Share News

గుక్కెడు నీళ్లు దక్కేనా?

ABN , Publish Date - Jul 07 , 2026 | 04:16 AM

రాష్ట్రంలో తాగునీటి కొరత ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. వర్షాలు కురవక.. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. నీటి వనరులు ఇంకిపోతున్నాయి. ఇళ్లలో వేసుకున్న బోర్లు ఎండిపోతున్నాయి.

గుక్కెడు నీళ్లు దక్కేనా?

  • రాష్ట్రంలో తాగునీటికి ప్రమాద ఘంటికలు!

  • ఆందోళన కలిగిస్తున్న వర్షాభావ పరిస్థితులు

  • ఎండాకాలం పోయినా నీటికోసం కష్టాలే

  • రాష్ట్రంలో పలు చోట్ల తీవ్ర నీటికొరత

  • హైదరాబాద్‌లో మరింత నీటి కరువు

  • అడుగంటిపోతున్న భూగర్భ జలాలు

  • బోర్లు పోయక.. సరఫరా చాలక ఇబ్బందులు

  • శివారు ప్రాంతాల్లో సమస్య మరింత తీవ్రం

  • రోజుకు 10వేలకు పైగా ట్యాంకర్ల బుకింగ్‌లు

  • జూన్‌, జూలైలో ఈ స్థాయి బుకింగ్‌లు తొలిసారి

  • ఎల్‌నినో తోడైతే పెరగనున్న ఇబ్బందులు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌/హైదరాబాద్‌ సిటీ)

రాష్ట్రంలో తాగునీటి కొరత ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. వర్షాలు కురవక.. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. నీటి వనరులు ఇంకిపోతున్నాయి. ఇళ్లలో వేసుకున్న బోర్లు ఎండిపోతున్నాయి. ప్రభుత్వ తాగునీటి పథకాల ద్వారా నీటి సరఫరా కొనసాగుతున్నా.. మరికొన్నాళ్లు ఇదే పరిస్థితి కొనసాగితే ఈ సరఫరా కూడా కష్టం కానుంది. మహబూబ్‌నగర్‌, ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ వంటి నగరాలకు వివిధ ప్రాజెక్టుల ద్వారా తాగునీటిని అందిస్తుండగా.. మరో రెండు నెలలు మాత్రమే ఆయా ప్రాజెక్టుల్లో నీరు అందుబాటులో ఉండే అవకాశముంది. మున్ముందు ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉండడంతో ప్రాజెక్టుల్లో నీరు ఉంటుందా? తాగునీరు అందుతుందా? అన్న ఆందోళన నెలకొంది. హైదరాబాద్‌ మహానగరమైతే నీటికోసం అల్లాడుతోంది. ఇళ్లలో రోజుకు రెండు బకెట్ల నీళ్లు దొరకడమే గగనమైపోయింది. వాటర్‌ బోర్డు సరఫరా చేసే నీళ్లు ఇంటి అవసరాలకు సరిపోవడంలేదు. దీంతో ట్యాంకర్‌ నీళ్ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా వేసవిలో మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో ఉండే నీటి కష్టాలను ప్రజలు ఈ ఏడాది జూన్‌, జూలై నెలల్లోనూ ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌ మహానగరంలో కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (క్యూర్‌) వరకు తాగునీటిని వాటర్‌బోర్డు సరఫరా చేస్తోంది. క్యూర్‌ పరిధిలో కోటిన్నరకు పైగా జనాభా నివసిస్తుండగా.. వాటర్‌బోర్డు తాగునీరు సరఫరా చేసే కనెక్షన్లు 14.20 లక్షలు ఉన్నాయి. వాటర్‌బోర్డు కనెక్షన్‌ లేని నివాసాలు కూడా లక్షల్లోనే ఉన్నాయి. వీరంతా బోర్ల నీటిపై ఆధారపడుతున్నారు. పాత జీహెచ్‌ఎంసీ పరిధిలోని దాదాపు 10 లక్షల కనెక్షన్లకు వాటర్‌బోర్డు రోజు విడిచి రోజు నీరు సరఫరా చేస్తుండగా.. శివారు ప్రాంతాల్లో ఔటర్‌ అవతలి వరకు రెండు, మూడు రోజులకోసారి నీటిని సరఫరా చేస్తున్నారు. కృష్ణా, గోదావరి, సింగూరు, మంజీరా జలాలతో పాటు ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ జలాలను ప్రతీరోజు 2650 మిలియన్‌ లీటర్లను నగరానికి తీసుకొచ్చి అందిస్తున్నారు. అయితే ఈ 2650 మిలియన్‌ లీటర్ల నీళ్లు 2015 నాటి జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రాంతానికి సరిపోయేవే. కానీ, పదేళ్లలో నగరం గణనీయంగా విస్తరించడం, వాటర్‌బోర్డు పరిధి పెరగడంతో సరఫరా చేసే నీళ్లు ఏమాత్రం సరిపోవడం లేదు.


