Share News

దృష్టి లోపం ఉన్న విద్యార్థులకు తొలి న్యాయ కళాశాల

ABN , Publish Date - Nov 10 , 2026 | 01:57 AM

దృష్టి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రత్యేక న్యాయ కళాశాలను జీయర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డి తెలిపారు.

దృష్టి లోపం ఉన్న విద్యార్థులకు తొలి న్యాయ కళాశాల
chinajiar

  • జీయర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 2027 నుంచి ప్రారంభం

  • చినజీయర్‌ స్వామి తిరునక్షత్ర మహోత్సవంలో బాలకిష్టారెడ్డి వెల్లడి

  • స్వామి జన్మదిన వేడుకలకు హాజరైన మంత్రి తుమ్మల, మాజీ మంత్రి హరీశ్‌రావు

శంషాబాద్‌ రూరల్‌, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): దృష్టి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రత్యేక న్యాయ కళాశాలను జీయర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలంలోని ముచ్చింతల్‌లో జరుగుతున్న త్రిదండి రామనుజ చినజీయర్‌ స్వామి 70వ తిరునక్షత్ర మహోత్సవాల రెండో రోజు వేడుకల్లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కళాశాల ఏర్పాటుకు సమర్పించిన దరఖాస్తును మండలి ఆమోదించిందని తెలిపారు. స్వామి వారి జన్మదిన వేడుకలకు మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ అంధుల పాఠశాల, కళా శాల, ఆస్పత్రిని నిర్వహిస్తూ చినజీయర్‌ స్వామి పేదలకు సహా యం చేస్తున్నారని కొనియాడారు. హరీశ్‌రావు మాట్లాడుతూ సమాజసేవతో పాటు ఆధ్యాత్మిక బోధనలతో అనేకమందికి స్వామి ఉన్నత మార్గాన్ని చూపిస్తున్నారని తెలిపారు. ఈ వేడుకలకు పలు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా శాస్త్ర నిష్ణాతులుగా అనేక మందిని తీర్చిదిద్దిన పలువురు ప్రముఖులకు చినజీయర్‌ స్వామి పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో మైహోం గ్రూప్‌ అధినేత జూపల్లి రామేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

Updated Date - Nov 10 , 2026 | 01:57 AM