Share News

6 లేన్లు సరిపోతాయా?

ABN , Publish Date - Aug 12 , 2026 | 05:53 AM

ఇప్పటికే వాటిపై ట్రాఫిక్‌ జామ్‌! పండుగల సమయాల్లో బంపర్‌ టు బంపరే! ఇక వాటిని ఆరు లేన్లు చేసే సమయానికి మళ్లీ పరిస్థితి మొదటికే!! అందుకే, వాటిని ఇప్పుడే ఎనిమిది లేన్లు చేయడమే...

6 లేన్లు సరిపోతాయా?

హైదరాబాద్‌-విజయవాడ; హైదరాబాద్‌-బెంగళూరు హైవేలపై రోజురోజుకూ పెరుగుతున్న వాహనాలు

  • ఇప్పటికే ట్రాఫిక్‌ జామ్‌లు.. పండగల్లో బంపర్‌ టు బంపర్‌

  • చిన్న ప్రమాదం జరిగినా కిలోమీటర్ల కొద్దీ క్యూలు

  • ఇప్పుడున్న ట్రాఫిక్‌కే ఆరు వరుసలు తప్పనిసరి

  • ఆరు లేన్లు పూర్తయ్యేసరికి 8 లేన్ల ట్రాఫిక్‌.. మళ్లీ మొదటికి

  • అందుకే ఇప్పట్నుంచే 8 వరుసలు ఉండాలంటున్న నిపుణులు

  • 20-30 ఏళ్ల ముందుచూపుతో ప్రణాళికలుండాలని సూచనలు

హైదరాబాద్‌-విజయవాడ; హైదరాబాద్‌ బెంగళూరు.. ఈ రెండు జాతీయ రహదారులను నాలుగు లేన్ల నుంచి ఆరు లేన్లు చేస్తామంటూ ఘనంగా ప్రకటిస్తున్నారు!

ఇప్పటికే వాటిపై ట్రాఫిక్‌ జామ్‌! పండుగల సమయాల్లో బంపర్‌ టు బంపరే! ఇక వాటిని ఆరు లేన్లు చేసే సమయానికి మళ్లీ పరిస్థితి మొదటికే!! అందుకే, వాటిని ఇప్పుడే ఎనిమిది లేన్లు చేయడమే బెటర్‌! ఈ మేరకు ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో చర్చలు జరపాలన్న సూచనలు వస్తున్నాయి.

హైదరాబాద్‌, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): అవి జాతీయ రహదారులు! ప్రతి రోజూ సగటున అర లక్షకుపైగా వాహనాలు ప్రయాణిస్తుంటాయి! అంటే, గంటకు రెండు వేలకుపైనే! ఈ రోడ్డుపై ఓ భారీ వాహనాన్ని మరో భారీ వాహనం ఓవర్‌ టేక్‌ చేయాల్సి వస్తే.. రెండో వాహనం దాటి వెళ్లే వరకూ వెనక డజన్ల కొద్దీ వాహనాలు క్యూ కట్టాల్సి వస్తోంది. చిన్న ప్రమాదం జరిగినా వాహనాలు కిలోమీటర్లకొద్దీ ఆగాల్సి వస్తోంది. అందుకే సాధారణ రోజుల్లోనే వీటిపై విపరీతమైన ట్రాఫిక్‌. విజయవాడ వెళ్లాలంటే ఐదారు గంటలు; బెంగళూరు వెళ్లాలంటే 8-9 గంటలు తప్పనిసరి! ప్రస్తుతం 4 లేన్లుగా ఉన్న ఈ రోడ్లను ఇప్పుడు 6 లేన్లుగా మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. నిజానికి, ఈ రోడ్లను ఆరు లేన్లుగా మార్చినా.. ఇప్పుడున్న ట్రాఫిక్‌కే సరిపోతాయి. ఈ రోడ్లను ఆరు లేన్లు చేయడానికి కొన్నేళ్లు పడుతుంది. అప్పటికి ట్రాఫిక్‌ మరింత పెరుగుతుంది. రోడ్డు నిర్మాణం పూర్తయ్యే సమయానికి అదనంగా మరి కొన్ని వేల వాహనాలు వచ్చి చేరతాయి. అప్పుడు మళ్లీ పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుంది. అందుకే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ముందు చూపుతో వ్యవహరించాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ రహదారులను ఇప్పుడే ఎనిమిది లేన్లుగా నిర్మించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ నుంచి విజయవాడ, బెంగళూరు; అలాగే సూర్యాపేట-ఖమ్మం హైవే నుంచి రాజమండ్రి వైపు వెళ్లే ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది.


