30 వేల కోట్లు అడుగుదాం!
ABN , Publish Date - Oct 16 , 2026 | 02:26 AM
కరువు పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రానికి రూ.30 వేల కోట్ల ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలంటూ కేంద్రాన్ని కోరాలని అధికారులు ప్రతిపాదించారు. సచివాలయంలో గురువారం జరిగిన సీఎం, మంత్రుల సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు రామకృష్ణారావు ఎల్‌నినోపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
కేంద్రం కరువు సాయంపై అధికారుల ప్రతిపాదనలు
315 మండలాల్లో కరువు పరిస్థితులపై అంచనాలు
11.18 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం
యాసంగిలో సాగు చేయని పంటలకు పరిహారం
హైదరాబాద్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): కరువు పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రానికి రూ.30 వేల కోట్ల ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలంటూ కేంద్రాన్ని కోరాలని అధికారులు ప్రతిపాదించారు. సచివాలయంలో గురువారం జరిగిన సీఎం, మంత్రుల సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు రామకృష్ణారావు ఎల్‌నినోపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. దీంట్లో భాగంగా కేంద్రం సాయం గురించి ప్రతిపాదనలు చేశారు. చెరువులు, నీటి వనరుల పునరుద్ధరణకు రూ.3,552 కోట్లు, కీలక సాగునీటి ప్రాజెక్టులకు రూ.16,448 కోట్లు, పంపింగ్-లిఫ్టింగ్ అవసరాలకు విద్యుత్ రాయితీ కింద రూ.10 వేల కోట్లు కోరాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ, పౌరసరఫరాలు, పశుసంవర్ధకశాఖ, సాగు, తాగునీరు, జలమండలి, పంచాయతీరాజ్, ఆరోగ్యశాఖ, సాంస్కృతికశాఖల అధికారులు తమ శాఖల పరిధిలో ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కోవటానికి అవసరమైన భవిష్యత్ కార్యాచరణను సీఎం రేవంత్‌కు, మంత్రులకు వివరించారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, పంటల సాగు విస్తీర్ణం తగ్గిపోగా.. సాగులో ఉన్న పంటలపైనా ప్రతికూల ప్రభావం పడుతోందని అధికారులు పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 315 మండలాల్లో కరువు పరిస్థితులున్నట్లు ప్రాథమికంగా అంచనా వేయగా.. ఇందులో 101 తీవ్ర, 214 మధ్యస్థ కరువు ప్రభావిత మండలాలు అని పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ 1వ తేదీ నుంచి సెప్టెంబరు 30 వరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 740.6 మిల్లీమీటర్లు నమోదుకావాల్సి ఉండగా.. 615.5 మి.మీ. మాత్రమే కురిసిందని వివరించారు. అక్టోబరు 15వ తేదీ నాటికి సాధారణ వర్షపాతం 795.7 మి.మీ. పడాల్సి ఉండగా, 615.8 మి.మీ. మాత్రమే నమోదైందని, లోటు 23 శాతానికి పెరిగినట్లు తెలిపారు. గతేడాది 139.28 లక్షల ఎకరాల్లో సాగు జరగ్గా.. ఈ ఏడాది 126.06 లక్షల ఎకరాలకే పరిమితమైందని, 13.22 లక్షల ఎకరాల సాగు తగ్గినట్లు వెల్లడించారు. వరి సాగు 69.19 లక్షల ఎకరాల నుంచి 57.04 లక్షల ఎకరాలకు పడిపోయినట్లు వివరించారు. సుమారు 8.93 లక్షల ఎకరాల్లో పత్తి పంట దెబ్బతినగా.. దిగుబడి 50ు వరకు తగ్గే ప్రమాదముందని అంచనా వేశారు. వరి 1.20 లక్షల ఎకరాల్లో ప్రభావితమై, దిగుబడిలో 30-35ు తగ్గుదల ఉండవచ్చని పేర్కొన్నారు. జిల్లాలవారీగా చూస్తే నల్లగొండలో 3.58 లక్షల ఎకరాలు, జోగులాంబ గద్వాలలో 1.45 లక్షల ఎకరాలు, నాగర్‌కర్నూల్‌లో 1.41 లక్షల ఎకరాలు, రంగారెడ్డిలో 1.29 లక్షల ఎకరాలు ప్రభావితమైనట్లు తెలిపారు. పంట నష్టంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం అందించాలని అధికారులు ప్రతిపాదించారు. విత్తన రాయితీలు, సూక్ష్మసేద్యం, ఉద్యానవన పంటల ప్రోత్సాహకాలు కలిపి మొత్తం రూ.1,986.89 కోట్ల వ్యవసాయ సహాయ ప్యాకేజీని ప్రతిపాదించారు. యాసంగి 2026-27లో వరి సాగు చేయని రైతులకు కూడా ఎకరాకు రూ.10 వేల చొప్పున సాయం అందించే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని అధికారులు సూచించారు.
నీటి నిల్వలు ఆందోళనకరం
జలాశయాల్లో నీటి నిల్వలు ఆందోళనకరంగా ఉండటంతో సాగునీటిని పరిమితంగా విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అధికారుల ప్రజెంటేషన్ ప్రకారం, ప్రాజెక్టుల్లో 466 టీఎంసీల సాధారణ నిల్వ ఉండాల్సినప్పటికీ, ప్రస్తుతం 209.45 టీఎంసీలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో, తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇచ్చి, మిగిలిన నీటిలో 47 టీఎంసీలను వినియోగించి సుమారు 7 లక్షల ఎకరాలకు ఒక్క తడి మాత్రమే అందించాలని అధికారులు ప్రతిపాదించారు. నీటి లభ్యత లేని ప్రాంతాల్లో రైతులు పంట విరామం పాటించాల్సిన అవసరం ఉందన్నారు. 2027 జూలై వరకు తాగునీటి అవసరాలకు 85 టీఎంసీలను ప్రత్యేకంగా నిల్వ ఉంచాలని పేర్కొన్నారు. సింగూరు, మంజీరా జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గడంతో హైదరాబాద్‌కు తాగునీటి సరఫరాపై ప్రభావం పడుతోందని ఈ సమావేశంలో అధికారులు వివరించారు. హైదరాబాద్‌కు రోజుకు సుమారు 560 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తున్నట్లు గుర్తుచేశారు. సింగూరు, మంజీరా నుంచి వచ్చే నీటిలో కొరత ఏర్పడితే ప్రత్యామ్నాయాలపై ఆధారపడాల్సి వస్తుందని.. కృష్ణా నుంచి నీటిని పంపింగ్ చేయడం, మిషన్ భగీరథ సరఫరాలో మార్పులు, గోదావరి నీటిని అదనంగా వినియోగించడం వంటి చర్యలను ప్రతిపాదించారు. నిర్మాణ పనులు, ఇతర అవసరాలకు తాగునీరు, బోరుబావుల నీటిని వినియోగించడంపై క్యూర్ పరిధిలో ఆంక్షలు విధించే అంశాన్ని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో పరిస్థితిని బట్టి మూడు రోజులకు ఒకసారి నీటి సరఫరా చేయాల్సిన అవసరం రావచ్చని అంచనా వేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
ధరణి, భూభారతిలో లక్షల ఎకరాల దోపిడీ: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి