పెంపుడు పిల్లి మరణం.. ఆ బాధ తట్టుకోలేకపోయిన యువతి..
ABN , Publish Date - Mar 19 , 2026 | 06:34 PM
హైదరాబాద్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెంపుడు పిల్లి మరణం తట్టుకోలేకపోయిన ఓ యువతి ప్రాణాలు తీసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి చనిపోయింది.
హైదరాబాద్, మార్చి 19: పెంపుడు పిల్లి మరణం తట్టుకోలేకపోయిన ఓ యువతి ప్రాణాలు తీసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి చనిపోయింది. ఈ సంఘటన హైదరాబాద్‌లో బుధవారం చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వెంకటాద్రి నివాస్‌కు చెందిన 20 ఏళ్ల హిమబిందు బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఆమె రెండేళ్ల నుంచి ఓ పిల్లిని పెంచుకుంటోంది. ఈ నేపథ్యంలో హిమబిందుకు పిల్లితో విడదీయరాని బంధం ఏర్పడింది. ఆమె ఆ పిల్లిని ఇంట్లో సభ్యుడిగా భావించేది.
అయితే, అనారోగ్య కారణాల వల్ల కొద్దిరోజుల క్రితం ఆ పిల్లి చనిపోయింది. ఎంతో ప్రేమతో పెంచుకుంటున్న పిల్లి చనిపోవటంతో హిమబిందు తట్టుకోలేకపోయింది. ఈ నెల 18వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు ఆమెను వెంటనే దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. హిమబిందును పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె చనిపోయినట్లు ధ్రువీకరించారు.
ఇక, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. హిమబిందు కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పెంపుడు పిల్లి మరణం తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్న హిమబిందు స్టోరీ స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి
ఇరాన్ యుద్ధం కోసం రూ.18 లక్షల కోట్లు కావాలి.. అమెరికా పార్లమెంట్‌కు పెంటగాన్ ప్రతిపాదన..
నా ఛాంప్‌తో కలిసి ఉగాది వేడుకలు.. మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర పోస్టు