కానీ, ఆ సెక్షన్లలో రోడ్లు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. ఆయా రోడ్లు 4 వరుసలు, కొన్నిచోట్ల 2 లేన్లకే పరిమితమై ఉన్నాయి. తెలంగాణలోని హైదరాబాద్‌ మీదుగా బెంగళూరు, విజయవాడ వెళ్లేందుకు ప్రస్తుతం ఉన్న (ఎన్‌హెచ్‌-44, ఎన్‌హెచ్‌-65) జాతీయ రహదారుల అభివృద్ధి విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. నిజానికి, హైదరాబాద్‌- విజయవాడ హైవే మంజూరు సమయంలోనే కీలక నిబంధన ఉంది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయిన 12 ఏళ్లలోపు దీనిని 6 వరుసలుగా చేయాలి. కానీ, ఇప్పటికీ నాలుగు లేన్లుగానే ఉంది. దీనిని ఆరు లేన్లు చేయాలన్న డిమాండ్‌ ఎప్పటి నుంచో కొనసాగుతోంది. దీనిని సర్వీసు రోడ్డుతో ఆరు లేన్లు చేసేందుకు ఇటీవల ఎన్‌హెచ్‌ఏఐ ప్రణాళికలు సిద్ధం చేసింది. వాస్తవానికి, ఆ హైవేపై రోజువారీ సగటు ట్రాఫిక్‌ 60,280 (ప్యాసింజర్‌ కార్‌ యూనిట్స్‌ (పీసీయూ)) ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. నార్కట్‌పల్లి-సూర్యాపేట బైపాస్‌ సెక్షన్లో సుమారు 55 వేల వరకు వాహనాలు వెళుతున్నట్లు సమాచారం. సూర్యాపేట -కోదాడ మధ్య కూడా దాదాపు 34 వేల వరకు ట్రాఫిక్‌ ఉంటోంది. ఇక పండుగలు, వరుస సెలవుల సమయంలో ఈ హైవేపై వాహనాల రద్దీని ఊహించలేం. ఫలితంగా, హైదరాబాద్‌ నుంచి విజయవాడ చేరుకునేందుకు సాధారణ రోజుల్లో కంటే అదనపు సమయం పడుతోంది. ప్రమాదాలు అలాగే జరుగుతున్నాయి. నిజానికి, ఒక హైవేపై రోజుకు 60 వేల వాహనాలు ప్రయాణిస్తే 4 లేన్లను 6 వరుసలుగా మార్చేలా నిబంధనలు ఉన్నాయని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు చెబుతున్నారు. ఆ నిబంధన ప్రకారం చూసుకున్నా.. దీనిని ఇప్పటికే 6 లేన్లుగా మార్చాలి. కానీ, ఇప్పుడు దానిని 6 లేన్లుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీని నిర్మాణం పూర్తయ్యేలోపు ఇక్కడ 8 వరుసల మేర ట్రాఫిక్‌ ఉంటుందన్న అంచనాలున్నాయి. రహదారులపై వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇప్పటికీ ఆరు వరుసల రోడ్డే అంటే వాహనదారులకు మళ్లీ ఇబ్బందులు తప్పనట్టే. ట్రాఫిక్‌లో అత్యంత నిదానంగా వెళ్లడం, తద్వారా ఇంధన వినియోగం పెరిగిపోయి, ఖర్చు పెరుగుతుంది. సమయం వృథా అవుతుంది. అధిక ట్రాఫిక్‌తో ప్రమాదాలకూ ఆస్కారం. అలాగే, తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ మధ్య హైస్పీడ్‌ కారిడార్‌ ఉండాలన్న ఉద్దేశంతో చేపట్టిన సూర్యాపేట-ఖమ్మం, ఖమ్మం-దేవరపల్లి హైవేలు కూడా 4 వరుసలే. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలు కాకుండా రాజమండ్రి, ఏలూరు వైపు వెళ్లే వాహనాలన్నీ ఈ హైవే నుంచి దేవరపల్లి రోడ్డు మీదుగా వెళ్తున్నాయి. దీంతో, రద్దీ బాగా పెరిగింది. ఈ అంచనా లేకుండానే ఆ రోడ్డును 4 లేన్లతోనే నిర్మించడం ఇబ్బందిగా మారిందంటూ ప్రయాణికులు చెబుతున్నారు.


