Share News

యువకుడి దారుణం.. వేరే పెళ్లి చేసుకుందన్న కోపంతో మహిళపై..

ABN , Publish Date - Mar 21 , 2026 | 06:43 PM

తనని కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో ఓ యువకుడు మహిళపై కత్తితో దాడి చేశాడు. తండ్రి, స్నేహితుడితో మహిళ ఇంటికి వెళ్లి మరీ ఈ ఘోరానికి ఒడిగట్టాడు.

యువకుడి దారుణం.. వేరే పెళ్లి చేసుకుందన్న కోపంతో మహిళపై..
Hyderabad crime

ఇంటర్‌నెట్ డెస్క్: హైదరాబాద్‌లోని మియాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. తనని కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో ఓ యువకుడు మహిళపై కత్తితో దాడి చేశాడు. తండ్రి, స్నేహితుడితో కలిసి మహిళ ఇంటికి వెళ్లి మరీ ఈ ఘోరానికి ఒడిగట్టాడు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కాకినాడకు చెందిన 25 ఏళ్ల నూకరత్నం అనే మహిళ కొన్నేళ్ల క్రితం భర్తను కోల్పోయింది. ప్రస్తుతం తన ఇద్దరు కూతుళ్లతో కలిసి మియాపూర్‌లోని రెడ్డి కాలనీలో నివసిస్తోంది. స్థానికంగా హౌస్ కీపింగ్ పని చేస్తూ జీవిస్తోంది. కొంత కాలం క్రితం ఆమెకు ప్రసాద్ అనే వ్యక్తితో పరిచయం అయింది.


ఇద్దరూ ఫిబ్రవరి 20వ తేదీన పెళ్లి చేసుకున్నారు. అయితే, వీరి పెళ్లి ఆలీషా అలియాస్ పాండు అనే యువకుడికి నచ్చలేదు. నూకరత్నం హౌస్ కీపింగ్ చేస్తున్న చోట పాండు వంటవాడిగా పని చేస్తున్నాడు. అతడు నూకరత్నంను ఇష్టపడ్డాడు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నాడు. ఇంతలోనే నూకరత్నం.. ప్రసాద్‌ను పెళ్లి చేసుకుంది. దీంతో పాండు తట్టుకోలేకపోయాడు. ఈ నెల 19వ తేదీన తండ్రి లాలూ, స్నేహితుడు జాన్‌లతో కలిసి నూకరత్నం ఇంటికి వెళ్లాడు. ఆమెను తనతో పాటు రమ్మని అడిగాడు. ఇందుకు నూకరత్నం ఒప్పుకోలేదు.


ఆమె తన మాట వినకపోవటంతో పాండు ఆగ్రహానికి గురయ్యాడు. వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేశాడు. పాండు కత్తి దాడిలో నూకరత్నం తీవ్రంగా గాయపడింది. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే ఆమెను గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడ్డ పాండుతో పాటు అతడి తండ్రి లాలూను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.


ఇవి కూడా చదవండి

ఏపీ పారిశ్రామిక రంగంలో మరో ముందడుగు

ఆంక్షలు ఎత్తేసిన అమెరికా.. ఇరాన్ ముడి చమురుపై భారత రిఫైనరీల దృష్టి..

Updated Date - Mar 21 , 2026 | 07:59 PM