కమనీయ కల్యాణం.. జాతకం జై కొడితేనే!
ABN , Publish Date - Aug 02 , 2026 | 09:25 AM
ఈ పెద్దాళ్లున్నారే? మా ప్రేమను ఎప్పుడూ అంగీకరించరు అని యువతలో చాలామంది ఓ అభిప్రాయం ఏర్పరుచుకున్నా.. కొందరు మాత్రం జాతకాల విషయంలో మీ నమ్మకమే మా నమ్మకం అని శ్రుతి కలుపుతున్నారు! కాబోయే జీవిత భాగస్వామి అన్ని విధాలుగా నచ్చినా, ఆ ప్రేమాయణం పెళ్లిపీటలదాకా వెళ్లాలంటే జాతక చక్రం కుదరాల్సిందేనంటున్నారు.
పెళ్లి కుదరాలంటే కుండలి కలవాల్సిందే!..
70 శాతం వివాహాలు జాతకాల ఆధారంగానే
మ్యాట్రిమోనీలోనూ 36 గణాల పంచాయితీ..
18 పాయింట్లు దాటకపోతే మ్యాచ్ రిజెక్టే
సాంకేతికత పెరిగినా వీడని విశ్వాసం..
జెన్ జీ యువతదీ అదే బాట
ప్రేమ పెళ్లిళ్లకూ జాతక పరిహారాలే శరణ్యం!..
నమ్మకమో, భవిష్యత్తుపై భయమో తెలియని వైనం
జాతకాలతో సంబంధం లేకుండా జరిగే పెళ్లిళ్లు 15 నుంచి 20 శాతమే
దేశంలో జాతకాల మార్కెట్ రూ.లక్ష కోట్లు..
2030 నాటికి రూ.1.8 లక్షల కోట్లకు చేరే అవకాశం
విదేశాల్లో తక్కువే.. అమెరికాలో 27 శాతం మంది జాతకాల బాట
ఈ పెద్దాళ్లున్నారే? మా ప్రేమను ఎప్పుడూ అంగీకరించరు అని యువతలో చాలామంది ఓ అభిప్రాయం ఏర్పరుచుకున్నా.. కొందరు మాత్రం జాతకాల విషయంలో మీ నమ్మకమే మా నమ్మకం అని శ్రుతి కలుపుతున్నారు! కాబోయే జీవిత భాగస్వామి అన్ని విధాలుగా నచ్చినా, ఆ ప్రేమాయణం పెళ్లిపీటలదాకా వెళ్లాలంటే జాతక చక్రం కుదరాల్సిందేనంటున్నారు. పెద్దల్లోనైతే జాతకాల విషయంలో విశ్వాసం ఏమాత్రం సడలలేదు! పెళ్లి బలం, జన్మనామం, నక్షత్రం, రాశులు, గణాలు ఇలా ప్రతీది పక్కాగా కుదిరితేనే నిశ్చితార్థానికి సై అంటున్నారు! కుండలి కుదరకపోతే రేప్పొద్దున భార్యాభర్తలది కలహాల కాపురమే అవుతుందని, చివరికి విడాకుల దాకా వెళుతుందని భయపడుతున్నారు.
సిద్దిపేటకు చెందిన అధ్యాపకుడు శ్రీనివాస్ కుమార్తె అయిన 23 ఏళ్ల శైలజా యాదవ్ కెనడాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. ‘‘అమ్మాయి చదువు అయిపోయింది. చక్కని కొలువూ వచ్చింది. మరి.. పాప పెళ్లెప్పుడు?’’ అని అడిగితే.. ‘‘నా కూతురు జాతకంలో ఇప్పుడు పెళ్లి బలం లేదు. ఆమెకు 27వ ఏట మాత్రమే కల్యాణయోగం ఉందని పురోహితులవారు చెప్పారు. అందుకే ఆగుతున్నాం’’ అని చెప్పారు. ఆధునిక భావాలు నరనరాన జీర్ణించుకుపోయిన ఇంటర్నెట్, ఏఐ యుగంలో జాతకాలపై నమ్మకాలు మరింత బలపడ్డాయనడానికి ఇది చిన్న ఉదాహరణే. జాతకాలు చూడకుండా వివాహ బంధంలోకి అడుగుపెడితే సంసారం సాఫీగా సాగుతుందా? అనే సందేహాలు నేటి తరం యువతీ యువకుల్లోనూ ఉన్నాయి. పెళ్లనేది రెండు మనసుల కలయిక కన్నా.. ఇద్దరి కుండలీల మేలి కలయికకే ప్రాధాన్యం మిన్న అనే నమ్మకం ప్రజల్లో ఏమాత్రం సడలలేదు.