బెంగళూరు హైవే మరీ దారుణం

హైదరాబాద్‌- బెంగళూరు రోడ్డు పేరుకే జాతీయ రహదారి. 4 వరుసలతో ఉన్నా బెంగళూరు వెళ్లాలంటే దాదాపు 8-9 గంటల సమయం పడుతోంది. వాస్తవానికి, నార్త్‌-సౌత్‌ కారిడార్‌లో ఇది అత్యంత కీలకమైనది. అంతేనా.. హైదరాబాద్‌ నుంచి వెళ్లే మార్గంలో మొదటగా వచ్చే రాయికల్‌ టోల్‌గేట్‌ దగ్గర 58-60 వేల వాహనాలు, కొత్తకోట దగ్గర్లో వచ్చే రెండో టోల్‌గేట్‌ దగ్గర 50 వేల వాహనాలు వెళ్తున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇంత భారీగా ట్రాఫిక్‌ ఉన్నా.. ఈ రోడ్డు ఇప్పటికీ 4 వరుసలతోనే ఉండడం గమనార్హం. ఫలితంగా, ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడాల్సి వస్తోంది. తాజాగా, ఈ హైవేను 6 లేన్లుగా మార్చాలని ఎన్‌హెచ్‌ఏఐ అలైన్‌మెంట్‌ను రూపొందించి కేంద్రానికి పంపింది. రోడ్డు పనులు మొదలై, పూర్తయ్యేలోపు ఇక్కడ 8 వరుసల రోడ్లు అవసరమయ్యే స్థాయిలో వాహనాలు పెరుగుతాయని అంచనా! ఈ హైవే విషయంలో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు పునరాలోచన చేసి 8 లేన్ల రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటే భవిష్యత్తు అవసరాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్న అభిప్రాయాలు ఉన్నాయి. అంతెందుకు.. ఔటర్‌ రింగు రోడ్డును 8 వరుసలుగా నిర్మించారు. దీనిపై రోజుకు సుమారు 2.50 లక్షల వాహనాలు వెళ్తున్నాయి. ఒక్కోసారి ట్రాఫిక్‌ కూడా జామ్‌ అవుతోంది. ఈ నేపథ్యంలోనే, జాతీయ రహ దారులను భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా 8 లేన్లతో నిర్మిస్తే సమస్యలు పునరావృతం కావని నిపుణులు సూచిస్తున్నారు.

రద్దీ ప్రకారమే నిర్మాణాలంటే ఎలా..

దేశంలో ఆయా రాష్ట్రాలను కలుపుతూ కేంద్రం జాతీయరహదారులను మంజూరు చేస్తూ ఉంటుంది. ఇప్పటికే ఉన్న రోడ్ల వెడల్పు పనులకు అవకాశం కల్పిస్తుంది. ప్రస్తుతం రోడ్లపై ఉన్న ట్రాఫిక్‌ను అంచనా వేసి, దాని మేరకు అక్కడ 4 లేన్లు నిర్మించాలా లేదంటే 6/8 లేన్లతో చేపట్టాలా అన్న దానిని ఖరారు చేస్తుంది. అంతే తప్పితే.. భవిష్యత్తులో అంటే రాబోయే 20-30 ఏళ్లలో ఆ రహదారిపై ట్రాఫిక్‌ ఎలా ఉంటుందన్న దానిపై శాస్త్రీయ పద్ధతిలో కచ్చితమైన సర్వేలు చేయడం లేదన్న విమర్శలున్నాయి. రోడ్లను ఒక్కొక్క ప్రాజెక్టుగానే విభజించి, సర్వేలు చేయడంతో భవిష్యత్‌లో వాహనాల పెరుగుదల, రోడ్లు ఎన్ని వరుసలతో ఉండాలన్న దానిని సరిగా అంచనా వేయలేకపోతున్నారని నిపుణులు డాక్టర్‌ దొంతి నర్సింహా రెడ్డి ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో చెప్పారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని.. కేంద్రం కచ్చితమైన గణాంకాలతో రహదారులను నిర్మిస్తే అభివృద్ధికి బాటలు వేసినట్టవుతుందని అభిప్రాయపడ్డారు

ఇవి కూడా చదవండి

భారతమాతకు ధైర్యవంతుడైన కుమారుడు ఖుదీరామ్ బోస్: పవన్ కల్యాణ్

నా హక్కుల కోసం పోరాడాను.. అదే నేను చేసిన తప్పు: హర్భజన్ సింగ్

Updated Date - Aug 12 , 2026 | 05:53 AM