‌ఫకు అనుగుణంగా మార్చాలని ప్రభుత్వం ఆదేశించింది. మీటర్ ప్రారంభించగానే కనీసం రూ.30 చూపించేలా, 1.60 కిలోమీటర్లు పూర్తయ్యాక ప్రతి కిలోమీటరుకు రూ.14 చొప్పున పెరిగే విధంగా మీటర్లను సెట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత డిజిటల్ మీటర్లను కొత్త చార్జీలకు అనుగుణంగా రీసెట్ చేసేందుకు రవాణా శాఖకు మూడు నెలల గడువు ఇచ్చింది. మీటర్ల మార్పిడి పూర్తయ్యేవరకు అన్ని ఆటోరిక్షాల్లో ప్రస్తుత, సవరించిన చార్జీలను సూచించే టారిఫ్ కార్డులు ప్రదర్శించాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. సవరించిన చార్జీల అమలుకు రవాణా కమిషనర్, రాష్ట్ర రవాణా సంస్థలు, ప్రాంతీయ రవాణా సంస్థలు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
ఇతర రాష్ట్రాల్లో ఇలా.. కేరళలో 1.5 కిలోమీటర్లకు కనీస చార్జ్జీ రూ.30గా ఉంది. ఆ తర్వాత ప్రతి కిలోమీటరుకు రూ. 15. రాత్రి చార్జీలు 50 శాతం అదనం.
ఢిల్లీలో 1.5 కిలోమీటర్లకు చార్జీ రూ. 30. ఆ తర్వాత ప్రతి కిలోమీటరుకు రూ.11. రాత్రి చార్జీలు 25 శాతం అదనం.
బెంగళూరులో 2 కిలోమీటర్లకు కనీస చార్జీ రూ.36. ఆ తర్వాత ప్రతి కిలోమీటరుకు రూ.18. రాత్రి చార్జీలు 50 శాతం అదనం.
ముంబైలో 1.5 కిలోమీటర్లకు కనీస చార్జీ రూ.26. ఆ తర్వాత ప్రతి కిలోమీటరుకు రూ.17. రాత్రి చార్జీలు 25 శాతం అదనం.
చెన్నైలో 1.8 కిలోమీటర్లకు కనీస చార్జీ రూ.25. ఆ తర్వాత ప్రతి కిలోమీటరుకు రూ.12. రాత్రి చార్జీలు 50 శాతం అదనం.చార్జీల పెంపు
నిర్ణయం ఏకపక్షం: బీఎంఎస్
ఆటో చార్జీల పెంపు విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) ఆరోపించింది. దీనిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నందకిషోర్ తెలిపారు. ఆటో డ్రైవర్ల సమస్యలు, మీటర్ చార్జీల పెంపు తదితర అంశాలపై ఆటో సంఘాల నాయకులతో చర్చలు జరిపి.. వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిందన్నారు. ప్రభుత్వం సవరించిన చార్జీలు ఆటో డ్రైవర్ల ప్రస్తుత జీవన వ్యయం, ఇంధనం, వాహన నిర్వహణ, బీమా, మరమ్మతులు తదితర ఖర్చులకు తగినట్లుగా లేవన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఆటో డ్రైవర్ కనీస చార్జీగా రూ.50 వసూలు చేయాలని బీఎంఎస్ పిలుపునిస్తోందని ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మూడు రోజులపాటు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆటో డ్రైవర్లకు పిలుపునిచ్చారు.