ప్రొఫైల్స్‌లోనే జాతక చక్రం..
తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రతి 100 పెళ్లిళ్లలో 70కి పైగా వివాహాలు.. జాతకాలు పక్కాగా కుదిరాకే జరుగుతున్నాయి! మునుపు పెళ్లిచూపులు జరిగి.. అబ్బాయి, అమ్మాయి పరస్పరం నచ్చిన తర్వాత, ఇల్లు, ఆస్తులు గట్రా చూసుకున్నాక నిదానంగా జాతకాల చిట్టా తిరగేసేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. మ్యాట్రిమోనీ ప్రొఫైల్స్ చూసేటప్పుడే ముందుగా జాతక చక్రాల ఫొటోలు వాట్సాప్‌లలో షేర్ అవుతున్నాయి. జ్యోతిష్యశాస్త్రంలో వివాహ నిశ్చయానికి ఉపయోగించే ‘అష్టకూట గణమిలనం’ పద్ధతికి ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారు. వధూవరుల కుండలిని పరిశీలించినప్పుడు ఇద్దరికీ 36 గణాల్లో కనీసం 18 గణాలు కలిస్తేనే జాతకం కుదిరినట్టుగా భావించి పెళ్లి విషయంలో ముందుకు వెళతారు! జాతకాల పరంగా ఇదే సంప్రదాయాన్ని నేటి యువతీయువకులు, వారి తల్లిదండ్రులు పక్కాగా పాటిస్తున్నారు. ఆధునిక డిజిట్ ఆష్ర్టో సాఫ్ట్‌వేర్‌లలో అయితే 10 పాయింట్లకు కనీసం 5 పాయింట్లు రాకపోతే ఆ సంబంధాన్ని ముఖం మీదే తిరస్కరిస్తున్నారు.
జ్యోతిష్య శాస్త్ర మూలాల నుంచి..
మన దేశంలో వివాహాల కోసం జాతకాలు చూడటమనేది వేదకాలం నాటి జ్యోతిష్య శాస్త్ర మూలాల నుంచి క్రమంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కంప్యూటర్ జాతకాలే కాదు.. కచ్చితమైన సమయం, తేదీలు కూడా అందుబాటులో లేని పాతరోజుల్లో పురోహితులు కేవలం వ్యవహారిక నామం ఆధారంగా లెక్కలు వేసి జాతకాలు చూసేవారు. అంతకుముందు కాలాల్లోనైతే కేవలం గోత్రాలు వేరుగా ఉంటే పెళ్లికి ఓకే చెప్పేవారు. పెళ్లంటే అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూసేవారు. మాటతీరుకు ప్రాధాన్యమిచ్చేవారు. వ్యవసాయం చేస్తారా? వృత్తిపరమైన నైపుణ్యం ఏమైనా ఉందా? బతుకుదెరువుకు ఉన్న ఆధారం ఏమిటి? అని చూసేవారు. అయితే రానురాను జాతకాలకు ప్రాధాన్యం పెరిగింది. 1980, 1990ల నాటికి పుట్టిన తేదీలు, సమయాలు నమోదు చేయడం పెరగడంతో జన్మ నామం, జన్మ నక్షత్రం, రాశులు, గుణాలను పక్కాగా చూడటం మొదలైంది. నేటి డిజిటల్ యుగంలో ఈ సంప్రదాయం కాస్తా ఆష్ర్టో సాఫ్ట్‌వేర్లు, క్లిక్ చేయగానే వచ్చే డిజిట్ హూరోస్కోప్స్, ఆన్‌లైన్ మ్యాట్రిమోనీ ఫిల్లర్లుగా మారిపోయింది. సాంకేతికతతో ముడిపడి కొత్త జీవితాల్లో కలహాలు, విషాదాల సుడిగుండాల్లో చిక్కుకుపోతామేమో