గ్రామాల నుంచి ఒలింపిక్స్ దాకా!
ABN , Publish Date - Aug 27 , 2026 | 03:59 AM
రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి.. అంతర్జాతీయ స్థాయి శిక్షణతో వారిని ఒలింపిక్స్ వేదిక వరకు తీసుకెళ్లే దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ.. దక్షిణ కొరియాలోని ప్రతిష్ఠాత్మక ‘కొరియా నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ (కేఎన్‌ఎస్‌యూ)’తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు
రాష్ట్రంలో క్రీడాకారులను తీర్చిదిద్దడమే లక్ష్యం
కొరియా నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ అవగాహన ఒప్పందం
2036 ఒలింపిక్స్‌లో పతకాలు సాధించేలా ప్రోత్సాహం
‘ఎక్స్’లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడి
హైదరాబాద్, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి.. అంతర్జాతీయ స్థాయి శిక్షణతో వారిని ఒలింపిక్స్ వేదిక వరకు తీసుకెళ్లే దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ.. దక్షిణ కొరియాలోని ప్రతిష్ఠాత్మక ‘కొరియా నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ (కేఎన్‌ఎస్‌యూ)’తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఇందుకు సంబంధించి బుధవారం ‘ఎక్స్’ వేదికగా కీలక అంశాలను ఆయన పంచుకున్నారు. ప్రపంచ స్థాయి క్రీడా శిక్షణ, స్పోర్ట్స్ సైన్స్, హైపెర్ఫార్మెన్స్ ఎడ్యుకేషన్ తదితర రంగాల్లో ఈ భాగస్వామ్యం దోహదపడుతుందన్నారు. తెలంగాణ క్రీడా ప్రతిభకు ప్రపంచస్థాయి శిక్షణ, క్రీడా విజ్ఞానం, అత్యుత్తమ శిక్షణ విధానాలను అనుసంధానించే వారధిగా ఈ భాగస్వామ్యం నిలుస్తుందన్నారు. అథ్లెట్ ట్రైనింగ్, స్పోర్ట్స్ సైన్స్, హైపెర్ఫార్మెన్స్ ఎడ్యుకేషన్‌లో కేఎన్‌ఎ్‌సయూ అనుభవాన్ని తెలంగాణ యువ క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. గత దక్షిణ కొరియా పర్యటన సందర్భంగా తాను, కేఎన్‌ఎ్‌సయూ ఉన్నత ప్రతినిధి బృందంతో సమావేశమైన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. కేఎన్‌ఎస్‌యూ అధ్యక్షుడు మూన్ వోన్-జే సహా ఉన్నతస్థాయి ప్రతినిధులతో అప్పట్లో విస్తృత చర్చలు జరిపినట్లు తెలిపారు. ప్రతిపాదిత యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీతో, కేఎన్‌ఎ్‌సయూ భాగస్వామ్యంపై ఆ సందర్భంగా చర్చలు జరిగాయని, ఇప్పుడు అవి ఎంవోయూ రూపంలో కార్యరూపం దాల్చాయని వెల్లడించారు.
32 పతకాల్లో 16 కేఎన్‌ఎస్‌యూకే..
ప్రపంచ క్రీడా రంగంలో కేఎన్‌ఎస్‌యూకు ఉన్న ప్రాధాన్యాన్ని పారిస్ ఒలింపిక్స్ ఫలితాలు చాటి చెబుతున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో దక్షిణ కొరియా సాధించిన 32 పతకాల్లో 16 పతకాలు కేఎన్‌ఎ్‌సయూలో శిక్షణ పొందిన క్రీడాకారులే సాధించారని తెలిపారు. అదే తరహా క్రీడా నైపుణ్యం, అత్యుత్తమ ప్రదర్శన సంస్కృతిని తెలంగాణలోనూ తీసుకురావాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఈ కీలక భాగస్వామ్యానికి కృషి చేసిన క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఆ శాఖ అధికారులు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రతినిధులను ఈ సందర్భంగా సీఎం అభినందించారు. ప్రపంచ క్రీడా ప్రమాణాలను తెలంగాణ యువ క్రీడాకారులకు చేరువ చేసేందుకు ఈ ఒప్పందం కొత్త అవకాశాలను తెరుస్తుందని అభిప్రాయపడ్డారు. భారత్ 2036 ఒలింపిక్స్ వైపు అడుగులు వేస్తున్న నేపథ్యంలో తెలంగాణ కూడా అందుకు సిద్ధమవుతోందని తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన క్రీడా ఈవెంట్‌కు ఆతిథ్యమివ్వడమే కాకుండా.. భారత్‌కు గర్వకారణంగా నిలిచే క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యమన్నారు
క్రీడా విద్య, పరిశోధనలో భాగస్వామ్యం..
యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, కొరియా నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ (కేఎన్‌ఎస్‌యూ) మధ్య కుదిరిన ఒప్పందం ద్వారా.. ఇరు విశ్వవిద్యాలయాలు క్రీడా విద్య, స్పోర్ట్స్ సైన్స్, పరిశోధన, సాంకేతిక ఆవిష్కరణలు, అధ్యాపకుల అభివృద్ధి, విద్యార్థుల మార్పిడి, అత్యున్నత స్థాయి క్రీడాకారుల శిక్షణ, పనితీరు మెరుగుదల వంటి అంశాల్లో పరస్పరం సహకరించుకోనున్నాయి. ఒప్పందంలో భాగంగా అకడమిక్ కార్యక్రమాలు, పాఠ్య ప్రణాళికల అభివృద్ధి, నాణ్యతా ప్రమాణాల మెరుగుదల వంటి అంశాల్లో ఇరు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి. అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు, ప్రొఫెషనల్ సిబ్బంది పరస్పర మార్పిడి ద్వారా అంతర్జాతీయ అనుభవాన్ని పంచుకునే అవకాశం కలుగుతుంది.
స్పోర్ట్స్ సైన్స్‌కు ప్రాధాన్యం..
అత్యున్నత స్థాయి క్రీడాకారుల పనితీరును మెరుగుపరచడంలో స్పోర్ట్స్ సైన్స్ కీలకంగా మారుతున్న నేపథ్యంలో ఈ శిక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. స్పోర్ట్స్ సైన్స్, కోచింగ్, అథ్లెట్ డెవల్‌పమెంట్, పనితీరు మెరుగుదల వంటి అంశాల్లో ఇరు విశ్వవిద్యాలయాలు తమ అనుభవం, నైపుణ్యాలను పరస్పరం పంచుకోనున్నాయి. కాన్ఫరెన్సులు, సెమినార్లు, శిక్షణా కార్యక్రమాలు, నిపుణుల పరస్పర సందర్శనలు, ఉత్తమ అంతర్జాతీయ విధానాల మార్పిడి ద్వారా సంస్థాగత సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఒప్పందంలో ఉద్దేశించారు. ఈ సహకారంలో హైదరాబాద్‌లోని రిపబ్లిక్ ఆఫ్ కొరియా కాన్సుల్ జనరల్ సమన్వయ సంస్థగా వ్యవహరించనున్నారు. ఇరు విశ్వవిద్యాలయాల మధ్య కమ్యూనికేషన్, సంస్థాగత సమన్వయానికి సహకరించడం మాత్రమే వారి పాత్ర. కాన్సులేట్‌పై ఎలాంటి చట్టపరమైన, ఆర్థిక, అకడమిక్ లేదా పరిపాలనా బాధ్యతలు ఉండవు. ఈ ఒప్పందం ఐదేళ్లపాటు అమల్లో ఉంటుంది. పరస్పర అంగీకారంతో దీనిని పునరుద్ధరించుకోవచ్చు లేదా సవరించుకోవచ్చు. ఏదైనా ఒక సంస్థ ఒప్పందాన్ని ముగించాలనుకుంటే ఆరు నెలల ముందస్తు లిఖితపూర్వక నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. కాగా, తెలంగాణలో క్రీడా విద్య, శిక్షణ, పరిశోధనకు అంతర్జాతీయ ప్రమాణాలను అనుసంధానించడంలో ఈ భాగస్వామ్యం కీలక అడుగుగా నిలిచే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ కొరియా క్రీడా విద్య, శిక్షణ, స్పోర్ట్స్ సైన్స్ రంగాల్లో సాధించిన అనుభవాన్ని తెలంగాణలోని క్రీడా విద్యార్థులు, కోచ్‌లు, పరిశోధకులు, క్రీడాకారులు అందిపుచ్చుకునేందుకు ఈ సహకారం ఉపయోగపడనుంది.
క్రీడా విద్య, పరిశోధనలో భాగస్వామ్యం..
యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, కొరియా నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ( కేఎన్‌ఎస్‌యూ) మధ్య కుదిరిన ఒప్పందం ద్వారా.. ఇరు విశ్వవిద్యాలయాలు క్రీడా విద్య, స్పోర్ట్స్ సైన్స్, పరిశోధన, సాంకేతిక ఆవిష్కరణలు, అధ్యాపకుల అభివృద్ధి, విద్యార్థుల మార్పిడి, అత్యున్నత స్థాయి క్రీడాకారుల శిక్షణ, పనితీరు మెరుగుదల వంటి అంశాల్లో పరస్పరం సహకరించుకోనున్నాయి. ఒప్పందంలో భాగంగా అకడమిక్ కార్యక్రమాలు, పాఠ్య ప్రణాళికల అభివృద్ధి, నాణ్యతా ప్రమాణాల మెరుగుదల వంటి అంశాల్లో ఇరు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి. అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు, ప్రొఫెషనల్ సిబ్బంది పరస్పర మార్పిడి ద్వారా అంతర్జాతీయ అనుభవాన్ని పంచుకునే అవకాశం కలుగుతుంది.