Share News

మంటల్లో ఐదుగురు!

ABN , Publish Date - Jan 25 , 2026 | 03:53 AM

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఒక్కటైన నాంపల్లిలో శనివారం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. నాంపల్లి చీరాగ్‌గల్లీలో ఉన్న బచాస్‌ ఫర్నిచర్‌ క్యాసిల్‌ అనే భవనంలో శనివారం మధ్యాహ్నం 12:30-1:00 సమయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.

మంటల్లో ఐదుగురు!

  • హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఫర్నిచర్‌ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ సిటీ/అఫ్జల్‌గంజ్‌/మంగళ్‌హాట్‌, జనవరి 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఒక్కటైన నాంపల్లిలో శనివారం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. నాంపల్లి చీరాగ్‌గల్లీలో ఉన్న బచాస్‌ ఫర్నిచర్‌ క్యాసిల్‌ అనే భవనంలో శనివారం మధ్యాహ్నం 12:30-1:00 సమయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జీ ప్లస్‌ నాలుగు అంతస్తులు ఉన్న ఈ భవనంలో సతీష్‌ గుప్తా అనే వ్యక్తి కొన్నేళ్లుగా వివిధ రకాల ఫర్నిచర్‌ వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. భవనంలో రెండు సెల్లార్లు ఉండగా శనివారం మధ్యాహ్నం ఓ సెల్లార్‌లో మొదలైన మంటలు భవనమంతా విస్తరించాయి. భవనంలోని ఓ సెల్లార్‌లో ముగ్గురు వాచ్‌మెన్‌ల కుటుంబాలు నివసిస్తుండగా.. అందులో ఒక కుటుంబానికి చెందిన ప్రణీత్‌ (12) అఖిల్‌ (8) అనే చిన్నారులు, వారిని కాపాడేందుకు వెళ్లిన మరో కుటుంబానికి చెందిన ఇంతియాజ్‌, హబీబ్‌ అనే యువకులు, మరో వాచ్‌మెన్‌ కుటుంబానికి చెందిన వృద్ధురాలు(60) లోపలే చిక్కుకున్నారు. ఆరు గంటలకు పైగా శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది దాదాపు 23 అగ్నిమాపక యంత్రాలను వినియోగించి మంటలను అదుపులోకి తెచ్చారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే సెల్లార్లు నీటితో నిండిపోగా, భవనమంతా పొగ కమ్మేయడంతో భవనంలో చిక్కుకున్న వారి ఆచూకీని కనుగొనేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారు. రోబో సాయంతో వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాక సిబ్బంది, అబిడ్స్‌ ఇన్‌స్పెక్టర్‌ రాములు తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని మొదట నాలుగు ఫైర్‌ ఇంజన్‌లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. సాయంత్రమైనా మంటలు అదుపులోకి రాకపోవడంతో బాహుబలి క్రేన్‌, రోబో వంటి ఇతర సాంకేతిక ఎక్వి్‌పమెంట్‌తో పైర్‌, డిజాస్టర్‌ రెస్క్యూ బృందాలను ఉన్నతాధికారులు రంగంలోకి దించారు.


హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌, అగ్నిమాపక శాఖ డీజీ విక్రమ్‌సింగ్‌ మాన్‌ సాయంత్రం ఐదు గంటల సమయంలో ఘటనా స్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం అధికారుల ఆదేశాల మేరకు అగ్నిమాపక సిబ్బంది మంటల వ్యాపించిన అన్ని ఫోర్లలకు ఉన్న అద్దాలను భారీ బ్రాంటో యంత్రంతో బద్దలుకొట్టారు. ఎగసిపడుతున్న దట్టమైన పొగలపై నీళ్లను చల్లి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అయితే, రాత్రి 9:00ల వరకు భవనం లోపల చిక్కుకున్న వారి ఆచూకీ తెలియరాలేదు. ఇక, ఘటనాస్థలంలో సీపీ సజ్జనార్‌ విలేకరులతో మాట్లాడారు. క్షతగాత్రులను కాపాడటానికి అగ్నిమాపక శాఖకు చెందిన రోబోను లోపలికి పంపామని తెలిపారు. కాగా, ప్రమాద తీవ్రతను అంచానా వేయడంలో అగ్నిమాపక సిబ్బంది విఫలం అయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మధ్యాహ్నం సుమారు 12:30- 1:00 మధ్యలో అగ్ని ప్రమాదం సంభవించగా సాయంత్రం 4:30 వరకు అంటే 4 గంటలపాటు కేవలం మంటలు ఆర్పుతూ కాలయాపన చేశారని అంటున్నారు.