అని జనాల్లో సహజంగా ఉండే భయాన్ని క్యాష్ చేసుకుంటున్న ఆష్ర్టో బిజినెస్‌గా రూపాంతరం చెందింది. జాతకాల భయం దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేర్వేరు రూపాల్లో విస్తరించింది. జాతీయ వినియోగదారుల సర్వేల ప్రకారం... తమిళనాడు, కేరళ ప్రజల్లో జాతకాలపై విశ్వాసం మెండు. యువతీయువకులు గాఢంగా ప్రేమించుకున్నా.. జాతకాలు కుదరలేదని తెలిస్తే మాత్రం పెళ్లికి అస్సలు ఒప్పుకోరు. ఈ రెండు రాష్ట్రాల్లో 75 శాతానికి పైగా వివాహాలు పక్కా జాతకం ప్రకారమే జరుగుతాయి. యూపీ, బిహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో వివాహదోషం ఉన్న అమ్మాయిలకు నివారణ కోసం తొలుత రావిచెట్టుతోనో, విష్ణుమూర్తి విగ్రహంతోనో, కడవతోనో వివాహం జరిపిస్తారు. మహారాష్ట్ర, గుజరాత్‌లో జాతకాలతోపాటు ‘రాశి ప్రాప్తి’, ‘నవగ్రహ శాంతులు’ చేయించడం ఓ ట్రెండ్. ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో సంప్రదాయ పద్ధతులతో పాటు ఆన్‌లైన్ ఆష్ర్టోలాజికల్ యాప్స్ వాడకం విపరీతంగా పెరిగింది. నిమిషానికి రూ.50 నుంచి రూ.200 చెల్లించి మరీ ఫోన్ల ద్వారా జాతక పొంతనలు చూసుకుంటున్నారు.
విదేశాల్లో భిన్నం
యువతీ యువకుల మనసులు కలవాలి. పెళ్లయ్యాక ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఉద్యోగమైనా, వ్యాపారమైనా ఉండాలి! అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో పెళ్లి కుదుర్చే ముందు వీటికే ప్రాధాన్యం ఇస్తారు. పాశ్చాత్య దేశాల్లో పెళ్లికి ముందు ‘ప్రీ-మారిటల్ కౌన్సెలింగ్’, ‘రిలేషన్‌షిప్ థెరఫీ’లకు జనం ప్రాధాన్యం ఇస్తారు. పెళ్లి పేరుతో కలిసి ఉండటంపై ఇద్దరి ఆలోచనా విధానాలు ఎలా ఉన్నాయి? భవిష్యత్తు లక్ష్యాలు ఒకేలా ఉన్నాయా? అని సైకాలజిస్టుల ద్వారా తెలుసుకుంటారు. చట్టపరమైన భద్రత కోసం ప్రీ- సప్లియల్ అగ్రిమెంట్స్’ (పెళ్లికి ముందే ఆస్తుల పంపకాల ఒప్పందాలు) చేసుకుంటారు అయితే విదేశాల్లో స్థిరపడి అక్కడి ప్రజల దోరణుల్లో ఎన్నింటినో ఒంట బట్టించుకుంటున్న మన దేశ యువత పెళ్లి దగ్గరకొచ్చేసరికి మాత్రం జాతక చక్రాలవైపు చూస్తున్నారు. మరి.. అమెరికా వంటి దేశాల్లో అసలు జాతకాలు, గ్రహాలను నమ్మరా? అంటే.. అక్కడా నమ్మకాలున్నాయి. అమెరికాలో జాతకాలు, గ్రహాలను నమ్మేవారు 29శాతం ఉన్నారంటూ ప్యూ రీసెర్చ్ సంస్థ ఇటీవల తమ సర్వేలో తేల్చింది. అయితే ఇది 27శాతానికి పడిపోయిందని తాజాగా పేర్కొంది.