1.43 మీటర్ల దిగువకు భూగర్భ జలాలు..

వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్‌ మహా నగరంలో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. గ్రౌండ్‌ వాటర్‌ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో 29 ప్రాంతాల్లో పీజోమీటర్లను ఏర్పాటు చేసి భూగర్భ జలమట్టాలను కొలుస్తున్నారు. హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని 29 ప్రాంతాల్లో మే నెలతో పోలిస్తే.. భూగర్భ జలాలు గణనీయంగా దిగువలో ఉన్నట్లు గుర్తించారు. జిల్లాలో సగటు భూగర్భ జలమట్టాలు 11.08 మీటర్లు కాగా, జూన్‌లో 12.43 మీటర్ల దిగువకు పడిపోయాయి. మే నెలతో పోలిస్తే 1.43 మీటర్లు తగ్గాయి. పీజోమీటర్లు కలిగిన ప్రాంతాల్లో మీటర్‌ నుంచి 6మీటర్ల దిగువకు పడిపోయాయి. అత్యధికంగా వెస్ట్‌ మారేడుపల్లిలో మే నెలలో 9.50 మీటర్ల లోతులో నీళ్లు ఉండగా, జూన్‌లో 12.74 మీటర్ల లోతుకు పడిపోయాయి. భూగర్భ జలాలు పడిపోతుండడంతో నగరంలో ఇళ్లు, అపార్ట్‌మెంట్లలో ఉన్న బోర్టు ఎండిపోతున్నాయి. గేటెడ్‌ కమ్యూనిటీ కాలనీలు, మురికివాడలు, కొన్ని బస్తీలలో మినహా నగరంలోని అనేక ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ, ప్రతి అపార్ట్‌మెంటుకూ బోర్లు ఉన్నాయి. ఇంటి అవసరాలకు అత్యధికంగా బోర్లను వినియోగిస్తూ.. వాటర్‌బోర్డు సరఫరా చేసే నీటిని తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్నారు. అయితే వేగంగా భూగర్భ జలాలు పడిపోతుండడంతో బోర్లపై ఆధారపడిన ఇళ్లు, అపార్ట్‌మెంట్ల వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హోటళ్లు, హాస్టళ్లు, పలు వాణిజ్య సముదాయాలకు బోర్ల నీరే ఆధారం కాగా.. ఇప్పుడు అవి ఎండిపోతుండడంతో ట్యాంకర్లకు డిమాండ్‌ పెరిగింది.

ట్యాంకర్లకు పెరిగిన బుకింగ్‌లు..

నగరంలో సాధారణంగా మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో నీటి ట్యాంకర్లకు డిమాండ్‌ అధికంగా ఉంటుంది. ఈసారి మాత్రం జూన్‌, జూలైలో కూడా ట్యాంకర్లకు డిమాండ్‌ భారీగా ఉంది. వాటర్‌బోర్డు ట్యాంకర్లను ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచే రోజుకు 10 వేలకు పైగా బుకింగ్‌ చేయగా.. మే నెలలో 15 వేల వరకు చేరింది. మార్చి నెల మొత్తమ్మీద 2.24 లక్షల ట్యాంకర్లను బుక్‌ చేయగా, ఏప్రిల్‌లో 2.85 లక్షలు చేశారు. ఇక మే నెలలో గతంలో ఎన్నడూ లేనంతగా 3.52 లక్షల ట్యాంకర్లను బుక్‌ చేశారు. కాగా, జూన్‌లో తగ్గాల్సిన ఈ సంఖ్య 3.56లక్షలకు పెరిగింది. జూలై లోనూ ఈ ఆరు రోజుల్లోనే 54 వేలకు పైగా ట్యాంకర్లను బుకింగ్‌ చేశారు. జూన్‌, జూలైలో ఈ స్థాయిలో ట్యాంకర్ల బుకింగ్‌ ఉండడం ఇదే మొదటిసారి అని వాటర్‌బోర్డు అధికారులు అంటున్నారు. అయితే గత ఐదేళ్ల నుంచి నగరంలో ట్యాంకర్ల డిమాండ్‌ ఏటేటా భారీగా పెరుగుతోంది తప్ప తగ్గకపోవడం ఆందోళన కలిగించే అంశంగా భావిస్తున్నారు.


