BRS MLA Harish Rao: అబద్ధాలకు ఆస్కార్ ఇస్తే రేవంత్‌కే!
ABN , Publish Date - Jan 02 , 2026 | 05:10 AM
కృష్ణా జలాల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి టీఎంసీలకొద్దీ అబద్ధాలు చెబుతున్నారని.. క్యూసెక్కులకొద్దీ అజ్ఞానాన్ని పారిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు.
టీఎంసీల కొద్దీ అబద్ధాలు.. క్యూసెక్కుల కొద్దీ అజ్ఞానం
కేసీఆర్ 299 టీఎంసీలకే ఒప్పుకొన్నారని నిస్సిగ్గుగా దుష్ప్రచారం
కృష్ణా జలాల పునఃపంపిణీకి కేంద్రాన్ని ఒప్పించిందే కేసీఆర్
ఓవైపు కేసీఆర్‌ను గౌరవిస్తానంటూ.. మరోవైపు ఉరి తీయాలంటావా?
జూరాల సామర్థ్యం 11 టీఎంసీలు.. దాని కింద 5.50 లక్షల ఎకరాలు
శ్రీశైలం సామర్థ్యం 308 టీఎంసీలు.. దాన్ని ఆంధ్రాకు ఇచ్చేద్దామా?
బనకచర్ల కంటే నల్లమలసాగర్‌తో రెట్టింపు ప్రమాదం
తెలంగాణ సోయుంటే ఉత్తమ్ అలా మాట్లాడరు.. ‘ఆంధ్రజ్యోతి’తో హరీశ్
హైదరాబాద్, జనవరి 1 (ఆంధ్ర జ్యోతి): కృష్ణా జలాల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి టీఎంసీలకొద్దీ అబద్ధాలు చెబుతున్నారని.. క్యూసెక్కులకొద్దీ అజ్ఞానాన్ని పారిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. అబద్ధాలకు ఆస్కార్ ఇస్తే అది రేవంత్‌రెడ్డికే దక్కుతుందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడం వల్లే నష్టం జరిగిందని, కృష్ణా జలాల్లో ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలకు కేసీఆర్ అంగీకరించడమే రాష్ట్రానికి మరణ శాసనమన్న సీఎం వ్యాఖ్యలపై హరీశ్ మండిపడ్డారు. మరోవైపు ‘తెలంగాణ సోయి.. బుర్రలో మెదడు ఉంటే అలా మాట్లాడరు’ అంటూ మంత్రి ఉత్తమ్‌పైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాలమూరు ప్రాజెక్టు, కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిందే బీఆర్‌ఎస్ అని కాంగ్రెస్ విమర్శిస్తోంది. తుమ్మిడిహెట్టి, పాలమూరు ప్రాజెక్టులకు కేసీఆర్ అన్యాయం చేశారని ధ్వజమెత్తుతోంది. బీఆర్‌ఎస్ పాలనలో కృష్ణా ప్రాజెక్టులపై కక్ష కట్టారని ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో కృష్ణా, గోదావరి జలాలు, ప్రాజెక్టులపై హరీశ్ ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు..
కేసీఆర్, హరీశ్, కేటీఆర్‌లను ఉరితీయాలని.. కృష్ణా జలాలు ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలకు అంగీకరిస్తూ కేసీఆర్ సంతకం చేయడమే మరణశాసనమని రేవంత్ అన్నారు. దీనిపై మీరేమంటారు?
