Share News

కొరతకు కారణం చమురు కంపెనీలే..

ABN , Publish Date - Mar 27 , 2026 | 04:36 AM

పొద్దున లేచి ఉద్యోగానికి వెళ్లాలంటే సగటు పౌరుడు బైక్‌లో పెట్రోల్‌ పోయించుకొనేందుకు పోరాటం.. ఓ ఆటోవాలా తన ఆటోతో ట్రిప్పులకు వెళ్లాలన్నా పెట్రోల్‌ కోసమో, సీఎన్జీ కోసమో ఆరాటం..

కొరతకు కారణం చమురు కంపెనీలే..

  • ముందుగా డబ్బు చెల్లిస్తేనే బంకులకు పెట్రోల్‌, డీజిల్‌ సరఫరా అంటూ నిబంధన

  • డబ్బు చెల్లించలే క కొన్ని బంకుల్లో నో స్టాక్‌

  • అవి చూసి, కొరత వదంతులతో స్టాక్‌ ఉన్న బంకులపై ఎగబడుతున్న జనం

  • హైదరాబాద్‌లో తగ్గిన క్యూలు

  • సీఎన్జీ, వంటగ్యాస్‌ కోసం తప్పని తిప్పలు

  • ఆసిఫ్‌‌నగర్‌ సీఎన్జీ ఫిల్లింగ్‌ స్టేషన్‌ వద్ద 4 కిలోమీటర్ల మేర ఆటోల క్యూ

  • షేక్‌పేట్‌లో గ్యాస్‌ సిలిండర్ల ఆటోపై ఎగబడి ఎత్తుకెళ్లిన జనం

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

పొద్దున లేచి ఉద్యోగానికి వెళ్లాలంటే సగటు పౌరుడు బైక్‌లో పెట్రోల్‌ పోయించుకొనేందుకు పోరాటం.. ఓ ఆటోవాలా తన ఆటోతో ట్రిప్పులకు వెళ్లాలన్నా పెట్రోల్‌ కోసమో, సీఎన్జీ కోసమో ఆరాటం.. చిన్న వదంతులే పెద్ద విపత్తులకు దారితీస్తున్న ప్రస్తుత కాలంలో సగటు పౌరుడు బతుకు బండి లాగటానికి నిత్యం కష్టాలు పడుతుంటే.. లేని ఈ సంక్షోభాలే కొందరికి అద్భుత ఆదాయ మార్గాలుగా మారుతున్నాయి. దేశంలో ఎక్కడా పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ కొరత లేదని ప్రభుత్వం పదేపదే చెబుతున్నా.. పెట్రోల్‌, గ్యాస్‌ బంకుల వద్ద అవే క్యూలు కనిపిస్తున్నాయి. వంటగ్యాస్‌ సిలిండర్ల కోసం కొన్నిచోట్ల ఏకంగా దొమ్మీలే జరుగుతున్నాయి. దీనికంతటికీ ప్రభుత్వాల నిర్లక్ష్యంతోపాటు క ంపెనీల స్వార్థమే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత ఇంధన సమస్యలకు చమురు కంపెనీల తీరే కారణమని తెలుస్తోంది. పరిస్థితులను అర్థంచేసుకోకుండా రుణ పరిమితిని ఎత్తివేసి, డబ్బు చెల్లిస్తేనే పెట్రోల్‌, డీజిల్‌ ట్యాంకర్లు నింపుతామని కంపెనీలు మొండికేస్తుండటం వల్లే ఈ సమస్య వచ్చిందని కొందరు డీలర్లు చెబుతున్నారు.


ముక్కుపిండి వసూలు

రాష్ట్రంలో ప్రతిరోజూ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐవోసీఎల్‌), భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌), హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌) కంపెనీలు సగటున 13 నుంచి 14 వేల కిలోలీటర్ల పెట్రోల్‌, డీజిల్‌ను సరఫరా చేస్తుంటాయి. దీంట్లో పెట్రోల్‌ 5 వేల నుంచి 6 వేల కిలో లీటర్లు, డీజిల్‌ 7 వేల నుంచి 8 వేల కిలో లీటర్లు ఉంటుంది. ఈ పెట్రోల్‌, డీజిల్‌ సరఫరా చేయటానికి చమురు కంపెనీలు రుణ పరిమితి పద్ధతి (క్రెడిట్‌ లిమిట్‌ సిస్టమ్‌) అమలుచేసేవి. అంటే పెట్రోల్‌ బంకుల డీలర్లకు ముందుగా పెట్రోల్‌, డీజిల్‌ సరఫరా చేసి... అది విక్రయించిన తర్వాత డబ్బు తీసుకునేవి. బీపీసీఎల్‌ నెల వరకు అవకాశం ఇచ్చేది. ఐవోసీఎల్‌ తక్కువలో తక్కువగా 5 రోజుల సమయం ఇచ్చేది. హెచ్‌పీసీఎల్‌ కూడా డీలర్లకు క్రెడిట్‌ లిమిట్‌ ఇస్తుంటుంది. సాధారణ రోజుల్లో రుణ పరిమితితో సరఫరా చేసే ఈ కంపెనీలు.. ఏదైనా విపత్తు వచ్చినప్పుడు విశ్వరూపం చూపిస్తున్నాయి. అమెరికా- ఇరాన్‌ యుద్ధంతో ప్రజల్లో చమురు భయాలు నెలకొన్న ఈ సమయంలో చమురు కంపెనీలు రుణ విధానాన్ని ఎత్తివేశాయి. గత వారం నుంచి పెట్రోల్‌ బంకుల డీలర్లు ముందస్తుగా డబ్బులు చెల్లిస్తేనే ట్యాంకర్లు నింపి పంపిస్తున్నాయి. ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల లోపు డీలర్లు డబ్బులు చెల్లిస్తేనే... ఆ రోజు రాత్రిగానీ, మరుసటి రోజు ఉదయం గానీ ట్యాంకర్లు పంపిస్తున్నాయి. సాధారణ రోజుల్లో చమురు కంపెనీలు వద్దంటే సరఫరా చేస్తున్నాయి. డీలర్లు ఆర్డర్‌ పెట్టినా, పెట్టకపోయినా ట్యాంకర్లు పంపిస్తున్నాయి. ఉక్రెయిన్‌ - రష్యా యద్ధం, కోవిడ్‌ సమయంలో కూడా ఇలాగే చేశాయి. దీంతో సకాలంలో డబ్బు చెల్లించలే ని డీలర్లు పెట్రోల్‌ బంకుల్లో ఉన్న చమురు అమ్మేసి నో స్టాక్‌ బోర్డులు పెడుతున్నారు. తప్పుడు ప్రచారాలతో అసలే ఆందోళనలో ఉండే ప్రజలు.. ఈ బోర్డులు చూడగానే మరింత భయపడిపోతున్నారు. ఎక్కడైనా బంకులు తెరిచి ఉంటే ఒక్కసారిగా ఎగబడుతున్నారు. క్రెడిట్‌ పద్ధతితోపాటు ఆర్థిక సంవత్సరం ముగింపు లెక్కలు అందుకు ఇబ్బందికరంగా మారినట్లు చెబుతున్నారు.


