Share News

రెండేళ్లలో 2 లక్షల ఐటీ ఉద్యోగాలకు ఎసరు?

ABN , Publish Date - Apr 27 , 2026 | 05:31 AM

ఏఐ కారణంగా హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లో ఉద్యోగాల కోత ప్రారంభమైంది. ఇప్పటికే ప్రారంభ స్థాయి ఉద్యోగాలను కృత్రిమ మేధ(ఏఐ) ఆక్రమించడంతో గత ఏడాదికాలంలో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లపై తీవ్ర ప్రభావం పడింది....

రెండేళ్లలో 2 లక్షల ఐటీ ఉద్యోగాలకు ఎసరు?

  • తెలంగాణపై ఐటీ రంగ నిపుణుల అంచనా

  • దిగ్గజ సంస్థలు ఏఐ బాటపట్టడమే కారణం

  • స్టార్టప్‌ కంపెనీలు సైతం కృత్రిమ మేధ వైపే

  • ఐటీ సంస్థలతో బాధితులకు నష్టపరిహారం ఇప్పించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): ఏఐ కారణంగా హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లో ఉద్యోగాల కోత ప్రారంభమైంది. ఇప్పటికే ప్రారంభ స్థాయి ఉద్యోగాలను కృత్రిమ మేధ(ఏఐ) ఆక్రమించడంతో గత ఏడాదికాలంలో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లపై తీవ్ర ప్రభావం పడింది. అంతకుముందు రెండేళ్లతో పోలిస్తే ఈసారి క్యాంప్‌సలలో కొత్త ఉద్యోగాల నియామకం మూడోవంతు కూడా లేదని ఐటీనిపుణులు అంటున్నారు. కొత్త ఉద్యోగాల సంఖ్య సంగతి తర్వాత... అసలు ఉన్న ఉద్యోగాలే పోతున్నాయి. ఏఐతో మరిన్ని అవకాశాలు వస్తాయని, కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందని ఇప్పటివరకు కంపెనీల యాజమాన్యాలు, ఐటీనిపుణులు, ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితి ఏ మాత్రం కనిపించడం లేదు. పెద్ద కంపెనీల్లో ఉద్యోగాల కోత ఇప్పటికే ప్రారంభమైంది. మధ్యస్థాయి, చిన్నపాటి ఐటీకంపెనీలూ ఉన్న సిబ్బందిలో కోత విధిస్తున్నాయి. ఉద్యోగులతో పోలిస్తే మరింత ఖచ్చితంగా, మరింత సమర్ధంగా, నిర్వరామంగా పనిచేయగలిగే ఏఐ టెక్నాలజీని కంపెనీలు ఎక్కువగా వినియోగిస్తున్నాయి. దీంతో ఉద్యోగుల తొలగింపు ప్రారంభమైంది. వచ్చే రెండేళ్లలో ఐటీరంగంలో తెలంగాణలో రెండు లక్షలకు పైగా ఉద్యోగులు తమ ఉపాధి కోల్పోతారని, ఉద్యోగుల స్థానాన్ని ఏఐ ఆక్రమిస్తుందని ఐటీనిపుణులతోపాటు ప్రభుత్వం అంచనా వేస్తోంది.


ఒరాకిల్‌, అమెజాన్‌, డెల్‌లో వేలల్లో కోతలు

2026 ప్రారంభం నుంచే ప్రపంచ టెక్నాలజీ రంగంలో భారీ ఉద్యోగ కోతలు సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత మార్పులు, ఖర్చుల తగ్గింపు చర్యలు ఈ తొలగింపులకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ప్రముఖ సంస్థలు వేల సంఖ్యలో ఉద్యోగులను తగ్గిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగులను ఆకస్మిక షాక్‌లకు గురిచేస్తున్నాయి. టెక్‌ దిగ్గజం ఒరాకిల్‌ ఇటీవల 30 వేల ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భారత సంతతికి చెందిన వారే ఎక్కువగా ఉండడం మరింత కలవర పెట్టే అంశం. పొద్దున నిద్ర లేచి మెయిల్‌ చూసుకున్న ఉద్యోగులు తమ ఉద్యోగాలు పోయాయన్న చేదు వార్తను జీర్ణించుకోలేక పోయారు. ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు వార్తల్లో నిత్యం కనిపిస్తున్నాయి. ఏఐ, ఆటోమేషన్‌ వంటి రంగాల్లో భారీ పెట్టుబడులకు నిధులను సర్దుబాటు చేసేందుకే ఈ కోతలు విధిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌, 2026 ప్రారంభంలో కీలక పునర్వ్యవస్థీకరణ చర్యలు చేపట్టింది. ఈ చర్యల భాగంగా జనవరి 2026లో దాదాపు 16,000 కార్పొరేట్‌ ఉద్యోగాలను తగ్గించినట్లు సంస్థ అధికారికంగా ధ్రువీకరించింది. 2025 చివర్లో తగ్గించిన 14,000 ఉద్యోగాలను కలుపుకుంటే మొత్తం ప్రభావిత ఉద్యోగుల సంఖ్య 30,000 దాటింది. సంస్థలో ఉన్న మేనేజ్‌మెంట్‌ స్థాయిలను తగ్గించి, బ్యూరోక్రసీని తగ్గించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేపడుతున్నారు. ఆర్థిక వనరులను ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అభివృద్థి వైపు మళ్లిస్తూ గతంలో అధికంగా నియామకాలు జరిగిన విభాగాల్లో కోతలు విధిస్తోంది. అమెరికాలో ప్రభావిత ఉద్యోగులకు సాధారణంగా 90 రోజులు సమయం ఇస్తున్నారు, ఈ సమయంలో వారు సంస్థలోనే ఇతర అవకాశాలను వెతుక్కోవచ్చు. మరొక ప్రముఖ టెక్నాలజీ సంస్థ డెల్‌ తన తాజా ఆర్థిక నివేదికలో ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు వెల్లడించింది. 2026 జనవరి 30 నాటికి సంబంధించిన ఫైలింగ్‌ ప్రకారం కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య సుమారు 11,000 తగ్గి 97,000కు చేరింది. 2024 ఆర్థిక సంవత్సరంలో డెల్‌ ఉద్యోగుల సంఖ్య: 1,20,000గా ఉంటే.. 2025 కల్లా 1,08,000 చేరింది. ఇప్పుడు లక్ష లోపే ఉంది. డెల్‌ వరుసగా మూడు సంవత్సరాలుగా కొలువుల్లో కోత పెడుతూ వస్తోంది. ఖర్చులను నియంత్రించడం, వ్యాపారాన్ని మరింత సమర్థవంతంగా మార్చడం, మారుతున్న టెక్నాలజీ అవసరాలకు అనుగుణంగా సంస్థ నిర్మాణాన్ని పునర్వ్యవస్థీకరించుకోవడం ఈ నిర్ణయాల వెనుక ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. క్లౌడ్‌, ఏఐ, ఆటోమేషన్‌ రంగాల్లో పెట్టుబడులు పెంచుతున్న సంస్థలు సంప్రదాయ విభాగాల్లో ఉద్యోగాలను తగ్గిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డెల్‌ తీసుకున్న చర్యలు గ్లోబల్‌ ట్రెండ్‌ను ప్రతిబింబిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దిగ్గజ కంపెనీల నిర్ణయంతో హైదరాబాద్‌లోని ఉద్యోగులూ భారీగానే తొలగింపునకు గురయ్యారు.


