తండ్రేమో దుబాయిలో డాక్టర్.. ఏపీ సర్కారు బడిలో కుమార్తె చదువు
ABN , Publish Date - Jul 09 , 2026 | 04:41 AM
విదేశాల్లో ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడిన వారెందరో సొంతూరి మీద మమకారంతో ప్రభుత్వ పాఠశాలకు లక్షలాది రూపాయలు విరాళంగా ఇవ్వడం చూస్తుంటాం. కానీ.. ఇందుకు భిన్నంగా తన కుమార్తెను స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు ఓ ఎన్నారై..
మాతృభాషపై మమకారంతో చేర్చిన తల్లిదండ్రులు
డిజిటల్ లెర్నింగ్‌కు దూరంగా చేతిరాత సాధన
హైదరాబాద్ సిటీ, జూలై 8 (ఆంధ్రజ్యోతి): విదేశాల్లో ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడిన వారెందరో సొంతూరి మీద మమకారంతో ప్రభుత్వ పాఠశాలకు లక్షలాది రూపాయలు విరాళంగా ఇవ్వడం చూస్తుంటాం. కానీ.. ఇందుకు భిన్నంగా తన కుమార్తెను స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు ఓ ఎన్నారై. ఏలూరు జిల్లా కొణికి గ్రామానికి చెందిన శశికుమార్ దుబాయ్ ప్రభుత్వ ఆరోగ్య శాఖలో కీలక వైద్యుడిగా సేవలందిస్తున్నారు. దుబాయ్‌లో పేరున్న డాక్టర్ అయినప్పటికీ.. ఆయన తన కుమార్తెను స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు. కొణికిలో ప్రభుత్వ హైస్కూలు లేకపోవడంతో అక్కడికి దగ్గర్లోని సత్యవోలు గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తన చిన్న కుమార్తె సోహితను గతేడాది చేర్పించారు. ఇప్పుడు ఆ అమ్మాయి అదే స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతోంది.
డిజిటల్ తరగతులకు దూరంగా..
శశికుమార్ దుబాయి ప్రభుత్వ ఆరోగ్య శాఖలో 20 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. చిన్నమ్మాయి సోహిత దుబాయిలోని ఓ ఇంటర్నేషన్ స్కూల్లో కేంబ్రిడ్జి కరికులంలో ఆరో తరగతి వరకు చదివింది. అయితే ఆమె తెలుగులో అ, ఆ..లు కూడా రాయలేకపోవడం తనను తీవ్రంగా ఆలోచింపచేసిందని శశికుమార్ తెలిపారు. ‘కలం, కాగితానికి బదులుగా చదవడం, రాయడం, నేర్చుకోవడం అంతా ట్యాబ్ లేదా ల్యాప్‌టాప్‌లోనే..! ఓ తండ్రిగానే కాదు... డాక్టరుగా కూడా ఇదెంతమాత్రం మంచిది కాదని గుర్తించాను.’ అని శశికుమార్ చెప్పారు. సర్కారు స్కూల్లో చేర్చడానికి కారణమేంటని ఆయనను అడిగితే... ‘‘ఒకవేళ లక్షల రూపాయలు ఫీజులు కట్టి భారత్‌లోని కార్పొరేట్ పాఠశాలలో చేర్చినా... గవర్నమెంట్ బడిలో నేర్చుకోగలినంత జీవితానుభవాలు అయితే అమ్మాయికి దొరకవు కదా!’’ అన్నారు. సోహిత కూడా గతంలో కంటే చాలా సంతోషంగా, చదువులో చురుగ్గా ఉందని చెప్పారు.