రేవంత్‌రెడ్డి నోటి నుంచి టీఎంసీల కొద్దీ అబద్ధాలు.. క్యూసెక్కుల కొద్దీ అజ్ఞానాన్ని పారించారు. అబద్ధాలకు ఆస్కార్ ఇస్తే అంతా ముక్తకంఠంతో ఆయన్నే ఎంపిక చేస్తారు. బేసిన్లపై ఆయనకు కనీస పరిజ్ఞానం లేదన్నది వాస్తవం. ఇవాళ కొత్తగా తెలిసింది ఏంటంటే ఆయనకు బచావత్ ట్రైబ్యునల్‌కు, బ్రిజేష్ ట్రైబ్యునల్‌కు తేడా తెలియదని! సభకు వస్తే కేసీఆర్‌ను అవమానించబోమని ఓవైపు చెబుతూ.. మరోవైపు కేసీఆర్‌ను కసబ్‌తో పోలుస్తారా? కేసీఆర్‌ని, కేటీఆర్‌ని, నన్ను ఉరితీయాలని, రాళ్లతో కొట్టాలని అనాగరిక వ్యాఖ్యానాలు చేస్తూ మరోవైపు మర్యాద పాటిస్తానని సుద్దపూస కబుర్లు చెబుతారా? ఆవు తోలు కప్పుకున్న తోడేలులా మాట్లాడారు. పోలవరం-నల్లమలసాగర్ విషయంలో సీఎం సూటిగా ఎందుకు సమాధానం చెప్పడం లేదు. గోదావరి-బనకచర్లపై పోరాటం నిజమే అయితే ఢిల్లీ సమావేశానికి రేవంత్ ఎందుకెళ్లారు? దానిపై కమిటీ వేసి, దాన్ని రహస్యంగా ఎందుకుంచారు? కమిటీ వేయడం అంటేనే ఏపీ జలదోపిడీకి తలుపులు తెరవడం అనే విషయం మెడకాయ మీద తలకాయ ఉన్న వారెవరికైనా అర్థమవుతుంది. కృష్ణాలో 763 టీఎంసీలు అడుగుతున్నానని రేవంత్ చెబుతూ.. మరోవైపు కేసీఆర్ 299 టీఎంసీలకే ఒప్పుకున్నారని నిర్లజ్జగా అబద్ధాలు చెబుతున్నారు. కేసీఆర్ ఆ రోజే 69 శాతం వాటా కావాలన్నారు. రెండు అపెక్స్ కమిటీ సమావేశాల్లోనూ కేసీఆర్ దీనిపై నిలదీశారు. ఆ మినిట్స్ పంపిస్తా. కళ్లు తెరిచి చదువుకో. కృష్ణా జలాల పునఃపంపిణీ చేయిస్తామన్న కేంద్రం హామీ మేరకే నాడు సుప్రీంకోర్టులో మేం కేసు ఉపసంహరించుకున్న విషయం సీఎంకు తెలియదా? సెక్షన్ 3 ద్వారా కృష్ణా జలాల పునఃపంపిణీ సాధించిన మహనీయుడు కేసీఆర్. ఆయన తెలంగాణకు చేసిన మేలు ఎనలేనిది.
కాళేశ్వరానికి ఇచ్చిన ప్రాధాన్యం పాలమూరు-రంగారెడ్డికి ఇవ్వలేదన్న విమర్శలపై?
బీఆర్‌ఎస్ హయాంలో కాళేశ్వరం కంటే ముందే పాలమూరు పనులు ప్రారంభించాం. కాంగ్రెస్ పార్టీ పాలమూరుపై పగబట్టింది. కాళేశ్వరంపై కక్ష కట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో 2009 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డిపై ఒక నోట్ ఇచ్చింది. ఆ తర్వాత 2014 ఎన్నికలకు ముందు దానికి సంబంధించిన జీవో ఇచ్చారు. అంటే ఆ ప్రాజెక్టుపై జీవో ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆరేళ్లు పట్టింది. ఆ తర్వాత నీటి కేటాయింపుల జీవోలూ రాలేదు. నిజంగా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టు చేపట్టి ఉంటే ఇవాళ దానిపై హక్కు ఎస్టాబ్లిష్ అయ్యేది. కానీ, జీవో ఇవ్వడానికి, డీపీఆర్ తయారు చేయడానికే ఆరేళ్లు తీసుకుంది. ఇదీ కాంగ్రెస్ నిర్లక్ష్యం.
