విత్తన కంపెనీ మోసంతో రైతు ఆత్మహత్యాయత్నం
ABN , Publish Date - Sep 16 , 2026 | 01:47 AM
తాను కొన్న వరి విత్తనాలు నాణ్యతలేనివని, ఆ కంపెనీ వల్ల మోసపోయానని మనస్తాపానికి గురైన ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేయగా, మరో ఇద్దరు రైతులు అప్పుల బాధతో ఉరేసుకుని బలవన్మరణం పాలయ్యారు.
అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య
మృతుల్లో ఒకరు కౌలు రైతు
పినపాక/ తలమడుగు/ యాలాల, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): తాను కొన్న వరి విత్తనాలు నాణ్యతలేనివని, ఆ కంపెనీ వల్ల మోసపోయానని మనస్తాపానికి గురైన ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేయగా, మరో ఇద్దరు రైతులు అప్పుల బాధతో ఉరేసుకుని బలవన్మరణం పాలయ్యారు. మృతి చెందిన రైతుల్లో ఒకరు కౌలు రైతు. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట రైతు గుండెబోయిన సర్వేశ్వరరావు గత యాసంగి పంటగా 11 ఎకరాల్లో ఐటీసీ అడ్వాంట విత్తన కంపెనీకి చెందిన 506, 509 రకం వరి వంగడాలు కొనుగోలు చేసి నాటడంతో నష్టపోయానని, ఆశించిన స్థాయిలో దిగుబడి కాదు కదా పెట్టుబడి కూడా రాలేదని పేర్కొన్నాడు. పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చే పరిస్థితి కాన రాక కంపెనీ వారికి ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. కంపెనీ ప్రతినిధులు పంటను పరిశీలించి, తనకు ఇన్సూరెన్స్ ఇప్పిస్తామని చెప్పి.. ఆ తర్వాత ముఖం చాటేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ బాధతోనే తాను చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. సర్వేశ్వరరావు పురుగులమందు తాగినట్లు గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు.
మరో ఘటనలో వికారాబాద్ జిల్లా యాలాల మండలం నాగసముందర్ గ్రామ వాసి బొక్కెన ఆశప్ప (45) అనే రైతు కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగో లేక మనోవేదనకు గురయ్యాడు. మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కేబుల్ వైరుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకో ఘటనలో ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం కజ్జర్ల గ్రామానికి చెందిన కౌలు రైతు ఏడోల ప్రవీణ్ (28).. పొన్నారి గ్రామ శివారులో నాలుగు ఎకరాల భూమి కౌలుకి తీసుకుని పత్తి సాగు చేశాడు. అప్పు చేసి రూ.3 లక్షలు పెట్టుబడి పెడితే.. ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షాలు కురిశాయి. దీంతో పంట ఎదుగుదల ఆగిపోయిందని మనోవేదనకు గురైన ప్రవీణ్.. తాగుడుకి బానిసయ్యాడు. సోమవారం పంట భూమిలోనే చెట్టుకుని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.