Share News

ఏ నియోజకవర్గంలోని పేదలకు ఆ నియోజకవర్గంలోనే ఇళ్లు

ABN , Publish Date - Sep 11 , 2026 | 05:58 AM

పేదల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ వారు నివసించే ప్రాంతాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నదే తమ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు.

ఏ నియోజకవర్గంలోని పేదలకు   ఆ నియోజకవర్గంలోనే ఇళ్లు
pONGULATI

  • ఇతర నియోజకవర్గాలకు చెందినవారు డ్రాలో ఎంపికైనా వారి పేర్లు తొలగిస్తాం

  • 5 లక్షల సహాయం పెంపునకు పరిశీలిస్తాం

  • తగ్గింపు ధరకు స్టీల్‌ ఇచ్చేందుకు చర్యలు

  • అసెంబ్లీలో మంత్రి పొంగులేటి

హైదరాబాద్‌, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): పేదల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ వారు నివసించే ప్రాంతాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నదే తమ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. పేదలను వారి జీవనోపాధికి దూరంగా 30-40 కిలోమీటర్ల అవతలికి పంపించడం తమ ప్రభుత్వ విధానం కాదని స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ఎకరం రూ.150-200 కోట్లు విలువ చేసే ప్రాంతాల్లో కూడా పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. గురువారం శాసనసభలో ఎమ్మెల్యేలు మనోహరరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, మేడిపల్లి సత్యం, అక్బరుద్దీన్‌, వెంకట్రామిరెడ్డి తదితర సభ్యులు ఇందిరమ్మ ఇళ్లపై అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. లబ్ధిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకత పాటిస్తున్నామని, అధికారులు డ్రాలో ఎంపికైన ప్రతి లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి పరిశీలిస్తున్నారని చెప్పారు. ఇతర నియోజకవర్గాలకు చెందినవారు ఎంపికైనట్లు తేలితే వారి పేర్లను తొలగిస్తామని తెలిపారు. హైదరాబాద్‌ క్యూర్‌ ప్రాంతంలోని 20 నియోజకవర్గాల్లో పైలట్‌ మోడల్‌లో ఇందిరమ్మ టవర్ల నిర్మాణానికి చర్యలు చేపట్టామని తెలిపారు. ఇప్పటికే 16 నియోజకవర్గాల్లో లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశామని, భౌతిక పరిశీలన పూర్తిచేసి తుది జాబితా సిద్ధం చేస్తున్నామని చెప్పారు. వచ్చే ఏడాది బోనాల పండగ నాటికి హైదరాబాద్‌లో ఇందిరమ్మ టవర్లలో గృహప్రవేశాలు జరిగేలా కార్యక్రమాన్ని రూపొందించామని తెలిపారు.


ఇందిరమ్మ టవర్ల నుంచే బోనాలు తీసుకెళ్లేలా చేస్తామన్నారు. హైదరాబాద్‌తో పాటు ఇతర కార్పొరేషన్లలోనూ ఇదే విధానాన్ని పైలట్‌ మోడ్‌లో అమలు చేస్తున్నామని, అవసరమైతే మున్సిపాలిటీల్లోనూ పరిశీలిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన సుమారు 59 వేల గుడిసెల్లో నివసిస్తున్న పేదలకు రెండో విడతలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా మిగిలిపోయిన 2 బీహెచ్‌కే ఇళ్లను పూర్తి చేయడంతోపాటు మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం రూ.600 కోట్లకు పైగా ఖర్చు చేసిందని తెలిపారు. గత ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా వదిలిన 2 బీహెచ్‌కే ఇళ్లకు సుమారు రూ.750 కోట్ల బిల్లులు చెల్లించామని చెప్పారు. ఇల్లు నిర్మించుకునే ఆర్థిక స్తోమత లేని డ్వాక్రా మహిళా సంఘాల్లో సభ్యులైన పేదలకు రూ.లక్ష అడ్వాన్స్‌గా అందించే వెసులుబాటు ప్రభుత్వం కల్పించిందని తెలిపారు.

రూ.310-320 సిమెంట్‌ బ్యాగ్‌ రూ.230కే

ఇంటి నిర్మాణంలో ప్రధానమైన సిమెంట్‌ ధరను పేదలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి సిమెంట్‌ కంపెనీలతో చర్చలు జరిపామని మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో రూ.310--320 ఉన్న 50 కేజీల సిమెంట్‌ బ్యాగ్‌ను రూ.230కే పేదలకు అందించేలా ఒప్పందం పూర్తి చేశామని, త్వరలో ఈ విధానం అమల్లోకి వస్తుందని చెప్పారు. స్టీల్‌ను కూడా తక్కువ ధరకు అందించే దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

Updated Date - Sep 11 , 2026 | 05:58 AM