కాస్త తగ్గిన పెట్రో కష్టాలు

రాష్ట్రంలో పెట్రోల్‌ కష్టాలు గురువారం కాస్త తగ్గాయి. మధ్యాహ్నం నుంచి చాలా బంకుల్లో స్టాక్‌ అందుబాటులోకి రావడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. పెట్రోల్‌ కొరత వదంతులతో మంగళవారం ఉదయం నుంచి పెట్రోల్‌ బంకుల వద్దకు వాహనదారులు పోటెత్తిన విషయం తెలిసిందే. దీంతో ఎక్కడ చూసినా భారీ క్యూలు కనిపించాయి. సివిల్‌ సప్లయ్‌ అధికారులు బంకుల యజమానులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ.. ఆయిల్‌ కంపెనీలకు వెంట వెంటనే చెల్లింపులు చేయించి నిల్వలు తెప్పించే ప్రయత్నం చేయడంతో గురువారం పరిస్థితి కాస్త మెరుగుపడింది. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత హైదరాబాద్‌లోని 620 బంకులకు స్టాక్‌ రావడంతో వాహనదారులు ఉపశమనం పొందారు. బంకుల్లో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. బంకుల వద్దకు వచ్చిన వాహనాల్లో మాత్రమే ఇంధనాన్ని నింపారు. క్యాన్లు, డబ్బాల్లో నింపలేదు. కాగా, చాలాచోట్ల నగదు చెల్లిస్తేనే ఇంధనం నింపారు. యూపీఐ, కార్డు పేమెంట్లను అనుమతించలేదు.

సీఎన్జీ కోసం అవస్థలు..

పెట్రోల్‌, డీజిల్‌ ఇబ్బందులు కాస్త తగ్గినప్పటికీ.. సీఎన్జీ కోసం ఆటోడ్రైవర్లు ఇబ్బందులు పడ్డారు. గురువారం ఉదయం బేగంపేట బంకు వద్ద కిలోమీటరుకు పైగా క్యూ కనిపించింది. లాల్‌దర్వాజ ప్రాంతంలో ఉన్న బంక్‌ వద్ద ఉదయం ఆటోడ్రైవర్లు అరకిలోమీటరు మేర ఆటోలను లైన్‌లో నిలిపారు. నిర్వాహకులు గ్యాస్‌ ఫిల్లింగ్‌ చేయకుండా తాళం వేసుకుని వెళ్లిపోవడంతో గందరగోళం నెలకొంది. ఆసి్‌ఫనగర్‌-మల్లేపల్లి ప్రాంతంలోని సీఎన్జీ గ్యాస్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌ వద్ద గురువారం ఆటోలు సుమారు 4 కిలోమీటర్ల దూరం క్యూ కట్టాయి.

గ్యాస్‌ సిలిండర్ల కోసం దొమ్మీ

గ్యాస్‌ కొరత కారణంగా షేక్‌పేట్‌లోని ఇండేన్‌ ఏజెన్సీ వద్ద ప్రజలు సిలిండర్లను దొంగిలించే ప్రయత్నం చేశారు. ఏజెన్సీ నుంచి డెలివరీ కోసం వెళ్తున్న ఓ ఆటోలోని సిలిండర్‌లను కొంతమంది లాక్కున్నారు. వారిని సిబ్బంది అడ్డుకొని సిలిండర్లను తీరిగి స్వాధీనం చేసుకున్నారు. చాలామంది ఒకేసారి ఆటోపై పడి దొమ్మీకి ప్రయత్నించటంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. పోలీసులు వచ్చి వినియోగదారులను శాంతింపజేశారు. గ్యాస్‌ సిలిండర్ల కోసం అంబర్‌పేట చేనంబరు చౌరస్తా సమీపంలోని భారత్‌ గ్యాస్‌ ఏజెన్సీ వద్ద సుమారు 200 మంది ఖాళీ సిలిండర్లతో క్యూ కట్టారు.

Updated Date - Mar 27 , 2026 | 04:36 AM