పాలమూరు కార్పొరేషన్‌కు నీటి కటకట

ఉమ్మడి పాలమూరు జిల్లా తాగునీటి అవసరాలను కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులు తీరుస్తాయి. కానీ, ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమై నెలరోజులు దాటినా వేసవిలో ఉన్న తాగునీటి కష్టాలే ఇప్పటికీ ఎదురవుతున్నాయి. ప్రధాన పాలమూరు కార్పొరేషన్‌ పరిధిలో నీటి కటకట ఇప్పటికే ప్రారంభమైంది. కార్పొరేషన్‌కు రాంరెడ్డిగూడ, జడ్చర్లలో ఉన్న మిషన్‌ భగీరథ ప్లాంట్ల నుంచి నీరందుతుంది. వీటి సామర్థ్యం 32 ఎంల్‌డీ ఉంది. అయితే కార్పొరేషన్‌ పరిధిలో ప్రతీ రోజు మిషన్‌ భగీరథ నీరు సరఫరా కావాలంటే 35 ఎంఎల్‌డీ అవసరం. పవర్‌ బోర్లు, ఇళ్లలో సొంతంగా బోర్లు ఉన్న వారితో కలిపి దాదాపు ఆ అవసరం గతంలో తీరేది. కానీ, ప్రస్తుతం కేవలం రెండు పథకాల నుంచి 26 ఎంల్‌డీ నీరు మాత్రమే సరఫరా అవుతోంది. ఉమ్మడి జిల్లాతో పాటు రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లోని 18 నియోజకవర్గాలు, 19 మునిసిపాలిటీలకు సుమారు 4 వేల ఆవాసాలకు శ్రీశైలం ద్వారానే నీరందుతోంది. మొత్తం 12 వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల ద్వారా ఈ సరఫరా జరుగుతుండగా ఎల్‌నినో ప్రభావంతో ఇప్పటివరకు శ్రీశైలానికి ఆశించిన వరద రాలేదు. ప్రాజెక్టు సామర్థ్యం 215.82 టీఎంసీలు కాగా కేవలం 42.34 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ఇందులో 28.97 టీఎంసీలు డెడ్‌స్టోరేజీ. ఇందులో 13.37 టీఎంసీలు మాత్రమే వాడుకునేందు వీలుంటుంది. వరద రానిపక్షంలో మొత్తం నీటి సరఫరాకు ఇబ్బందులు ఏర్పడతాయి. కరీంనగర్‌ జిల్లా కేంద్రానికి లోయర్‌ మానేరు డ్యాం నీటిని తీసుకుని బూస్టర్‌ పంపునల ద్వారా శుద్ధీకరణ చేసి సరఫరా చేస్తున్నారు. డ్యాంలో ప్రస్తుతం 889 అడుగుల మేర నీటి నిల్వ ఉంది. ఇది 878 అడుగులకు చేరుకునే దాకా నీటిని తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ తరువాత వర్షాలు కురవకపోతే కష్టాలే రానున్నాయి. ఇక నిజామాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌కు ప్రధానంగా అలీసాగర్‌, మంచిప్ప రిజర్వాయర్‌, రఘునాథ చెరువు నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు. వీటిలో ప్రస్తుతం ఉన్న నిల్వల ప్రకారం మరో రెండు నెలల వరకు ఈ నీటిని సరఫరా చేసే వీలుంటుంది.

సాగర్‌ ఆగిపోతే ఖమ్మానికి కష్టాలే!