స్కూలుకు వెళ్లకపోవడమే తప్పయింది

బచాస్‌ ఫర్నిచర్‌ క్యాసిల్‌ భవనం సెల్లార్‌లో మూడు వాచ్‌మెన్‌ కుటుంబాలు నివసిస్తున్నాయి. నల్లగొండ జిల్లా మాల్‌కు చెందిన యాదయ్య, లక్ష్మి దంపతులు గత ఎనిమిదేళ్లుగా అదే భవనంలో వాచ్‌మెన్‌లుగా పని చేస్తూ సెల్లార్‌లో నివాసముంటున్నారు. వారి పిల్లలు ప్రణీత్‌ (12) అఖిల్‌ (8) గన్‌ఫౌండ్రీలోని ఆలియా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. వ్యక్తిగత పని మీద తండ్రి స్వగ్రామానికి వెళ్లగా.. ఇంట్లో తండ్రి లేకపోవడంతో ఆలస్యంగా నిద్రలేచిన చిన్నారులు శనివారం పాఠశాలకు వెళ్లలేదు. పిల్లలను ఇంట్లోనే ఉంచి తల్లిలక్ష్మి పనిలోకి వెళ్లింది. మధ్యాహ్నం భవనంలో అంటుకోవడం, దట్టమైన పొగలు కమ్ముకోవడం, మంటలు వ్యాపించడంతో చిన్నారులు భవనంలోనే ఉండిపోయారు. వారితో పాటు.. అదే సెల్లార్‌లో ఉండే మరో వాచ్‌మెన్‌ కుటుంబానికి చెందిన వృదుఽ్ధరాలు కూడా లోపల ఉండిపోయిందని చెబుతున్నారు. ఇక, సెల్లార్‌లో చిక్కుకున్న చిన్నారుల కేకలు విన్న అదే భవనంలో ఫిట్టర్‌గా పనిచేస్తున్న ఇంతియాజ్‌, మరో వాచ్‌మెన్‌ కుటుంబానికి చెందిన ఆటోడ్రైవర్‌ హబీబ్‌ లోపలికి వెళ్లినట్లు తెలిసింది. చిన్నారులను కాపాడేందుకు వెళ్లిన వారిద్దరూ కూడా వెనక్కి తిరిగి రాలేదు. దీంతో మొత్తం ఐదుగురు ఆ మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారు కాకుండా ఇంకా ఎవరైనా మంటల్లో చిక్కుకున్నారా..? అనేది తెలియాల్సి ఉంది.

2.jpg3 - Copy.jpg


8.jpg7.jpg

1960లో భవన నిర్మాణం

ఈ భవనాన్ని 1960లో హిందీ ప్రచార సభ పేరుతో నిర్మించినట్లు తెలుస్తోంది. అచ్యుత్‌రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన భూమిలో విరాళాలు సేకరించి కొంతమంది హిందీ ప్రచార సభ నిర్యాహకులు కలిసి ఈ భవనాన్ని నిర్మించినట్లు స్థానికులు చెప్తున్నారు. ఇందులో కొంతకాలం ఎస్‌బీహెచ్‌ బ్యాంకు నిర్వహించారు. ఆ తర్వాత కాలంలో ఫర్నీచర్‌ షాపులు ఏర్పాటు చేశారు. దీనిపై హైకోర్టులో కేసు నడుస్తుండగా.. అందులో ఉన్న షాపులు ఖాళీ చేయాలని ఆదేశాలు ఉన్నా ఖాతరు చేయకుండా దుకాణాలు అక్రమంగా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యం, అక్రమ కట్టడాల వల్లే అగ్నిప్రమాదం సంభవించిందంటూ న్యాయవాదిఇమ్మనేని రామారావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసింది.

6.jpg

మంటలను అదుపులోకి తెచ్చాం..

అగ్నిప్రమాదం విషయం తెలియగానే నాలుగు ఫైర్‌ ఇంజన్‌లు ఘటనా స్థలానికి వచ్చాయి. తీవ్రతను గుర్తించిన తర్వాత సుమారు 10 ఇంజన్‌లు రంగంలోకి దిగాయి. సుమారు 6 గంటలు శ్రమించి మంటలు అదుపులోకి తెచ్చాం. జీప్లస్‌ నాలుగు అంతస్థుల భవనంలో మంటలు వ్యాపించాయి. భవనం కింద రెండు సెల్లార్‌ల్లో ఓ దానిలో ఫర్నిచర్‌కు సంబంఽధించిన మెటీరియల్‌ అంతా డంప్‌ చేశారు. దాంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. షార్ట్‌ సర్క్యూటే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది.

-విక్రమ్‌సింగ్‌ మాన్‌, అగ్నిమాపక శాఖ డీజీ

Updated Date - Jan 25 , 2026 | 07:27 AM