ప్రభుత్వ కాలేజీల్లో చాక్‌పీస్‌లకూ కరువే!
ABN , Publish Date - Jul 03 , 2026 | 06:57 AM
ప్రభుత్వ కాలేజీలు తెరుచుకున్నాయి.. విద్యార్థులూ చేరారు.. అధ్యాపకులు వస్తున్నారు.. కానీ తరగతి గదిలోని బ్లాక్ బోర్డులు మాత్రం బోసిపోతున్నాయి. చాక్‌పీ్‌సలు...
రోజూ వారీ ఖర్చుల బడ్జెట్ విడుదల కాక అవస్థలు
హైదరాబాద్, జూలై 2 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ కాలేజీలు తెరుచుకున్నాయి.. విద్యార్థులూ చేరారు.. అధ్యాపకులు వస్తున్నారు.. కానీ తరగతి గదిలోని బ్లాక్ బోర్డులు మాత్రం బోసిపోతున్నాయి. చాక్‌పీ్‌సలు లేక ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో బోధనకు ఆటంకం ఏర్పడుతోంది. కళాశాలల్లో రోజూ వారీ ఖర్చులకూ నిధులు కేటాయించకపోవడంతో అధ్యాపకులు అవస్థలు పడాల్సి వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 430 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఈసారి పదో తరగతి ఫలితాల్లో 95శాతంపైగా ఉత్తీర్ణత నమోదవడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు పెరిగాయి. సాధారణంగా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే రోజు వారీ ఖర్చుల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తారు. ఒక్కో విద్యార్థికి రూ.25 చొప్పున ఏడాదిలో రెండు సార్లు అందిస్తారు. ఈ నిధులతోనే తరగతి గదిలో అధ్యాపకులు ఉపయోగించే చాక్‌పీసులు, డస్టర్లు కొనుగోలు చేస్తారు. అయితే, ఈ సారి కాలేజీలు ప్రారంభమై నెల రోజులు దాటినా నిధులు విడుదల కాకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తరగతి గదిలో చాక్‌పీసులు లేకపోవడంతో బోధనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ విషయాన్ని ఇంటర్ బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం దక్కలేదని కాలేజీల ప్రిన్సిపాళ్లు వాపోతున్నారు. ‘‘లక్షకు పైగా జీతం తీసుకుంటున్నారు.. చాక్‌పీ్‌సలు తెచ్చుకోలేరా..?’’ అని ఓ ఉన్నతాధికారి ప్రశ్నించారని ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపాల్ ఒకరు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. మరోవైపు, ప్రతి నెలా శానిటేషన్ బిల్లు కింద అందించాల్సిన రూ.15వేలను విడుదల చేయకపోవడంతో కాలేజీల్లో మరుగుదొడ్లను శుభ్రపరిచే వారు కరువయ్యారు. కాలేజీల్లో మరుగుదొడ్లు శుభ్రపరచకపోవడంతో దుర్వాసన వస్తోందని విద్యార్థులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
టీ తాగడం మంచిదే.. కానీ ఈ 6 పొరపాట్లు చేస్తే సమస్యలు తప్పవు
కోళ్లు అరుస్తున్నాయని వెళ్లి చూస్తే.. మృత్యువు వెంటాడింది