బీఆర్‌ఎస్ పదేళ్లలో రూ.27 వేల కోట్లు వెచ్చిస్తే.. తాము రెండేళ్లలోనే 7వేల కోట్లు వెచ్చించామని సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్‌లు చెబుతున్నారు?
మేం పాలమూరు ప్రాజెక్టు మొదలుపెట్టి ముందుకెళ్తుంటే కాంగ్రెస్ నేతలు స్టే తెచ్చారు. దానివల్ల ఏడాది ఆగిపోయింది. రెండోది.. నికర జలాలు లేకపోవడంతో అనుమతులు రాలేదు. దీంతో మేం పాలమూరును కూడా కాళేశ్వరం కార్పొరేషన్‌లో భాగంగా చూపాం. ఫలితంగా అనుమతులొచ్చాయి. కార్పొరేషన్‌కి వచ్చిన నిధుల్లో రూ.10 వేల కోట్లు పాలమూరుకు ఖర్చు చేశాం. ఇది మా చిత్తశుద్ధి. వాళ్లు ఖర్చు పెట్టామంటున్న రూ.7 వేల కోట్ల సంగతి చూద్దాం. మా హయాంలో చేసిన పనులకు ఎంబీ రికార్డు చేసి, కమీషన్లు తీసుకొని బిల్లులిచ్చారు. రెండేళ్లలో చేసిన వాస్తవ పనులు రూ.1000-2000 కోట్లే. ఈ ప్రాజెక్టులో ప్యాకేజీ-3 కింద 1.5 కి.మీ. పొడవుండే ఒక కాలువను కూడా తవ్వలేదు. మేం ఏదుల, వట్టెం రిజర్వాయర్లు పూర్తిచేశాం. వీటి సామర్థ్యం దాదాపు 20 టీఎంసీలు. కాలువ పూర్తిచేసి ఉంటే వీటిల్లో నీటిని నింపే అవకాశం ఉండేది.
పాలమూరును జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడం వల్లే నష్టం జరిగిందన్న సీఎం విమర్శలపై ఏమంటారు?
సమైక్యవాదుల ఆలోచనా ధోరణి నుంచి ఇంకా కొందరు బయటకు రావడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు లేనిచోట్ల, అంతర్రాష్ట్ర వివాదాలు ఉన్న చోట్ల, వన్యప్రాణులు ఉన్నచోట ఈ ప్రాజెక్టులు ఇరికించారు. బీఆర్‌ఎస్ వచ్చాక నీళ్లున్న చోటకు, అంతర్రాష్ట్ర వివాదాలు లేని చోటకు, వన్యప్రాణి అంశాలు లేని చోటకు మార్చాం. నిన్న ‘ఆంధ్రజ్యోతి’లో చదివా. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ఎత్తులో తేడా 100 మీటర్లు అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద ఎత్తు 148 మీటర్లు. మేడిగడ్డ వద్ద ఎత్తు 100 మీటర్లు. తేడా 48 మీటర్లయితే ఆయన 100 మీటర్లు అంటున్నారు. ఇక జూరాల నుంచి శ్రీశైలానికి మారిస్తే ఎత్తులో 100 మీటర్లు తేడా వచ్చిందన్నారు. జూరాల పూర్తి రిజర్వాయర్ లెవల్ (ఎఫ్‌ఆర్‌ఎల్) 318.51 మీటర్లు. శ్రీశైలం ఎఫ్‌ఆర్‌ఎల్ 269.75 మీటర్లు. తేడా 48.76 మీటర్లయితే ఆయన 100 అనడం అవగాహనా రాహిత్యం. మరోవైపు తుమ్మిడిహెట్టి దగ్గర చాప్రాల్ వైల్డ్‌లైఫ్ ఉంది. మరో పదేళ్లయినా అనుమతి రాదు. తుమ్మిడిహెట్టి దగ్గర అంత నీరు లేదని, ప్రత్యామ్నాయం చూసుకోవాలని నాటి కేంద్ర మంత్రి ఉమాభారతి సూచించారు. అందుకే నీళ్లున్న చోటకు వెళ్లాం. మేడిగడ్డ నుంచి 240 టీఎంసీలు తీసుకోవడానికి అనుమతి వచ్చింది. తుమ్మిడిహెట్టి దగ్గరే నీరుంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్న 8 ఏళ్లలో ఎందుకు అనుమతి తేలేదు? జూరాల నుంచి శ్రీశైలానికి ఎందుకు మార్చారని తెలంగాణ సోయి ఉన్నోడు, బుర్రలో మెద డున్నోడు ఎవరూ మాట్లాడరు. శ్రీశైలం సామర్థ్యం 308 టీఎంసీలు. జూరాల 11 టీఎంసీలు కాగా.. 5.50 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. యాసంగి పంటకు జూరాల ఆయకట్టుకు క్రాప్ హాలిడే నడుస్తోంది. అదే శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకునేలా నిర్మించిన కల్వకుర్తి కింద 3 లక్షల ఎకరాలకు యాసంగి పంటకు నీరందుతోంది. ఇంకోటి సీఎం అన్ని నదులు నీళ్లు జూరాలకే వస్తున్నాయంటున్నారు. జూరాలలో కృష్ణా నీరు ఒక్కటే. శ్రీశైలం దగ్గర తుంగభద్ర నీరు కూడా కలుస్తుంది. అది కూడా ఆయనకు తెలీదు. మరో కీలక అంశం.. శ్రీశైలం దగ్గర వద్దంటే, ఆ రిజర్వాయర్ మొత్తాన్ని ఆంధ్రాకు అప్పగించాలనా? మరోవైపు పాలమూరు కింద 68 టీఎంసీల సామర్థ్యం కలిగిన నార్లాపూర్, కరివెన, వట్టెం, ఏదుల, ఉద్దండాపూర్ రిజర్వాయర్లను పూర్తిచేశాం.
కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే రాయలసీమ ఎత్తిపోతల ప్రారంభమైంది కదా?
పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమించి మంత్రి పదవులకు రాజీనామా చేసిందే మేం. పదవులు పొందింది ఉత్తమ్, కాంగ్రెస్ నేతలు. మేం ఆనాడు రాజీనామా చేశాక ఏర్పడిన ఖాళీల్లోనే ఉత్తమ్ మంత్రి అయ్యారు. బీఆర్‌ఎస్ వచ్చాక రాయలసీమ ఎత్తిపోతల పథకంలో ఇంప్లీడ్ అయి మేం స్టే తెచ్చాం. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో వ్యతిరేకించాం. కేంద్రానికి 18 లేఖలు రాశాం. హరిత ట్రైబ్యునల్‌లో స్టే తెచ్చాం. దాన్ని ఆపిందే బీఆర్‌ఎస్. నాటి ఏపీ సీఎస్, ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ అప్పట్లో తప్పుడు అఫిడవిట్ వేశారు. మేం ఫొటోలతో సహా అది తప్పని గ్రీన్‌ట్రైబ్యునల్‌లో ఇచ్చాం. దీంతో ఆదిత్యనాథ్‌కు జరిమానా కూడా విధించింది. అలాంటి వ్యక్తిని రేవంత్ సర్కారు సలహాదారుగా పెట్టుకుంది. రాయలసీమ ఎత్తిపోతలపై 5.5.2020న జీవో వచ్చింది. దానిపై అభ్యంతరం తెలుపుతూ కేంద్రానికి లేఖ రాశాం. రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేసీఆర్ దాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడారు. ఉత్తరాలు రాశారు. 24.2.2021లో హరిత ట్రైబ్యునల్‌లో స్టే తెచ్చాం. అది ఇప్పటికీ ఉంది.