ఖమ్మం కార్పొరేషన్‌లో లక్ష వరకు కుటుంబాలున్నాయి. 75 వేలకు పైగా ఇంటింటి తాగునీటి పంపులున్నాయి. ఎవరికి వారు బోర్లతో నీటిని సర్దుబాటు చేసుకుంటున్నారు. నగరానికి అటు సాగర్‌ జలాలతో పాటు మున్నేరు నీటిని వినియోగించే సౌలభ్యం ఉంది. ఎల్‌నినో ప్రభావంతో సాగర్‌ జలాలు పూర్తిగా నిలిచిపోయినా మున్నేరు నుంచి వచ్చే నీటిని తాగునీటిగా వినియోగించేందుకు అవకాశం ఉంది. వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉండి మున్నేరులోనూ నీళ్లు అడుగంటితే ఖమ్మం నగరానికి మంచినీటి సమస్య ఎదురవుతుంది. ఇక నల్లగొండ పట్టణానికి ఉన్న ఏకైక నీటి లభ్యత పానగల్‌ ఉదయసముద్రం. ఈ రిజర్వాయర్‌లో రెండు నెలలకు సరిపడా నిల్వలు ఉండడంతో భవిష్యత్‌ తాగునీటి సరఫరాపై ఆందోళన కనిపిస్తోంది. ఏఎమ్మార్పీ హైలెవెల్‌ కెనాల్‌ ద్వారా అక్కంపల్లి రిజర్వాయర్‌ (నాగార్జునసాగర్‌ బ్యాక్‌ వాటర్స్‌) నుంచి పానగల్‌ రిజర్వాయర్‌కు ప్రతి రోజూ నీటి సరఫరా అవుతోంది. ప్రస్తుతం ఉదయసముద్రంలో ఉన్న నీటి నిల్వలు, అటు బోరు బావుల నీటిమట్టాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఆగస్టు నెలాఖరు వరకు నల్లగొండ కార్పొరేషన్‌లో తాగునీటికి సమస్య లేదని అధికారులు చెబుతున్నారు. ఈలోగా ఎగువన కర్ణాటక, మహారాష్ట్రల్లో వర్షాలు పడుతున్నందున నాగార్జునసాగర్‌కు వరద వస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌లోని ప్రజలకు మూడు నెలలకు సరిపడా నీటి నిల్వలు ఉన్నాయి. ప్రధానంగా దేవాదుల ఎత్తిపోతల పథకం నుంచి ధర్మాసాగర్‌ రిజ.ర్వాయర్‌లో నీటిని స్టోర్‌ చేస్తున్నారు. ఈ నీళ్లు మూడు నెలల వరకు సరిపోతాయని అంటున్నారు.


ఇళ్లలోని నీటిని భూమిలోకి ఇంకించాలి

నగరంలో నీటి డిమాండ్‌ జూన్‌, జూలైలో కొనసాగడానికి కారణం వర్షాభావ పరిస్థితులే. తాగునీటి అవసరాలతో పాటు ఇళ్లు, అపార్ట్‌మెంట్‌ అవసరాలకు సైతం వాటర్‌బోర్డు నీళ్లను వినియోగిస్తున్నారు. దాంతో సరఫరా చేసే నీళ్లు సరిపోవడం లేదు. హైదరాబాద్‌ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున భూగర్భ జలాల క్షీణత నమోదవడం ఇదే తొలిసారి. ప్రతీ భవనంలో వర్షపు నీటి సంరక్షణ చర్యలు చేపట్టకపోతే వచ్చే ఏడాది వేసవిలో భూగర్భ జలాల కొరత మరింత తీవ్రంగా మారే ప్రమాదం ఉంది. ఇళ్లలో నీటిని వృథా చేయకుండా భూమిలోకి ఇంకేలా ఇంకుడు గుంతలు నిర్మించాలి. వర్షపు నీటితో పాటు ఇంట్లో అవసరాల నీటిని సైతం ఇంకుడు గుంతల్లోకి మళ్లించాలి.

- అశోక్‌రెడ్డి, వాటర్‌బోర్డు ఎండీ

తీవ్ర వర్షాభావ పరిస్థితులు..

ఈ ఏడాది రుతుపవనాల రాక ఆలస్యం, ఎల్‌నినో ప్రభావంతో జూన్‌ 6 వరకు గ్రేటర్‌లో భారీవర్షాలు కురవలేదు. జూన్‌లో హైదరాబాద్‌ జిల్లాలో సాధారణంగా 105.9 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా 92.2 శాతం మాత్రమే నమోదైంది. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో 86.9 మిల్లిమీటర్లు నమోదు కావాల్సి ఉండగా ఏకంగా 49.8 శాతానికి పడిపోయింది. ఇక జూలైలో 5 రోజుల్లో 130.1 మిల్లిమీటర్ల వర్షం పాతం నమోదుకావాల్సి ఉండగా 97.3 మిల్లిమీటర్లు మాత్రమే నమోదైంది. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 103.9 మిల్లిమీటర్ల వర్షపాతానికిగాను 62.5 మిల్లిమీటర్లే కురిసింది. రంగారెడ్డి జిల్లాలో 116.6 మిల్లిమీటర్ల వర్షపాతానికిగాను 110.3 మిల్లిమీటర్లే నమోదైంది.

Updated Date - Jul 07 , 2026 | 04:16 AM