Share News

తప్పు మీరు చేసి.. అధికారులపై నెపమా?

ABN , Publish Date - Oct 16 , 2026 | 02:46 AM

‘‘రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభానికి మీ చేతగానితనమే కారణం. తప్పు మీరుచేసి.. విద్యుత్‌ అధికారులపై నెపం మోపుతారా..? సీఎం, మంత్రులు తప్పుచేసి.. అధికారులపై నెపం నెట్టడం పరిపాటిగా మారింది.

తప్పు మీరు చేసి..   అధికారులపై నెపమా?
harishrao

  • రేవంత్‌.. నీ ఉద్యోగం ఊడకుండా చూస్కో

  • సాగుకు 8 గంటలు కూడా విద్యుత్‌ ఇవ్వలేని కాంగ్రెస్‌ సర్కార్‌నే సస్పెండ్‌ చేయాలి

  • రైతు బీమాను నిలిపివేయడంతో 3 వేల..కుటుంబాలు రోడ్డునపడ్డాయి: హరీశ్‌రావు

హైదరాబాద్‌/సిద్దిపేట, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభానికి మీ చేతగానితనమే కారణం. తప్పు మీరుచేసి.. విద్యుత్‌ అధికారులపై నెపం మోపుతారా..? సీఎం, మంత్రులు తప్పుచేసి.. అధికారులపై నెపం నెట్టడం పరిపాటిగా మారింది. రేవంత్‌రెడ్డీ... అధికారుల ఉద్యోగాలు ఊడతాయని హెచ్చరిస్తున్నావ్‌.. కానీ ప్రజలు, ఉద్యోగులు నీ ఉద్యోగం ఊడగొట్టకుండా చూసుకో’’ అని గురువారం ఎక్స్‌ వేదికగా బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు హెచ్చరించారు. 9నెలలుగా ఎల్‌నినో ప్రభావం గురించి వాతావరణశాఖ, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారని, ఇంతకాలం మొద్దు నిద్రలో ఉండి.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు.. ఇప్పుడు నిద్ర లేచి అధికారులను సస్పెండ్‌ చేస్తామని బెదిరించడం సరికాదన్నారు. నిషేధిత భూముల జాబితాలో తప్పు చేసింది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని, కానీ అధికారుల మీద నెపం నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు కరెంట్‌ సంక్షోభం విషయంలోనూ తమ తప్పేం లేదని, అంతా అధికారులదే అన్నట్లు మాట్లాడుతూ మభ్యపెడుతున్నారన్నారు. బొగ్గునిల్వలు పెట్టుకోకుండా విద్యుత్‌ సంక్షోభానికి కారణమయ్యారని, విద్యుత్‌ రంగాన్ని గాలికి వదిలేసి, కరెంట్‌ కోతలకు కారణం అయ్యింది రాష్ట్ర ప్రభుత్వమ కాదా అని ఆయన ప్రశ్నించారు.


మరోవైపు.. వ్యవసాయానికి 8 గంటలు కూడా విద్యుత్‌ అందించలేని దద్దమ్మ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని సస్పెండ్‌ చేయాలని, ఉద్యోగులను కాదని హరీశ్‌రావు అన్నారు. గురువారం సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కారర్యాలయంలో సిద్దిపేట నియోజకవర్గంలోని రైతు బీమా అందని 22 మంది రైతు కుటుంబాలతో హరీశ్‌రావు సమావేశమై, వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి రైతుల పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తూ, కేసీఆర్‌ అమలు చేసిన రైతు సంక్షేమ పథకాలను నిలిపివేస్తున్నరని మండిపడ్డారు. దేశం మెచ్చిన రైతు బీమా పథకాన్ని నిలిపివేసి రైతు కుటుంబాల ఉసురు పోసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి ఈరోజు వరకు సిద్దిపేట నియోజకవర్గంలో 22 మంది రైతులు చనిపోయారని, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3వేల మంది రైతులు మరణించారని వివరించారు. రైతు బీమా నిలిపివేయడం వల్ల మృతిచెందిన మూడు వేలమంది రైతు కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, అమలు కాని, సాధ్యపడని అడ్డగోలు హమీలిచ్చిన రేవంత్‌రెడ్డి అన్నివర్గాలను మోసం చేశారని హరీశ్‌రావు మండిపడ్డారు. సిద్దిపేటలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ చేపట్టిన నిరవధిక సమ్మెకు ఆయన సంఘీభావం ప్రకటించి మాట్లాడారు.

ఈ వార్తలు కూడా చదవండి

ధరణి, భూభారతిలో లక్షల ఎకరాల దోపిడీ: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

ఉద్యోగం ఊడుద్ది.. జాగ్రత్త!

Updated Date - Oct 16 , 2026 | 02:46 AM