90 టీఎంసీలతో అనుమతి వచ్చేవరకూ పాలమూరు-రంగారెడ్డిని నిలిపివేయాలా?
మొత్తం 811 టీఎంసీల కృష్ణా నీటిని పంచాలని బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సీడబ్ల్యూసీకి ఫిర్యాదు చేశాం. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ట్రైబ్యునల్ ముందు వాదనలు వేగవంతం చే సి పంపకాలను సాధించాలి. మరోవైపు కేంద్రం కూడా ఒక తప్పు చేసింది. 811 టీఎంసీలు పంచాలంటూ మేమిచ్చిన పిటిషన్‌నే సీడబ్ల్యూసీకి ఇవ్వాలి. కానీ, గోదావరి నుంచి పోలవరం ద్వారా కృష్ణాకు ఏపీ తీసుకునే 80 టీఎంసీల నీటిలో వాటాగా వచ్చిన 45 టీఎంసీలను కూడా జోడించింది. లేకుంటే 90 టీఎంసీలతో ప్రాజెక్టు పూర్తయ్యేది. రెండేళ్లుగా కాంగ్రెస్ సర్కారు ఆలస్యం చేసింది.
గోదావరి-బనకచర్లకు కేంద్రం అనుమతిచ్చేసిందని మీరన్నారు? లేదని ఉత్తమ్ చెప్పారు?
మన దేశంలో వరద జలాలపై ఆధారపడి ప్రాజెక్టుల డీపీఆర్‌లు తీసుకోరు. కానీ, బనకచర్ల విషయంలో సీడబ్ల్యూసీలో డీపీఆర్ తీసుకున్నారు. అందులో అంతర్రాష్ట్ర విభాగం ఒకటి సానుకూల నోట్‌తో దాన్ని పై విభాగానికి పంపింది. దాన్ని మేం బయటపెట్టాం. ఈ అంతర్గత కాగితమూ ఉత్తమ్ వద్ద లేదు. మరోవైపు గోదావరి-బనకచర్లను ఏపీ ప్రభుత్వం గోదావరి-నల్లమలసాగర్‌గా మార్చింది. గోదావరి నీటిని కృష్ణాలోకి తెస్తామని ఏపీ పేర్కొంది. 80 టీఎంసీల కంటే ఎక్కువ మళ్లిస్తే అదే నిష్పత్తిలో ఎగువ రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని ట్రైబ్యునల్ తీర్పు ఉంది. అందుకే గోదావరి-బనకచర్లను ఆపేసిన ఏపీ.. దాన్ని గోదావరి-నల్లమలసాగర్‌గా మార్చింది. గోదావరి నీటిని ప్రకాశం బ్యారేజీ వద్దకు తీసుకొచ్చినా కృష్ణాలో కలపకుండా నీటిని తీసుకెళ్లేలా చేసుకుంటున్నారు. బనకచర్లలో కలపకుండా టన్నెల్ ద్వారా పెన్నా బేసిన్‌కు తీసుకుపోతున్నారు. ఇది నదుల అనుసంధానంలో భాగం అని చెప్పి అనుమతులు, కేంద్ర నిధులు తెచ్చుకోవచ్చని వారి ఎత్తుగడ. ఉత్తమ్ ఏమో బనకచర్లను ఆపేయడం మా విజయం అంటారు. ఆయన అవగాహనారాహిత్యానికి సిగ్గేస్తోంది. బనకచర్ల కంటే నల్లమలసాగర్ రెట్టింపు ప్రమాదం. బనకచర్ల కట్టి గోదావరి జలాలను కృష్ణాకు మళ్లిస్తే 100 టీఎంసీల కృష్ణా నీరైనా మనకు వస్తుంది. నల్లమలసాగర్ అనడంతో గోదావరి లేదు, కృష్ణా రెండూ పోతాయి.