నష్టపరిహారంపై సర్కారు దృష్టి

ఏఐ టెక్నాలజీని మరింత వినియోగించేలా ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల కోతతో అప్రమత్తమైంది. ఏఐతో కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతోందని, ఉన్న ఉద్యోగాలకు ఇబ్బంది లేదని చెబుతూ వస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు స్వరం మార్చింది. ఉద్యోగుల కోత తీవ్రమైన అంశమని, దీనిపై దృష్టి సారించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవలే హార్వర్డ్‌ యునివర్సిటీతో వీడియో కాన్ఫరెన్స్‌ ప్రసంగంలో చెప్పారు. ఏఐ టెక్నాలజీతో ఉద్యోగులను తొలగిస్తే కంపెనీలు నష్టపరిహారం చెల్లించేలా కొత్త చట్టం తెచ్చే యోచనలో ఉన్నామని తెలిపారు. తొలగింపునకు గురైన ఉద్యోగుల నైపుణ్యాల పెంపునకు ప్రభుత్వ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చే ఆలోచన కూడా ఉందని తెలిపారు.

స్టార్టప్‌ కంపెనీలూ అదే బాటలో

ఐటీరంగంలో స్టార్టప్‌ కంపెనీల పాత్ర కీలకం. ఒకేసారి పెద్ద కంపెనీలో అవకాశం లభించడం కష్టం కాబట్టి.. డిగ్రీ పట్టాలు పొందగానే అత్యధికులు స్టార్టప్‌ కంపెనీల్లో చేరుతారు. అక్కడ అనుభవంతో పెద్ద కంపెనీలకు ప్రయత్నిస్తారు. ఇప్పుడు ఏఐ రాకతో స్టార్టప్‌ కంపెనీల్లోనూ ఉద్యోగుల కోత మొదలైంది. ఓ ఎడ్యుటెక్‌ కంపెనీ ఐదేళ్ల క్రితం హైదరాబాద్‌ కేంద్రంగా దేశవ్యాప్తంగా సేవలు ప్రారంభించింది. ప్రారంభంలో టెక్నాలజీ కోసం కంపెనీ 18 నెలలపాటు శ్రమించింది. దీనికి రూ.1.3 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో 40 మంది ఉద్యోగులు పనిచేసేవారు. ఇప్పుడు ఇదే కంపెనీ ఏఐ టెక్నాలజీని వినియోగించి తన సేవలను మరింత విస్తరించింది. ఏఐ ప్లాట్‌ఫాం కోసం కంపెనీ చేసిన ఖర్చు రూ.35 లక్షలు మాత్రమే. అయితే ఇప్పుడు ఈ కంపెనీ 30 మంది ఉద్యోగులను తొలగించి కేవలం 10 మందితోనే గతంకంటే మెరుగైన సేవలు అందిస్తోంది. అలాగే గచ్చిబౌలి కేంద్రంగా ఉన్న ఓ కన్సల్టెన్సీ కంపెనీలో మూడేళ్ల నుంచి 400 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఏఐ ప్లాట్‌ఫాం వినియోగించి ఈ కంపెనీ 360 మంది ఉద్యోగులను తొలగించి కేవలం 40 మందితోనే పని కానిస్తోంది. ఇలాంటి ఉదాహరణలు నగరంలో అనేకం ఉన్నాయి. ఏఐ టెక్నాలజీతో కంపెనీల ఉత్పాదకత పెరుగుతోంది. లాభాలు పెరుగుతున్నాయి. కానీ, ఉద్యోగాలు మాత్రం పెద్ద ఎత్తున కోతకు గురవుతున్నాయి.

Updated Date - Apr 27 , 2026 | 06:48 AM