Share News

ఇంకా దొరకని హైదరాబాద్‌ నాగోల్ విద్యార్థుల ఆచూకీ.. పోలీసు బృందాల గాలింపు!

ABN , Publish Date - Nov 04 , 2026 | 10:15 AM

హైదరాబాద్‌లోని నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు పాఠశాల విద్యార్థులు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. తల్లి మందలించడంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన అన్నదమ్ముల ఆచూకీ కోసం పోలీసులు రంగంలోకి దిగారు.

ఇంకా దొరకని హైదరాబాద్‌ నాగోల్ విద్యార్థుల ఆచూకీ.. పోలీసు బృందాల గాలింపు!
Hyderabad Missing Case

హైదరాబాద్, నవంబర్ 4: నగరంలోని నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు పాఠశాల విద్యార్థులు అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. సాయిరాం నగర్, రోడ్ నంబర్ 3లో నివాసం ఉంటున్న మొగిలి రవి, శిరీష దంపతుల ఇద్దరు కుమారులు వరుణ్ తేజ్, మహేష్ కనిపించకుండా పోయారు. వీరిలో వరుణ్ తేజ్ నాగోల్ ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి, మహేష్ రెండో తరగతి చదువుతున్నారు.

శనివారం ఉదయం పాఠశాలకు వెళ్లేందుకు నిరాకరించడంతో తల్లి ఇద్దరు పిల్లలను మందలించినట్లు సమాచారం. అనంతరం పిల్లలను స్కూల్‌కు పంపించేందుకు ఆటోలో కూర్చోబెట్టి, ఇంట్లో ఉన్న స్కూల్ బ్యాగులను తీసుకురావడానికి తల్లి లోపలికి వెళ్లింది. ఇదే సమయంలో ఇద్దరు బాలురు ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయారు. తల్లి తిరిగి వచ్చేసరికి పిల్లలు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో నాగోల్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి చిన్నారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.


సీసీ కెమెరాల్లో కీలక దృశ్యాలు..

ఇద్దరు చిన్నారుల అదృశ్యంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నాగోల్‌లోని సాయినగర్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ఈ క్రమంలో ఓ కిరాణా దుకాణంలో ఇద్దరు బాలురు చాక్లెట్లు కొనుగోలు చేసినట్లు గుర్తించినట్లు సమాచారం. అక్కడి నుంచి ఉప్పల్ వైపు వెళ్లినట్లు సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ఇద్దరు చిన్నారులు రోడ్డు దాటుతున్న దృశ్యాలు కూడా సీసీ కెమెరాల్లో రికార్డైనట్లు తెలుస్తోంది. అనంతరం వారు ఉప్పల్ నుంచి ఘట్‌కేసర్ వైపు వెళ్లినట్లు ప్రాథమికంగా సమాచారం అందినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్ ఏసీపీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి చిన్నారుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీలను విశ్లేషిస్తూ, వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇద్దరు చిన్నారులు సురక్షితంగా తిరిగి రావాలని కుటుంబ సభ్యులు ఆవేదనతో ఎదురుచూస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మళ్లీ స్వల్పంగా పెరిగిన బంగారం ధర

బీఆర్‌ఎస్‌ గుర్తింపు రద్దు చేయాలి

Read Latest AP News And Telangana News 

Updated Date - Nov 04 , 2026 | 10:20 AM