మనసులు కలవడం ముఖ్యం
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ డిజిటల్ మ్యాట్రిమోనీ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ... ‘మా వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అయ్యే ప్రతి 100 ప్రొఫైల్స్‌లో 85 మంది జాతకచక్రం వివరాలను అప్‌లోడ్ చేస్తున్నారు. జనం డిమాండ్ మేరకే మేము ‘ఆటోమేటెడ్ ఆష్ర్టో మ్యాచింగ్’ ఫీచర్ పెట్టాల్సి వచ్చింది. ఎడ్యుకేషన్, శాలరీ కంటే ‘జాతకం కుదిరినవి మాత్రమే చూపించు’ అనే ఎక్కువగా అడుగుతున్నారు. జాతకాలు కలవలేదనే కారణంతో వేల సంబంధాలు రిజెక్ట్ అవుతున్నాయని చెప్పారు.
జెన్ జీ హుజూర్ అంటున్నారు
జెన్‌జీ యుగం కూడా జాతకాలను కొట్టిపారేయడం లేదు. నిజం చెప్పాలంటే వారే ఎక్కువగా నమ్ముతున్నారు. నమ్రో వాణి సర్వే ప్రకారం దేశంలో 51 శాతం మంది యువత తమ జాతకం ఎలా ఉందోనని దినసరి ఫలాలను చూసుకుంటున్నారు. 88శాతం మంది వార ఫలాలను చూసుకుంటున్నారు. పెళ్లిళ్ల విషయంలోనైతే 75శాతం మంది జాతకాల ప్రకారమే ముందుకు వెళుతున్నారు.
జాతకాల మార్కెట్ రూ.లక్ష కోట్లు
దేశంలో జాతకాల మార్కెట్ సుమారు రూ.లక్ష కోట్ల మేర ఉంది. 2030 నాటికి ఇది రూ.1.8 లక్షల కోట్ల మార్కెట్‌గా అవతరించనుందని అంచనాలున్నాయి. జాతకాలు చెప్పేవారిలోనూ చాలా మార్పు వచ్చింది. ఆన్‌లైన్ జాతకాలు, ఫోన్‌లో జాతకాలు చెప్పే పరిస్థితికి వచ్చారు. ఒకసారి పేరొచ్చిందంటే చాలు.. వారి అపాయింట్‌మెంట్ కోసం క్యూలు కట్టే పరిస్థితి. కొవిడ్ తర్వాత జాతకాలపై నమ్మకం మరింత పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి.
పక్కన పెట్టేస్తే పోలా!
జాతకాలను పూర్తిగా పక్కన పెట్టేసేవారి సంఖ్య మన దేశంలోనూ పెరుగుతోంది. సామాజిక సర్వేల ప్రకారం. దేశంలో 15-20 శాతం మంది ముహూర్తాలు, జాతకాలతో సంబంధం లేకుండా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. రాహుకాలం, దుర్ముహూర్తం, వర్జ్యం లాంటివి ఏవీ చూడకుండా.. తమకు వీలైన ఓ ఆదివారమో లేదా ప్రభుత్వ సెలవు రోజో చూసుకుని పెళ్లి చేసుకునే వారి సంఖ్య 5శాతం వరకు ఉంది. ప్రేమ వివాహాల్లోనైతే తమ పెళ్లికి పెద్దలను ఒప్పించేందుకు దొంగ జాతకాలు సృష్టిస్తున్నారు.